
మరోసారి.. నమో
శనివారం శ్రీ 11 శ్రీ నవంబర్ శ్రీ 2023
సాక్షి, సిటీబ్యూరో: ప్రధాని నరేంద్ర మోదీ శనివారం మళ్లీ నగరానికి రానున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ వేదికగా మధ్యాహ్నం నిర్వహించనున్న అణగారిన వర్గాల ‘విశ్వరూప మహాసభ’కు ఆయన ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విశిష్ట అతిథిగా పాల్గొననున్నారు. ఇటీవల ఎల్బీస్టేడియం వేదికగా నిర్వహించిన ‘బీసీ ఆత్మగౌరవ’ సభకు ప్రధాని మోదీ హాజరైన విషయం విదితమే. తాజాగా విశ్వరూప మహా సభకు హాజరు కాబోతుండటంతో దళిత వర్గాలను పెద్ద ఎత్తున ఈ సభకు తరలించేందుకు ఎస్సీ మోర్చా నేతలు ఏర్పాట్లు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ జిల్లాలతో పాటు ఇతర జిల్లాల నుంచి జనాన్ని భారీగా తరలించాల ని నిర్ణయించారు. ఈ వేదికగా ప్రధాని ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించే అవకాశం ఉంది.
నేటి మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో బీజేపీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో గ్రౌండ్స్ కేంద్రంగా మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు విధిస్తూ ట్రాఫిక్ చీఫ్ జి.సుధీర్‌బాబు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. సాధారణ వాహన దారులు బేగంపేట్, పరేడ్‌గ్రౌండ్స్, తాడ్‌బండ్, బోయిన్‌పల్లి, జూబ్లీ బస్‌స్టేషన్, ప్యారడైజ్, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, రైల్ నిలయం, మెట్టుగూడ, ఎంజీ రోడ్, ఆర్పీ రోడ్, ఎస్డీ రోడ్, మినిస్టర్స్ రోడ్, ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్లను అనుసరించకపోవడం ఉత్తమం. ఆయా మార్గాల్లో వెళ్లే వారు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని పోలీసులు సూచించారు. గ్రౌండ్స్‌లోకి ప్రవేశించడానికి వివిధ గేట్లు, ప్రత్యేక పార్కింగ్ ప్రాంతాలు కేటాయించారు. వీఐపీలకు సైతం వారు వచ్చే మార్గాల వారీగా ప్రత్యేక పార్కింగ్, ప్రవేశ ద్వారాలు కేటాయించారు.
మళ్లింపులు ఇలా..
ఎస్పీ రోడ్‌లో ఎస్బీహెచ్ చౌరస్తా నుంచి బేగంపేట వైపు వాహనాలను అనుమతించరు. వీటిని ప్యాట్నీ–ఆర్పీ రోడ్, ప్యాట్నీ–ప్యారడైజ్, స్వీకార్ ఉప్‌కార్–టివోలీ–బాలమ్‌రాయ్–సీటీఓ మీదుగా మళ్లిస్తారు. సీటీఓ చౌరస్తా నుంచి పరేడ్ గ్రౌండ్స్ వైపు వాహనాలు అనుమతించరు. వీటిని బాలమ్‌రాయ్–తాడ్‌బండ్–మస్తాన్ కేఫ్–బ్రూక్ బాండ్–టివోలీ–స్వీకార్ ఉప్‌కార్–ఎస్బీహెచ్, ప్యారడైజ్–ఎస్డీ రోడ్–ప్యాట్నీ–క్లాక్ టవర్–సంగీత్ జంక్షన్ మీదుగా పంపిస్తారు. టివోలీ చౌరస్తా నుంచి ప్లాజా వైపు వాహనాలను అనుమతించరు. వీటిని బాలమ్‌రాయ్–సీటీఓ–ఉప్‌కార్–వైఎంసీఏ మీదుగా మళ్లిస్తారు. ప్యారడైజ్ చౌరస్తా నుంచి ప్లాజా వైపు వాహనాలు అనుమతించరు. వీటిని ప్యారడైజ్–ప్యాట్నీ మీదుగా పంపిస్తారు.
నేడు నగరానికి మోదీ
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో ‘విశ్వరూప మహా సభ’
ముఖ్య అతిథిగా హాజరు కానున్న ప్రధాని