ధర్మసాగర్ : మండల కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న ధర్మసాగర్.. రహదారి సమస్యతో సతమతం అవుతోంది. గతంలో ఓఆర్‌ఆర్ వద్ద నుంచి రిజర్వాయర్ వరకు డబుల్ రోడ్డు నిర్మాణం చేపడుతామని నాటి ఎమ్మెల్యే, అధికారులు హామీ ఇచ్చారు. అయితే ఆ హామీ నేటికీ నెరవేరలేదని విమర్శలు వస్తున్నాయి. ధర్మసాగర్ మీదుగా వేలేరు మండలంలోని పలు గ్రామాలు, ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న సింగిల్ రోడ్డుపై భారీ వాహనాలు, బస్సులు, ట్రాక్టర్లు, ఆటోలు నిత్యం రవాణా కొనసాగిస్తుండడంతో రోజురోజుకు ట్రాఫిక్ సమస్యలు తీవ్రతరం అవుతుంది. ఉదయం, సాయంత్రం రహదారి పూర్తిగా రద్దీగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొటున్నట్లు వాహనదారులు వాపోతున్నారు. రోడ్డు చిన్నది, వాహనాలు పెద్దవి అవడం మూలంగా ఎక్కడ ఏ ప్రమాదంజరుగుతుందోనని, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గతంలో పలు రాజకీయ పార్టీల నాయకులు ఎన్నికల ప్రచారంలో డబుల్ రోడ్డు నిర్మాణానికి పలుమార్లు హామీలు ఇచ్చినా పనులు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా మారిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. నిధుల కొరత, లేక అధికారుల నిర్లక్ష్యమా అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. లారీలు, ట్రాక్టర్లు వెళ్లే సమయంలో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడడం, చిన్నచిన్న వాహనదారులు, పాదచారులు ప్రమాదాలకు గురవుతుండడంతో మిగతా వాహనదారులు భయాందోళన చెందుతున్నారు. విద్యార్థులు, వృద్ధులు రోడ్డుపై వెళ్లాలంటే జంకుతున్నారు. ఇప్పటికై నా అధికారులు, స్థానిక ఎమ్మెల్యే స్పందించి వెంటనే డబుల్ రోడ్డు నిర్మాణానికి స్పష్టమైన గడువు ప్రకటించి రోడ్డు నిర్మాణం చేపట్టాలని ఈ సందర్భంగా ప్రజలు కోరుతున్నారు.
బైపాస్ రోడ్డు ఏర్పాటు చేయాలి
భారీ వాహనాల రవాణాకు బైపాస్ రోడ్డు ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల సమయంలో హామీలు మాత్రమే వినిపిస్తున్నాయని, సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. మండల కేంద్రం అభివృద్ధికి కీలకమైన ఈ డబుల్ రోడ్డు పనులపై ప్రభుత్వం, అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఎన్నికల సమయంలో నాయకుల హామీ
నేటికీ నెరవేరని పరిస్థితి
ఆగ్రహిస్తున్న వాహనదారులు


