కొత్తకొండకు కడిపికొండ వీరబోనం
● భోగి రోజున సమర్పించనున్న దామెరుప్పుల వంశస్తులు
● 600 ఏళ్లుగా కొనసాగుతున్న ఆనవాయితీ
కాజీపేట అర్బన్: సంక్రాంతి అనగానే పిండి వంటలు, ఇంటి ఎదుట రంగురంగుల ముగ్గులు, పతంగులుగుర్తుకువస్తాయి. కానీ, కాజీపేట మండలం కడిపికొండ గ్రామం ఇందుకు భిన్నంగా పండుగను జరుపుకుంటుంది. భోగి రోజున గ్రామంలోని (శాలివాహనులు) దామెరుప్పుల వంశస్తులు మాత్రం కొత్తకొండ జాతరలో వీరబోనం సమర్పించేందుకు ఎడ్లబండ్లను అందంగా అలకరిస్తారు. శివసత్తుల నృత్యాలు, మేళతాళాలతో ప్రత్యేకంగా నిలుస్తారు. ఈ మేరకు మంగళవారం దామెరుప్పుల వంశస్తులందరూ కొత్తకొండకు ఎడ్లబండ్లపై బయలుదేరారు. బుధవారం ఉదయం వరకు అక్కడికి చేరుకుని బోనం సమర్పిస్తామని తెలిపారు.
వీరభద్రుడి ఆదేశాలతో వీరబోనం..
చరిత్ర ఆధారంగా 600 ఏళ్ల కిత్రం కొత్తకొండ గ్రామంలోని సావీరుకొండ అటవీ ప్రాంతానికి కడిపికొండ గ్రామానికి చెందిన దామెరుప్పుల వంశస్తులు ఎడ్లబండ్లలో జీవనోపాధికి కట్టెలు కొట్టుకోవడానికి వెళ్లేవారు. కట్టెలు కొట్టుకుని కాసేపు సేదదీరి భోజనం చేసి తిరుగు ప్రయాణానికి బయలుదేరేందుకు ప్రయత్నించగా ఎడ్లబండ్లు మాయమయ్యాయి. అడవి మొత్తం వెదికినా దొరకపోవడంతో అలసిపోయి ఓ చెట్టు కింద నిద్రించారు. అందులో ఒకరికి కొత్తకొండ వీరభద్రుడు ప్రత్యక్షమై సావీరుకొండపై వెలిసిన నాకు మీ వంశస్తులు వీరబోనం సమర్పించాలని కోరాడు. దీంతో నాటినుంచి భోగీ రోజున కొత్తకొండ జాతరలో కడిపికొండ దామెరుప్పుల వంశస్తులు వీరబోనం సమర్పిస్తున్నారు.
కొత్తకొండకు కడిపికొండ వీరబోనం


