విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలో ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. జిల్లాలోని 32 పరీక్షకేంద్రాల్లో మొదటి సంవత్సరం జనరల్, ఒకేషనల్ సెకండ్ లాంగ్వేజెస్ పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు నిర్వహించారు. మొత్తంగా 4,187 మంది విద్యార్థులకుగాను 3,793మంది (90శాతం)పరీక్షలకు హాజరయ్యారని డీఐఈఓ ఎ.గోపాల్ తెలిపారు. 394మంది గైర్హాజరయ్యారు. సెకండియర్ సెకండ్ లాంగ్వేజెస్ పరీక్షలు మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30గంటల వరకు నిర్వహించారు. 1,119 మందికిగాను 999 మంది( 89శాతం) హాజరు కాగా, 120మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు గోపాల్ తెలిపారు.
వరంగల్ జిల్లాలో
కాళోజీ సెంటర్: వరంగల్ జిల్లాలో ఏర్పాటు చేసిన 16 పరీక్షా కేంద్రాల్లో ప్రథమ సంవత్సరం పరీక్షకు 1,330 మందికి 1,259 విద్యార్థులు హాజరు కాగా 71 మంది గైర్హాజరయ్యారని డీఐఈఓ డాక్టర్ శ్రీధర్ సుమన్ తెలిపారు. ద్వితీయ సంవత్సరం పరీక్షకు 576 మందికి 548 మంది విద్యార్థులు హాజరుకాగా 28 మంది గైర్హాజరయ్యారన్నారు.
యువతిపై లైంగిక దాడి
● నిందితుడి అరెస్ట్, రిమాండ్
● వివరాలు వెల్లడించిన పోలీసులు
గీసుకొండ : ఓ యువతిపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు గీసుకొండ సీఐ విశ్వేశ్వర్ తెలిపారు. ఈ మేరకు బుధవారం గీసుకొండ పీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మండలంలోని మనుగొండకు చెందిన తప్పురి ఉదయ్‌శంకర్ గ్రామంలోని ఓ యువతిని ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. అనంతరం ఆమెను బలవంతంగా లొంగదీసుకున్నాడు. ఆ తర్వాత సదరు యువతి వివాహం గురించి ప్రశ్నించగా ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని, ఆమె కుటుంబ సభ్యులను చంపుతానని బెదిరించాడు. ఇటీవల అతను సదరు యువతి ఇంటిలో రాత్రి పూట చొరబడగా స్థానికులు పట్టుకుని ప్రశ్నించడంతో తాను ఆమెను పెళ్లి చేసుకుంటున్నానని చెప్పాడు. ఆ తర్వాత యువతి కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలతో కలిసి ఇంటికి వెళ్లి పెళ్లి విషయమై మాట్లాడగా ఉదయ్‌శంకర్, అతడి తండ్రి సమ్మయ్య, అక్క అన్నపూర్ణ బెదిరించారు. ఈ విషయమై బాధితులు మంగళవారం ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశామని, బుధవారం నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ విశ్వేశ్వర్ తెలిపారు. సమావేశంలో ఎస్సై కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
హన్మకొండ కల్చరల్: కాకతీయుల ఘన కీర్తి, సామ్రాజ్య కళా వైభవాన్ని ప్రపంచానికి చాటుదామని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క), వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. బుధవారం రాత్రి హనుమకొండలోని కాళోజీ కళా క్షేత్రంలో రేచర్ల రుద్రయ్య ప్రాంగణంలో చేతన కళా వేదిక ఆధ్వర్యంలో ఓరుగల్లు సాంస్కృతిక మహాసమ్మేళనం, కాకతీయ కళల జాతర వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. నిర్వాహకులు ఆకుల నాగేశ్వర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వారు ముఖ్యఅతిథులుగా హాజరై ‘కుడా’ చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, ఇంటాక్ కన్వీనర్ పాండురంగారావు, ఆర్యవైశ్య నాయకులు గట్టుమహేష్‌బాబు, వరంగల్ శ్రీనివాస్‌తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలు ప్రారంభించి మాట్లాడారు. కాకతీయుల కీర్తి, ప్రతిష్టలు పెంచేలా కళావేదిక ఉత్సవాలు నిర్వహిస్తోందని చెప్పారు. ఈ ఉత్సవాల్లో నాటి వైభవం ఉట్టిపడేలా సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఉండడం మహాద్భుతమని కొనియాడారు. 800 ఏళ్ల చరిత్రను నేటి తరం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. శిల్ప కళా సంపదను పరిరక్షిస్తూ యునెస్కో గుర్తించేలా అందరం బాధ్యతగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. కాకతీయ యూనివర్సిటీలో వివిధ కళల కోర్సులు ఏర్పాటు చేయాలని నిర్వాహకులు కోరగా మంత్రి అందుకు తగిన విషయాలపై చర్చిస్తానన్నారు. కాళోజీ కళాక్షేత్రం వేదికపై కళాకారులు ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించాయి. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా కళాకారులు, కళాజాతర ప్రతినిధులు, వెయ్యికి మందికి పైగా ప్రజలు పాల్గొన్నారు.
పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క,
పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
కాకతీయ కళల జాతర వేడుకలు ప్రారంభం


