హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్
హన్మకొండ అర్బన్: రెవెన్యూ, పోలీస్, ఎస్‌డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక, మున్సిపల్ తదితర శాఖల సమన్వయంతో ఈనెల 18న మాక్ ఎక్సర్‌సైజ్‌ను పకడ్బందీగా నిర్వహించాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో శనివారం నిర్వహించిన సమన్వయ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు వివిధ శాఖల సమన్వయంతో రక్షణ, సహాయక చర్యలు ఎలా చేపడతామో ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ మాక్ ఎక్సర్‌సైజ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హనుమకొండ నగర పరిధిలోని టీఎన్జీవోస్ కాలనీ ఫేజ్–2, వివేక్‌నగర్, సమ్మయ్యనగర్, ప్రగతినగర్, గోపాలపూర్, టీవీటవర్ కాలనీ, యూపీహెచ్‌సీ లష్కర్‌సింగారం ప్రాంతాల్లో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం నిర్వహించే ప్రాంతాల్లో ప్రజలకు ముందస్తు అవగాహన కల్పించాలని, బల్దియా స్వచ్ఛ ఆటోల ద్వారా ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. డీఆర్వో కె.శ్రీనివాస్, ఆర్డీఓ రాథోడ్ రమేశ్, డీఎంహెచ్‌ఓ అప్పయ్య, హనుమకొండ ఏసీపీ నరసింహారావు, అగ్నిమాపక శాఖ అధికారి సుదర్శన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
కళలు, క్రీడల్లోనూ రాణించాలి
విద్యారణ్యపురి: విద్యార్థులు చదువుతోపాటు కళలు, క్రీడల్లోను రాణించాలని కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్ సూచించారు. విద్యావారోత్సవాల్లో భాగంగా శనివారం హనుమకొండ ప్రభుత్వ ప్రాక్టీసింగ్ ప్రైమరీ స్కూల్‌లో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీల విద్యార్థులకు ఆర్ట్, క్రాఫ్ట్, కల్చరల్‌డే నిర్వహించారు. విద్యార్థులు తయారుచేసిన ఆర్ట్, క్రాఫ్ట్ వస్తువులను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం హనుమకొండ బాలభవన్ విద్యార్థుల ఏకదంతాయ వక్రతుండాయ నృత్య ప్రదర్శన, ఎంపీపీఎస్ విద్యార్థుల బంజార జానపద నృత్యాలు అలరించాయి. కార్యక్రమంలో హనుమకొండ డీఈఓ ఎల్వీ గిరిరాజ్‌గౌడ్, డీసీఈబీ సెక్రటరీ డాక్టర్ బి.రాంధన్, జీసీడీఈఓ సునీత, ప్లానింగ్ కోఆర్డినేటర్ బి.మహేశ్, అకడమిక్ మానిటరింగ్ కోఆర్డినేటర్ డాక్టర్ మన్‌మోహన్, ఎంఈఓ ఎ.శ్రీనివాస్, ఏసీజీఈ భువనేశ్వరి పాల్గొన్నారు.


