హన్మకొండ: ఆర్టీసీ ప్రైవేట్ అద్దె బస్సుల రిప్లేస్‌మెంట్‌పై టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యంనుంచి స్పష్టత రావడం లేదు. మార్చి నాటికి వరంగల్ రీజియన్‌లో 146 బస్సుల అద్దెబస్సుల గడువు మీరనుంది. వీటి స్థానంలో కొత్త బస్సులు సర్దుబాటు చేయడానికి కనీసం మూడు నెలల సమయం పడుతుందని అంచనా. ఇప్పటివరకు గడువు మీరిన అద్దె బస్సుల స్థానంలో ఆ బస్సుల యజమానులకే కొత్తవాటిని సమకూర్చే అవకాశం కల్పిస్తూ వస్తోంది. ప్రస్తుతం యాజమాన్యం నుంచి ఎలాంటి నిర్ణయం వెలువడకపోవడంతో అద్దె బస్సుల యజమానుల్లో ఆందోళన నెలకొంది. గడువులోగా రీప్లేస్‌మెంట్‌కు అనుమతి రాకుంటే సంస్థలో తీవ్ర బస్సుల కొరత నెలకొననుందని పరిశీలకులు భావిస్తున్నారు. కానీ, సంస్థ చూపు ఎలక్ట్రిక్ బస్సుల వైపు ఉందని తెలుస్తోంది.
సంస్థ నిర్ణయం కోసం ఎదురుచూపు..
వరంగల్ రీజియన్‌లో మొత్తం 324 అద్దె బస్సుల్లో 146 బస్సుల గడువు మార్చితో ముగియనుంది. ఈ లోపు అద్దె బస్సుల రీప్లేస్‌మెంట్‌కు అనుమతి రావాల్సి ఉంటుంది. ఆర్టీసీ సొంత బస్సుల్లో చాలావాటికి కాలం చెల్లినా నడిపిస్తోంది. మరో వైపు సొంతగా బస్సులు సమకూర్చునే స్థితిలో లేనట్లుగా కనిపిస్తోంది. ఇవి స్క్రాప్‌కు వెళ్లనుండగా, మరోవైపు అద్దె బస్సులు తగ్గనుండడంతో సర్వీసుల కొరత నెలకొనుందని స్పష్టంగా కనిపిస్తోంది. మహాలక్ష్మి పథకం కింద ప్రభుత్వం మహిళలకు ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. దీంతో సంఖ్య పరంగా బస్సుల అవసరం పెరిగింది. ఈ క్రమంలో అద్దె బస్సుల కొనసాగింపు తప్పనిసరిగా మారింది. ప్రభుత్వం, యాజమాన్యం అద్దె బస్సుల కొనసాగింపుపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని యజమానులు ఎదురుచూస్తున్నారు. ఒక అద్దె బస్సు ద్వారా యజమానులు స్వయం ఉపాధి పొందడంతోపాటు మరో ఐదుగురికి ఉపాధి అవకాశం కల్పిస్తున్నారు.
ప్రైవేట్ యజమానుల వాదన
అద్దె బస్సుల పార్కింగ్, నిర్వహణ బాధ్యత అద్దె బస్సుల యజమానులు చూసుకుంటున్నారు. కానీ, ఎలక్ట్రిక్ బస్సులకు ఆర్టీసీనే స్థలం సమకూర్చి డిపో నిర్మించి ఇవ్వాల్సి ఉంటుంది. వాటికి విద్యుత్, పార్కింగ్ సౌకర్యం కల్పించాల్సి ఉంటుంది. అద్దె బస్సులకు కిలోమీటరుకు సగటున రూ.30 చెల్లిస్తుండగా, ఎలక్ట్రిక్ బస్సులకు సగటున రూ.62 చెల్లిస్తున్నట్లు సమాచారం. అద్దె బస్సులతో పోలిస్తే నిర్వహణపరంగా, అద్దె చెల్లింపు పరంగా ఎలక్ట్రిక్ బస్సులు భారమని చెబుతున్నారు. కార్మిక యూనియన్లు కూడా ఎలక్ట్రిక్ బస్సులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని అంటున్నారు. ఇప్పటికే వరంగల్ రీజియన్‌లో వరంగల్– 2 డిపో ద్వారా నడుపుతున్న ఎలక్ట్రిక్ బస్సులు రోజుకు 10 బస్సుల వరకు మరమ్మతుకు వస్తుంటాయని, ఎక్కడ ఆగిపోతాయో, ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితులున్నాయని అంటున్నారు. అదే ప్రైవేట్ బస్సులు అయితే సొంత నిర్వహణ కావడంతో సంస్థకు ఎలాంటి భారమూ పడదని చెబుతున్నారు.
వరంగల్ రీజియన్‌లో
బస్సులు ఇలా..
సంస్థవి 570
అద్దెవి 324
ఎలక్ట్రిక్ 115
మొత్తం 1,009
వరంగల్ రీజియన్‌లో మార్చిలో
పూర్తి కానున్న 146 అద్దె బస్సుల గడువు
గడువులోగా అనుమతి రాకుంటే ఏర్పడనున్న బస్సుల కొరత
సంస్థ చూపు.. ఎలక్ట్రిక్ బస్సుల వైపు


