గాడి తప్పిన పాలన! | - | Sakshi
Sakshi News home page

గాడి తప్పిన పాలన!

May 17 2026 12:36 AM | Updated on May 17 2026 12:36 AM

గాడి తప్పిన పాలన!

వరంగల్‌ అర్బన్‌: పరిపాలన బలోపేతం కోసం గత ప్రభుత్వం నాలుగేళ్ల కిందట వార్డు ఆఫీసర్లను నియమించింది. వారు క్షేత్రస్థాయిలో పౌరులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి పైస్థాయి ఉద్యోగులకు, అధికారులకు సమాచారం అందించాలి. ఆ సమస్య పరిష్కారమయ్యే వరకు ఫిర్యాదుదారులకు జవాబుదారీగా ఉండాలి. కానీ, అధికారుల పర్యవేక్షణాలోపం, వార్డు ఆఫీసర్ల పనుల్లో నిబద్ధత కొరవడిన కారణంగా పౌరసేవలు సకాలంలో అందట్లేదు. బల్దియాలో వందల సంఖ్యలో సమస్యలపై ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నప్పటికీ పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. వార్డు ఆఫీసర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండడం ఇక్కడ పరిపాటిగా మారిందనే ఆరోపణలున్నాయి.

వార్డు ఆఫీసర్ల విధులేంటంటే..

నగరంలో 66 వార్డులున్నాయి. వార్డుకో అధికారిని నియమించారు. వార్డు పాలన వ్యవస్థలో పౌర సేవల పట్టిక అమలు కోసం పనిచేయాలి. పౌరుల సౌకర్యార్థం పట్టికలను వార్డు కార్యాలయాల్లో ప్రదర్శించాలి. ప్రజలు వార్డు కార్యాలయాల్లో అందించే ఫిర్యాదులపైనే కాకుండా సామాజిక మధ్యమాలు, కంట్రోల్‌ రూం, టోల్‌ ఫ్రీ నంబర్‌ ఫిర్యాదులపై స్పందించి పరిష్కారం చూపాలి. ఆస్తి, నీటి, గార్బేజీ చార్జీలు, ట్రేడ్‌ లైసెన్స్‌ సొమ్ము వసూలు చేయాలి. వార్డు ఆఫీసర్లు జనన మరణ ధ్రువ పత్రాల అసిస్టెంట్లుగా, విచారణ అధికారులుగా బాధ్యతలు నిర్వర్తించాలి. రోడ్లపై గుంతలు, మ్యాన్‌హోళ్ల మూతలు, రోడ్లపై మురుగునీరు, నీటి నిల్వ లు, నాలాల్లో ప్రవాహం అడ్డంకులు, పుట్‌పాత్‌ సమస్య, వీధిలైట్లు, రోడ్లు పక్కన మట్టికుప్పలు, ఇంటింటా చెత్త సేకరణ తీరు, ప్రజా మరుగుదొడ్ల నిర్వహణ, దోమల సమస్య, జంతు, పక్షుల కళేబారాలు, పెంపుడు కుక్కల లైసెన్స్‌, దివ్యాంగులకు, వృద్ధులకు గుర్తింపు కార్డులు, తాగునీటి సరఫరాలో కొరత, లీకేజీలను గుర్తించడం తదితర సమస్యలను క్షేత్ర స్థాయిలో తెలుసుకొని సంబంధిత విభాగాధికారులకు, సిబ్బందికి సమాచారం చేరవేయాలి.

ఎవరికి వారే..

వార్డు ఆఫీసర్లు కేవలం ఆస్తి, నీటి పన్నుల వసూళ్లు, సామాజిక పింఛన్ల దరఖాస్తులకే పరిమితమయ్యారు. ఇంజనీరింగ్‌, టౌన్‌ ప్లానింగ్‌, ప్రజారోగ్యం తదితర విభాగాల పనులపై కన్నెత్తి చూడడం లేదు. ఆయా విభాగాలకు చెందిన చైన్‌మెన్లు, వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు, లైన్‌మెన్లను శానిటరీ జవాన్లు, బిల్‌ కలెక్టర్లను భాగస్వామ్యం చేసుకోవాలి. కానీ, బల్దియాలో ఆ విధానం అమలు కాకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చిన్నచిన్న పనులకు సైతం నగరవాసులు అధికారులకు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేసినా స్పందించడం లేదనే ఆరోపణలున్నాయి. సమస్యల సత్వర పరిష్కారం కోసం వార్డు ఆఫీసర్లకు ప్రభుత్వం సెల్‌ఫోన్లను అందించింది. నగరవాసులు ఫోన్‌ ద్వారా సమస్యలు తెలుపవచ్చు. కానీ, వార్డు ఆఫీసర్లే కాదు.. ఇతర విభాగాల సిబ్బంది కూడా ఫోన్లు ఎత్తడానికి ఇబ్బంది పడుతున్నారు. వాట్సాప్‌లో సందేశం పంపినా సమాధానం కరువవుతోందని పౌరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సమీక్షల్లేవు.. సమస్యలు పరిష్కారం కావు..

వార్డుల్లో బల్దియాకు సంబంధించిన కార్యాలయాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా.. బల్దియా ప్రధాన కార్యాలయం ఆవరణలోని ఇండోర్‌ స్టేడియంనే వార్డు ఆఫీసర్లు కార్యాలయంగా ఎంచుకుంటున్నారు. నెలకోసారి డిప్యూటీ కమిషనర్లు వార్డు ఆఫీసర్లతో సమావేశమై ఫిర్యాదులు, పనితీరును సమీక్షించాల్సి ఉన్నా అవేమీ అమల్లోకి రావట్లేదు. ఇలా బల్దియాలో ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. ఫలితంగా నగర వాసులకు ఇక్కట్లు తప్పట్లేదు. ఉన్నతాధికారులు వార్డు ఆఫీసర్‌ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పౌరులు కోరుతున్నారు.

బల్దియాలో వార్డు ఆఫీసర్ల

పనితీరుపై విమర్శలు

కార్యాలయాల్లేవు..

కొరవడిన సమన్వయం

క్షేత్రస్థాయిలో సమస్యలతో

నగరవాసులు సతమతం

Advertisement
 
Advertisement
Advertisement