హన్మకొండ: భావోద్వేగాలకు సంబంధించిన నైపుణ్యాలుంటే నేరాలు జరగవని హనుమకొండ జిల్లా అదనపు న్యాయమూర్తి, జిల్లా పరిశ్రమలు, లేబర్ కోర్టు జడ్జి టి.శ్రీనివాసరావు అన్నారు. హనుమకొండ జెడ్పీ కార్యాలయ ఆవరణలోని వృద్ధుల డే కేర్ సెంటర్‌లో సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ శనివారం నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన మాట్లాడారు. తల్లిదండ్రులు తమ పిల్లలను జాగ్రత్తగా పెంచాలన్నారు. తద్వారా వృద్ధాప్యంలో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కావని వివరించారు. అశోకుడు పురాతన కాలంలోనే తెలి పిన సామాజిక న్యాయసూత్రాలు అందరూ తెలు సుకోవాలని సూచించారు. వయోవృద్ధుల సమస్యల పరిష్కారానికి జిల్లా న్యాసేవాధికార సంస్థకు ఎప్పుడైనా రావొచ్చని అన్నారు. సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు దామెర నర్సయ్య అధ్యక్షతన జరిగిన సదస్సులో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చొల్లేటి రామకృష్ణ, సీనియర్ సిటిజన్స్ ట్రిబ్యునల్ మెంబర్ కె.అనితారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


