ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క–సారలమ్మలను దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు వేలాదిగా తరలివచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి కుటుంబ సమేతంగా వచ్చిన భక్తులతో మేడారం పరిసరాలు సందడిగా మారాయి. ముందుగా జంపన్నవాగుకు చేరుకున్న భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం అమ్మవార్ల గద్దెలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. పసుపు, కుంకుమ, ఎత్తు బంగారం(బెల్లం), చీర సారె, కానుకలు, ఒడిబియ్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. కొందరు భక్తులు తలనీలాలు సమర్పించారు. దర్శనం అనంతరం భక్తులు అటవీ ప్రాంతంలో వంటావార్పు చేసుకున్నారు.


