ఖిలా వరంగల్:
అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా దేశంలో విదేశీ మాదకద్రవ్య వినియోగం తగ్గించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. దిగుమతి చేసుకున్న బంగారం, ఎరువులు, ఇంధనం, వంట నూనె, ఇతర సరుకుల వాడకం విషయంలో పొదుపు పాటించాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ వీటి వినియోగం ఎక్కువగా పెరిగింది. ఇదేపరిస్థితి కొనసాగితే భవిష్యత్‌లో ఇబ్బందులు తప్పేలా లేవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈనేపథ్యంలో ప్రధాని సూచనను మన ఇంటినుంచే ఆచరిద్దాం. దీనివల్ల వ్యక్తిగత ప్రయోజనంతో పాటు దేశానికి మేలు జరుగుతుంది. ఉమ్మడి జిల్లాలో ప్రధాన ఖర్చులు.. ఆదాపై ఈ ఆదివారం ‘సాక్షి’ సండే స్పెషల్..
నూనె వాడకమూ ఎక్కువే..
ఇళ్లలో వంటలకు వాడే నూనెకు భారీగా వెచ్చిస్తున్నారు. నలుగురు కుటుంబ సభ్యులున్న ఇంటిలో నెలకు నగటున ఐదు లీటర్లు వాడుతున్నారు. నెల రోజులకు ఇప్పటికీ చూస్తే ఒక్కో ప్యాకెట్‌కు రూ.25కు పైగా ధరలు పెరిగాయి. అతిగా వంట నూనె వాడితే శరీరానికి విటమిన్లు, మంచి కొవ్వు, కేలరీలు అందవు. హార్మోన్ల అసమతుల్యతతో ఎక్కువ మంది ఊబకాయం, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధుల బారినపడుతున్నా వినియోగం తగ్గించడం లేదు. ఉమ్మడి జిల్లాలో సుమారు 38.20 లక్షల కుటుంబాలు ఉండగా నెలకు 1.90 కోట్ల లీటర్ల నూనె వాడుతున్నట్లు అంచనా. ప్రధాని పిలుపు మేరకు అందులో 10 శాతం తగ్గించినా 19 లక్షల లీటర్లు ఆదా అవుతుందని నిపుణులు చెబుతున్నారు.
బంగారం చూసుకుని కొందాం..
వివాహాలు, ఇతర శుభకార్యాలకు స్వర్ణాభరణాలు కొనడం అలవాటుగా మారింది. ఈ విషయంలో నియంత్రణ పాటిస్తే కచ్చితంగా ప్రయోజనం కలుగుతుంది. ప్రధానంగా వరంగల్ నగరంలో 210కుపైగా షాపులు, మిగిలిన జిల్లాల్లో మరో 200 షాపులు ఉన్నాయి. మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా సగటున రోజుకు 6 కిలోల బంగారు నగల అమ్మకాలు సాగుతున్నట్లు వ్యాపారుల అంచనా. ఈ విషయంలో కొంత పొదుపు పాటించాల్సిన అవసరం ఉంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం ధరలు పెరగడంతో 80 శాతం కొనుగోళ్లు తగ్గిపోయాయని వ్యాపారులు చెబుతున్నారు.
ఇంధనం ఆదా చేద్దామా..
పశ్చిమాసియా పరిణామాలు ఇంధన వినియోగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు తమ కాన్వాయిలో వాహనాలను తగ్గించుకునేలా తీసుకున్న నిర్ణయం స్ఫూర్తిగా నిలుస్తోంది. ఉమ్మడి జిల్లాలో 7,82,314 వాహనాలు ఉన్నాయి. దీంతో సగటున నెలకు 19 లక్షల లీటర్ల పెట్రోల్, 7 లక్షల లీటర్ల డీజిల్ వినియోగమవుతోంది. ఒక ద్విచక్రవాహనం ఇంధనం కోసం సగటున నెలకు రూ.మూడు వేలు వెచ్చించాల్సి వస్తోంది. ఇది ఓ సాధారణ మధ్య తరగతి కుటుంబం.. నెలవారీ నిత్యావసర సరుకుల కొనుగోలుకు సమానంగా ఉంటుంది. ఖరీదైన వాహనాలను విని యోగిస్తే ఇంధన వ్యయం ఎక్కువ. బైక్‌లపై వెళ్లడం కంటే కాలినడకన, సైకిళ్ల మీద వెళ్తే కొంత ఇంధనాన్ని ఆదా చేసినట్లే.
ఎరువుల మోతాదు మించొద్దు..
పంటలకు మోతాదుకు మించి ఎరువులు వాడుతున్నారు. అధికారుల సిఫార్సు మేరకు ఎకరాకు మూడు దశల్లో 75 కిలోల యూరియా వినియోగించాల్సి ఉండగా.. జిల్లాలో 225 కిలోల కంటే ఎక్కువ ఉపయోగిస్తున్నట్లు వ్యవసాయ అధికారులే చెబుతున్నారు. దీంతో నేలసారం తగ్గడమే కాకుండా చీడ పీడలు వ్యాపించి సాగు వ్యయం గణనీయంగా పెరుగుతుంది. ఖరీఫ్‌లో జిల్లా వ్యాప్తంగా 15 లక్షల ఎకరాల్లో పంటలు సాగువుతుండగా.. నిబంధనల ప్రకారం 41 వేల మెట్రిక్ టన్నుల యూరియా వేయాలి. ఈ ప్రకారం రసాయన ఎరువులు వేస్తే విదేశీమారక ద్రవ్యం వినియోగం తగ్గడంతో పాటు సాగుపరంగా ఎదురయ్యే ఇబ్బందులూ తీరుతాయి.
ప్రధాని మోదీ సూచనను మన ఇంటి నుంచే ఆచరిద్దాం..
విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేయడానికి పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించాలి. ‘మేడ్ ఇన్ ఇండియా’ ఉత్పత్తులకే ప్రాధాన్యం ఇవ్వాలి.
– ఇటీవల ప్రధానమంత్రి
నరేంద్ర మోదీ
దేశ ప్రజలకు పిలుపు
వంట నూనెల వాడకం తగ్గిస్తే..
ఇంటి ఖర్చులో అధిక ఆదా
అవసరమైతేనే బైక్, కారు..
కాలినడక ఆరోగ్యానికి మంచిది
దిగుమతి వస్తువుల వినియోగాన్ని తగ్గిస్తే మేలు


