సాగు..సంబురంగా
నెల్లికుదురు : ఆ రైతు ఆయిల్ పామ్ సాగులో అధిక దిగుబడి సాధిస్తున్నాడు. ఉద్యాన, వ్యవసాయ శాఖ అధికారుల సూచనతో 2021లో ఆరు ఎకరాల్లో ఈ పంట సాగు చేపట్టాడు. ఎకరాకు 11.5 టన్నుల దిగుబడి సాధించి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు. అతనే మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం ఆలేరుకు చెందిన రూపిరెడ్డి గోపాల్‌రెడ్డి. గతంలో పసుపు, మిర్చి పంటలు సాగు చేసి అధిక దిగుబడులు సాధించి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందాడు. అయితే ఆ పంటల ధరల తారుమారు, మార్కెటింగ్ లేక ఆదాయం రాలేదు. దీంతో జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమల అధికారి మరియన్న, వ్యవసాయ అధికారుల సూచనల మేరకు ఆయిల్ పామ్ పంట సాగు చేపట్టాడు. 3 ఏళ్ల తర్వాత 2024–25 మధ్య పంట చేతికొచ్చింది. ఎకరాకు 11.5 టన్నుల దిగుబడి తీసి ఏటా రూ.13 లక్షల ఆదాయం పొందుతున్నాడు.జాతీయ స్థాయిలో ఇంత దిగుబడి ఇప్పటి వరకు ఏ రైతు సాధించలేదని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం 2025లో నిర్వహించిన మహా కిసాన్ మేళాలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. గోపాల్‌రెడ్డిని సన్మానించా రు. సాధారణంగా ఈ పంట ఎకరానికి 6 నుంచి 7 టన్నుల వరకే పంట చేతికొస్తుంది. అయితే అధి కారుల సూచనలు నిత్యం పరిగణనలోకి తీసుకుంటున్న గోపాల్‌రెడ్డి ఎకరాకు 11.5 టన్నుల దిగుబడి సాధిస్తూ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కొందరు రైతులు సాగులో ప్రత్యేక పద్ధతుల్లో లాభాల పంటలు పండించి ఆదర్శంగా నిలుస్తున్నారు. రసాయన ఎరువుల మందుల వినియోగానికి ఫుల్‌స్టాప్ పెట్టి సేంద్రియ పద్ధతిలో సాగు చేపడుతున్నారు. అలాగే, వరి, మిరప, పత్తి తదితర సంప్రదాయ పంటలకు వీడ్కోలు పలికి వాటి స్థానంలో మార్కెట్‌లో అధిక ధర లభించే కూరగాయలు, పండ్ల, ఆయిల్ పామ్ వంటి వైవిధ్య సాగు చేపడుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. మరికొందరు ఇప్పటికీ ఎద్దులతో వ్యవసాయం చేస్తున్నా రు. ఈ క్రమంలో సంక్రాంతి సందర్భంగా ఆ రైతులపై ‘సాక్షి’ ప్రత్యేకం కథనం.
ఎకరాకు 11. 5 టన్నుల దిగుబడి సాధిస్తున్న గోపాల్‌రెడ్డి
జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన రైతు


