‘చార్మినార్‌’ నుంచే ఎక్కువ!

- - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: నగరంలో జనన, మరణ ధ్రువీకరణ నకిలీ పత్రాలు అత్యధికంగా చార్మినార్‌ ప్రాంతం నుంచే జారీ అయినట్లు హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌ (సీసీఎస్‌) అధికారులు గుర్తించారు. జీహెచ్‌ఎంసీ చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ కె.పద్మజ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఏసీపీ ఎం.సందీప్‌రెడ్డి నేతృత్వంలోని బృందం దర్యాప్తు ప్రారంభించింది.

ఈ కేసులో ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై సమగ్ర ప్లాన్‌ ఆఫ్‌ యాక్షన్‌ సిద్ధం చేస్తోంది. ఈ స్కామ్‌పై అంతర్గత విచారణ చేపట్టిన జీహెచ్‌ఎంసీ విజిలెన్స్‌ విభాగం ప్రాథమికంగా 50 కంటే ఎక్కువ జనన, 100 కంటే ఎక్కువ మరణ నకిలీ ధ్రువీకరణ పత్రాలు జారీ చేసిన ఈ–సేవ, మీ–సేవ కేంద్రాల పైనే దృష్టి పెట్టారు. అఫ్జల్‌గంజ్‌, అంబర్‌పేట్‌, ఆసిఫ్‌నగర్‌, బహదూర్‌పుర, బోయిన్‌పల్లి, చార్మినార్‌, చిక్కడపల్లి, చిలకలగూడ, గోల్కొండ, కాచిగూడ, మొఘల్‌పుర, ముషీరాబాద్‌, నల్లకుంట, సైదాబాద్‌, సైఫాబాద్‌, షాహినాయత్‌గంజ్‌, యాకత్‌పురల్లోని 25 కేంద్రాల నిర్వాహకులు ఇన్‌స్టంట్‌ అప్రూవల్‌ విధానాన్ని దుర్వినియోగం చేసినట్లు గుర్తించారు. వీళ్లు ఎలాంటి ధ్రువీకరణ లేని వారితో తెల్లకాగితాలు అప్‌లోడ్‌ చేయించి జనన, మరణ ధ్రువీకరణలు జారీ చేశారని తేలింది.

శివార్లను కలిపితే మరింత అధికం..
● మొత్తం 22,954 నకిలీ సర్టిఫికెట్లకుగాను చార్మినార్‌ ప్రాంతంలోని నాలుగు కేంద్రాల నుంచే 4512 (19.65 శాతం) జారీ అయినట్లు వెలుగులోకి వచ్చింది. అత్యధికంగా ఓవైసీ బిల్డింగ్‌లో ఉన్న కేంద్రం నుంచి 2913 జారీ కాగా... ముషీరాబాద్‌ ఎక్స్‌ రోడ్‌లోని కేంద్రం నుంచి 969 నకిలీ ధ్రువీకరణ పత్రాలు జారీ అయ్యాయి. 50, 100 కంటే ఎక్కువ జారీ చేసిన కేంద్రల సంఖ్య సిటీలోనే 25గా ఉందని, శివార్లతో కలిపితే ఈ సంఖ్య మరింత పెరుగుతుందని ఓ అధికారి వ్యాఖ్యానించారు. వీటి కంటే తక్కువ సంఖ్యలో జారీ చేసిన ఈ–సేవ, మీ–సేవ కేంద్రాల వివరాలను ఆరా తీస్తామని ఆయన స్పష్టం చేశారు.

● గతేడాది ఏప్రిల్‌ నుంచి మొత్తం 31,454 దరఖాస్తులు అప్‌లోడ్‌ కాగా.. 22,954 నకిలీ సర్టిఫికెట్లు జారీ అయ్యాయని, వీటిలో 21,085 జనన, 1869 మరణ ధ్రువీకరణ పత్రాలు ఉన్నట్లు పోలీసులు తేల్చారు. ఈ తరహా దందా రాష్ట్ర వ్యాప్తంగా సాగినట్లు సీసీఎస్‌ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ స్కామ్‌ దర్యాప్తు కోసం రంగంలోకి దిగిన అధికారులు ఎలా ముందుకు వెళ్లాలనే అంశానికి సంబంధించి ప్లాన్‌ ఆఫ్‌ యాక్షన్‌ సిద్ధం చేస్తున్నారు. దీన్ని ఉన్నతాధికారులకు సమర్పించడం ద్వారా వారి అప్రూవల్‌ తీసుకోనున్నారు. ఈ కుంభకోణంపై జీహెచ్‌ఎంసీ అధికారులు ఇప్పటికే ఈ–సేవ, మీ–సేవ కేంద్రాల ఈఎస్‌డీకీ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో వారి స్పందనను పోలీసులు పరిగణలోకి తీసుకోనున్నారు. వచ్చే వారం నుంచి ఆయా కేంద్రాల నిర్వాహకులకు నోటీసులు జారీ చేసి విచారణ ప్రారంభించనున్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top