మహా నిదానం | - | Sakshi
Sakshi News home page

మహా నిదానం

May 12 2026 6:18 AM | Updated on May 12 2026 6:18 AM

నత్త నడకన ఎలివేటెడ్‌ స్టీల్‌బ్రిడ్జి భూసేకరణ

ప్రయాణం సులువు

నత్త నడకన ఎలివేటెడ్‌ స్టీల్‌బ్రిడ్జి భూసేకరణ

రక్షణ శాఖ భూములు ఓకే.. ప్రైవేట్‌ వాటిపై నిర్లక్ష్యం

ప్యారడైజ్‌ నుంచి శామీర్‌పేట్‌ వరకు 18.18 కి.మీ. నిర్మాణం

సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎలివేటెడ్‌ స్టీల్‌ బ్రిడ్జి భూసేకరణ నత్తనడకన సాగుతోంది. రెండేళ్ల క్రితమే ప్రణాళికలను రూపొందించి నిర్మాణ సంస్థ ఎంపిక ప్రక్రియను పూర్తిచేశారు. ప్యారడైజ్‌ నుంచి శామీర్‌పేట్‌ వరకు 18.18 కి.మీ. వరకు నిర్మించనున్న ఈ మార్గంలోని రక్షణశాఖ భూముల సేకరణ తుదిదశకు చేరుకుంది. ప్రైవేట్‌ వ్యక్తులకు చెందిన భూములపై జాప్యం నెలకొందని అధికారులు అంటున్నారు. హైదరాబాద్‌, మేడ్చల్‌ జిల్లాల కలెక్టరేట్ల పరిధిలో ఈ మార్గం ఉంది. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రాజెక్టు ముందుకు సాగడం లేదనే చర్చ సాగుతోంది. ఈ మార్గంలో భూసామర్ధ్య పరీక్షలను హెచ్‌ఎండీఏ ఇప్పటికే పూర్తి చేసింది. సికింద్రాబాద్‌ నుంచి శామీర్‌పేట్‌, మేడ్చల్‌ మార్గాల్లో రెండు బ్రిడ్జిల నిర్మాణానికి ప్రణాళికలను రూపొందించారు. మేడ్చల్‌ రూట్‌లో డెయిరీఫామ్‌ బ్రిడ్జి పనులు కొనసాగుతున్నాయి. శామీర్‌పేట్‌ స్టీల్‌బ్రిడ్జికే గ్రహణం పట్టుకుంది.

కొరవడిన సమన్వయం...

వెస్ట్‌ మారేడ్‌పల్లి, కార్ఖానా, తిరుమలగిరి, బొల్లారం, అల్వాల్‌, హకీంపేట్‌, తూంకుంట మీదుగా శామీర్‌పేట్‌ ఓఆర్‌ఆర్‌ జంక్షన్‌ వరకు ఈ ఎలివేటెడ్‌ స్టీల్‌ బ్రిడ్జి కారిడార్‌ నిర్మించనున్నారు. ప్యారడైజ్‌ నుంచి వెస్ట్‌ మారేడ్‌పల్లి, కార్ఖానా వరకున్న మార్గం హైదరాబాద్‌ కలెక్టరేట్‌ పరిధిలో ఉంది. తిరుమలగిరి నుంచి శామీర్‌పేట్‌ వరకున్న మార్గం మేడ్చల్‌ కలెక్టరేట్‌ పరిధిలో ఉంది. రెండు జిల్లాల అధికారులు భూసేకరణ చేపట్టాల్సి ఉంది. ఈ క్రమంలో ఇప్పటివరకు రెండు జిల్లాల్లో ముగ్గురు కలెక్టర్ల చొప్పున బదిలీ అయ్యారు. రెవెన్యూ అధికారుల మధ్య సమన్వయం లేకపోవడం వల్లే భూసేకరణలో జాప్యం నెలకొనడం గమనార్హం. ఈ ప్రాజెక్టు కోసం 9.35 కి.మీ. మార్గంలో 114.50 ఎకరాల రక్షణ శాఖ భూముల సేకరణ తుదిదశకు చేరుకుంది. కానీ, మరో 8.35 కి.మీ. మార్గంలో సేకరించాల్సిన 78.39 ఎకరాల ప్రైవేట్‌ భూములపై నిర్లక్ష్యం కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. రెవెన్యూ అధికారులు ఈ భూమిని సేకరించి హెచ్‌ఎండీఏకు అందజేస్తే సుమారు 937 ప్రైవేట్‌ ఆస్తులను తొలగించి పరిహారం ఇవ్వాల్సి ఉంటుందని అంచనా. హెచ్‌ఎండీఏ రూ.4,263 కోట్లతో అంచనాలను రూపొందించింది. అందులో రూ.2,872 కోట్లు నిర్మాణ వ్యయం కాగా, మరో రూ.1,240 కోట్లను భూసేకరణ కోసం వెచ్చించనున్నారు.

ప్యారడైజ్‌ జంక్షన్‌ నుంచి శామీర్‌పేట్‌ ఓఆర్‌ఆర్‌ జంక్షన్‌ వరకు 18.18 కి.మీ. దూరం చేపట్టనున్న ఈ బ్రిడ్జి నిర్మాణంలో 11.52 కి.మీ. ఎలివేటెడ్‌ కారిడార్‌ ఉంటుంది. హకీంపేట్‌ ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీ వద్ద 6 లేన్‌లతో భూమార్గంలో టన్నెల్‌ నిర్మించనున్నారు. తిరుమలగిరి, అల్వాల్‌ వద్ద వాహనదారులు బ్రిడ్జిపైకి ప్రవేశించేందుకు, నిష్క్రమించేందుకు ఎంట్రెన్స్‌, ఎగ్జిట్‌లు ఉంటాయి. నగరాన్ని రాజీవ్‌ రహదారికి అనుసంధానం చేసేందుకు ఇది దోహదం చేయనుంది. సికింద్రాబాద్‌ నుంచి కరీంనగర్‌ వైపు వెళ్లే వాహనాల రాకపోకలు సులభతరం కానున్నాయి. మరోవైపు ప్యారడైజ్‌ జంక్షన్‌ నుంచి మేడ్చల్‌ రూట్‌లో డెయిరీఫామ్‌ వరకు 5.40 కి.మీ. వరకు చేపట్టిన ఎలివేటెడ్‌ కారిడార్‌ ప్రాథమిక పనులు కొనసాగుతున్నాయి. తాడ్‌బంద్‌, బోయిన్‌పల్లి మీదుగా డెయిరీఫామ్‌ వరకు నిర్మించనున్న ఈ రూట్‌లో బేగంపేట్‌ ఎయిర్‌పోర్టు వద్ద 600 మీటర్ల టన్నెల్‌ రానుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.1,487 కోట్లు వ్యయం కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement