
ఫోన్ చోరీ... ఖాతా ఖాళీ!
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో సంచరించే సిటీ బస్సుల్లో తిరుగుతూ... ప్రయాణికుల సెల్‌ఫోన్లు తస్కరించే ముఠాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఈ సెల్‌ఫోన్లను వినియోగించి వారి బ్యాంకు ఖాతాలను ఖాళీ చేసే గ్యాంగ్స్ ఇటీవల పుట్టుకొచ్చాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓ వ్యక్తి రూ.2.98 లక్షలు నష్టపోగా... తాజాగా ఓ మహిళ రూ.1.04 లక్షలు పోగొట్టుకున్నారు. ఇలాంటి ముఠాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఫోన్ పోయిన వెంటనే కొన్ని కీలక జాగ్రత్తలు తీసుకోవాలని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. నగరానికి చెందిన ఓ మహిళా ఉద్యోగి (45) ఇటీవల తార్నాక నుంచి కాచిగూడకు వెళుతుండగా ఆమె ఫోన్ తస్కరణకు గురైంది. ఆ తర్వాత రెండు రోజులకు ఆమె కాచిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ లోపే నేరగాళ్లు ఆమె బ్యాంకు ఖాతా నుంచి అక్రమ లావాదేవీలు చేసి రూ.1,04,901 కాజేశారు. ఆ ఫోన్‌లో ఉన్న సిమ్‌కార్డు నెంబరే బ్యాంకు ఖాతాతో లింకై ఉండటంతో పాటు యూపీఐ యాప్స్ అందులోనే ఉన్నాయి. ఫోన్ అన్‌లాక్ చేయడానికి, యూపీఐ లావాదేవీలకు పటిష్టమైన పాస్‌వర్డ్ లేకపోవడంతో తేలిగ్గా తెరిచిన నేరగాళ్లు అక్రమ లావాదేవీలు చేయగలిగారు. ఈ లావాదేవీలపై బ్యాంకు నుంచి ఎస్సెమ్మెస్‌లు వచ్చినప్పటికీ... ఫోన్ సైతం నేరగాళ్ల వద్దే ఉండటంతో బాధితురాలికి విషయం తెలియలేదు. బ్యాంక్ స్టేట్‌మెంట్ తీసుకున్న తర్వాతే తాను నష్టపోయిన విషయం గుర్తించిన బాధితురాలు గురువారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఇటీవల చోటు చేసుకుంటున్న ఈ నేరాలను గమనించిన సైబర్ క్రైమ్ పోలీసులు ఇలాంటి వ్యవస్థీకృత ముఠాలు బస్సుల్లో సంచరిస్తున్నట్లు అనుమానిస్తున్నారు.
పాస్‌వర్డ్ పటిష్టంగా ఉండాలి..
ఈ నేపథ్యంలో నగరవాసులకు కొన్ని కీలక హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఆండ్రాయిడ్, ఐఫోన్లలో కచ్చితంగా ఫౌండ్ మై డివైజ్‌ను యాక్టివేట్ చేసుకోవాలని కోరుతున్నారు. ఎవరైనా ఫోన్ పోగొట్టుకుంటే వెంటనే సిమ్‌కార్డు బ్లాక్ చేయించుకోవాలని, పోలీసులతో పాటు బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు. తన నెట్ బ్యాంకింగ్, యూపీఐ లావాదేవీలను నిలిపివేయాల్సిందిగా బ్యాంకును కోరాలని సూచిస్తున్నారు. అన్‌లాక్, యూపీఐ చెల్లింపుల పాస్‌వర్డ్స్ పటిష్టంగా ఉండేలా చూసుకోవాలని స్పష్టం చేస్తున్నారు.
తొలుత సెల్‌ఫోన్లు చేజిక్కించుకుంటున్న నేరగాళ్లు
యూపీఐ యాప్స్ వినియోగించి డబ్బు స్వాహా
బస్సుల్లో సంచరిస్తున్న వ్యవస్థీకృత ముఠాలు
అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసు అధికారులు