ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి
హన్మకొండ/కాజీపేట/వరంగల్ అర్బన్: నాలాల్లో పూడికతీత పనులు 10 రోజుల్లో పూర్తి చేయాలని ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి సూచించారు. హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్‌తో కలిసి రాజాజీనగర్‌లో నాలాలో పూడికతీత పనులు, అశోకా జంక్షన్ నుంచి బుద్ధ భవన్ మీదుగా కాకతీయ యూనివర్సిటీ వరకు రోడ్డు, నిట్ ప్రధాన రహదారి వెంట కల్వర్టు, డ్రైనేజీ, 60, 61 డివిజన్లలో అభివృద్ధి పనులను పరిశీలించారు. బాలాజీనగర్ నాలా బ్రిడ్జి పూడికతీత పనులు, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చేపడుతున్న పనులపై అధికారులకు తగిన సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలంలో వరద ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, తక్షణమే పనులు ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఎమ్మెల్యే నాయిని అధికారులను ఆదేశించారు. అశోకా జంక్షన్ నుంచి కేయూ రోడ్డు వరకు ప్రజా రవాణా వ్యవస్థను మరింత మెరుగుపరచాలని, ఆర్టీసీ బస్సులు సులభంగా రాకపోకలు సాగించేలా బస్టాండ్ నుంచి కాంగ్రెస్ భవన్ రోడ్డు మీదుగా కేయూ రోడ్డుకు అనుసంధానం చేసే ప్రతిపాదనలను పరిశీలించినట్లు తెలిపారు. రోడ్డు విస్తరణ పనులను పైలట్ ప్రాజెక్టుగా చేపట్టి ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే అంబేడ్కర్ జంక్షన్ నుంచి వడ్డేపల్లి చర్చి వరకు రూ.24 కోట్లతో అభివృద్ధి పనులకు త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు. కార్పొరేటర్ దాస్యం అభినవ్ భాస్కర్, మాజీ కార్పొరేటర్ అబూబక్కర్, నాగరాజు పాల్గొన్నారు.


