వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద
కాశిబుగ్గ: డెంగీ రహిత సమాజం కోసం అందరూ కృషి చేయాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. శనివారం జాతీయ డెంగీ దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ తరఫున చింతల్‌లోని పట్టణ ఆరోగ్య కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో అందరూ ఐక్యంగా డెంగీ నివారణ చర్యలు చేపట్టడంతోనే వ్యాధిని నిర్మూలించవచ్చన్నారు. రానున్న వర్షాకాలం దృష్టిలో ఉంచుకుని ఇప్పటి నుంచి వ్యాధి ప్రభావిత ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహించాలని, వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి జ్వర సర్వే నిర్వహించి, రక్త పరీక్షలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ బి.సాంబశివరావు, కార్పొరేషన్ వైద్యాధికారి డాక్టర్ రాజేశ్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ ప్రకాశ్, ప్రోగ్రాం అధికారులు ఇఫ్తకార్ అహ్మద్, వైద్యులు అరుణ్, విజయ్‌కుమార్, దిలీప్, వేద కిరణ్, శ్రవణ్, అనిల్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలి
న్యూశాయంపేట: సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద పిలుపునిచ్చారు. శనివారం వరంగల్ రెడ్ క్రాస్ సొసైటీ కార్యాలయాన్ని డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో ప్రారంభించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వైవీ గణేశ్, రెడ్‌క్రాస్ పాలక మండలి సభ్యులు ఇ.వి.శ్రీనివాస్, డీఎంహెచ్‌ఓ సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.
ఎస్‌ఐఆర్‌ను సమర్థవంతంగా నిర్వహించాలి
ఎస్‌ఐఆర్‌ను సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి అధికా రులను ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు. వీసీలో కలెక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్‌తో పాటు ఆర్డీఓ, అధికారులు పాల్గొన్నారు.
34,782 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు
జిల్లాలో ఇప్పటి వరకు 34,782 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు కలెక్టర్ సత్యశారద పేర్కొన్నారు. 32,098 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించగా 2,933 మంది రైతులకు రూ.40.64 కోట్ల మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశామన్నారు. అలాగే 19,780 మంది రైతుల నుంచి 1,00,624.15 మెట్రిక్ టన్నుల మొక్కజొన్నలను కొనుగోలు చేసి సుమారు రూ.241.49 కోట్లు చెల్లించినట్లు కలెక్టర్ తెలిపారు.


