ముందస్తు చర్యలేవి?
సాక్షిప్రతినిధి, వరంగల్: నీటితో కళకళలాడాల్సిన చెరువులు, కుంటలు విషాదాలు నింపుతున్నాయి. ఈత రాకపోవడం, నీటి లోతు తెలియకపోవడం, చెరువుల చుట్టూ రక్షణ చర్యలు లేకపోవడం.. కారణం ఏదైనా నిండు ప్రాణాలను నీటిగుంతలు బలితీసుకుంటున్నాయి. తాజాగా ములుగు మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం ఇద్దరు అన్నదమ్ములు కుంటలో పడి మృతి చెందడం ఉమ్మడి వరంగల్‌లో చెరువులు, కుంటల వద్ద భద్రతా చర్యలపై మరోసారి ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి.
తమ్ముడిని కాపాడబోయి అన్న..
ములుగు మున్సిపాలిటీ పరిధి గణేశ్‌లాల్‌పల్లిలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. గ్రామ సమీపంలోని మొండి కుంటలో పడి మాలోతు వినయ్ (15), రాజేశ్ (12) అన్నదమ్ములు మృతి చెందారు. మంగపేట మండలం కమలాపురానికి చెందిన వీరు రాఖీ పౌర్ణమి సందర్భంగా తల్లితో కలిసి అమ్మమ్మ ఇంటికి వచ్చారు. ఆదివారం సాయంత్రం బహిర్భూమికి వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు కుంటలో పడిపోయారు. ఇద్దరూ నీటిలో మునిగిపోవడంతో స్థానికులు బయటకు తీసి ములుగు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
చిన్నగురిజాలలో ఘటన విషాదకరం..
2022 మార్చి 13న నర్సంపేట మండలం చిన్నగురిజాలలో జరిగిన ఘటన మరింత విషాదకరం. పొలం పనులు ముగించుకుని కాళ్లు, చేతులు కడుక్కునేందుకు చెరువు వద్దకు వెళ్లిన కృష్ణమూర్తి (65) ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయాడు. అతడిని కాపాడేందుకు మనవడు దీపక్ అలియాస్ లక్కీ (12) నీటిలోకి వెళ్లాడు. ఇద్దరూ మునిగిపోతుండడాన్ని చూసిన నాగరాజు (35) వారిని కాపాడేందుకు చెరువులోకి దూకాడు. చివరకు ముగ్గురూ నీటిలో మునిగి మృతి చెందారు. ఒకే కుటుంబానికి చెందిన తాత, కొడుకు, మనవడు ఒకేసారి మృత్యువాత పడడం అప్పట్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
చేపల వేటకు వెళ్లి.. ముగ్గురు చిన్నారులు
2020 జనవరి 30న వరంగల్ జిల్లా గొర్రెకుంట శివారులోని కట్టమల్లన్న చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లిన ముగ్గురు చిన్నారులు ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయారు. బరిగెల రుచిత (7), ప్రణయ్‌పాల్ (9), రణధీర్ (11) మృతి చెందారు.
కోటచెరువులో..
2023 మార్చి 31న వరంగల్ నగరంలోని ఏనుమాముల ప్రాంతం కోటచెరువు వద్ద మరో విషాదం జరిగింది. బహిర్భూమికి వెళ్లిన కిరణ్‌సింగ్ (12), దీపక్‌సింగ్ (9) ప్రమాదవశాత్తు చెరువులో పడిపోయారు. స్థానికులు వారిని బయటకు తీసి ఎంజీఎం ఆస్పత్రికి తరలించినా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
హెచ్చరికల బోర్డులెక్కడ?
ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధి గ్రామీణ ప్రాంతాల్లో చెరువులు, కుంటలు, నీటి గుంతలు విస్తారంగా ఉన్నాయి. వర్షాకాలంలో నీరు చేరితే ప్రమాదం మరింత పెరుగుతుంది. ముఖ్యంగా బహిర్భూమికి వెళ్లే సమయంలో, చేపలు పట్టేందుకు వెళ్లినప్పుడు, పశువులను నీటిలో నుంచి బయటకు తీసే క్రమంలో, స్నానానికి వెళ్లినప్పుడు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. చెరువులు, కుంటల వద్ద హెచ్చరిక బోర్డులు, ప్రమాద ప్రాంతాల గుర్తింపు, రక్షణ కంచెలు, అవసరమైన చోట్ల గస్తీ వంటి చర్యలు లేకపోవడం వల్ల ప్రమాదం జరిగిన తర్వాతే అధికారులు స్పందిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఈత రాక.. లోతు తెలియక
చిన్నారులు ప్రమాదాలకు గురవడానికి కారణం ఈత రాకపోవడం, ఒకరు నీటిలో పడితే వారిని రక్షించే క్రమంలో మరొకరు కూడా మునిగిపోయిన ఘటనలు అనేకం.
చెరువులు, కుంటల్లో పలువురి జలసమాధి!
పిల్లలు, రైతులు, కాపరులు.. ఒకరిని కాపాడబోయి మరొకరు
ఉమ్మడి వరంగల్ జిల్లాలో
విషాదం నింపిన పలు ఘటనలు
చెరువులు, కుంటల వద్ద ప్రమాదకర ప్రాంతాలను ముందుగానే గుర్తించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం, లోతైన ప్రాంతాల వద్ద కంచెలు ఏర్పాటు చేయడం, గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించడం వంటి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా పాఠశాలలు, గ్రామపంచాయతీలు, స్థానిక సంస్థలు కలిసి చిన్నారులు చెరువుల వద్దకు వెళ్లకుండా తల్లిదండ్రులకు, విద్యార్థులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. నీరు జీవనాధారం.. కానీ, అప్రమత్తత లేకుంటే అదే నీరు ప్రాణాంతకంగా మారుతోంది. ఉమ్మడి వరంగల్‌లో వరుసగా చోటుచేసుకుంటున్న జల ప్రమాదాలు దీనికి నిదర్శనం.


