విస్తరణ.. విస్మరణ
బ్లూ ప్రింట్‌కే హనుమకొండ చౌరస్తా..
గ్రేటర్ వరంగల్‌లో ట్రాఫిక్ పద్మవ్యూహం
వరంగల్ అర్బన్: వరంగల్ నగరంలోని కీలక కూడళ్లు అభివృద్ధికి ఆమడ దూరంలో కొట్టుమిట్టాడుతున్నాయి. విస్తరణకు నోచుకోకపోవడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా ఏళ్లుగా పెండింగ్‌లో ఉంటున్న కూడళ్లను వదిలేసి అన్ని క్లియరెన్స్ ఉన్న జంక్షన్లను మాత్రమే అభివృద్ధి చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. జనం రద్దీతో కిక్కిరిసిపోతున్న కూడళ్లపై దృష్టి సారించడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఆయా కీలక జంక్షన్లలో అడుగడుగునా ట్రాఫిక్ సమస్య జఠిలంగా మారుతోంది. వరంగల్ మహానగర పాలక సంస్థ (జీడబ్ల్యూఎంసీ), కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కుడా), రహదారులు, భవనాల శాఖల(ఆర్‌అండ్‌బీ) మధ్య సమన్వయం లేదు. ఎవరికి వారు అభివృద్ధి పనులు వదిలేయడం పరిపాటిగా మారింది. జంక్షన్ల అభివృద్ధి, సుందరీకరణపై దృష్టి సారించాల్సిన శాఖలు నిమ్మకునీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నాయి. ముఖ్యంగా నగరంలోని ఐదు ప్రధాన కూడళ్ల విస్తరణ, అభివృద్ధి పనులపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.
కాజీపేట జంక్షన్..
వరంగల్ నగరంలో ప్రధానమైన కాజీపేట జంక్షన్ అభివృద్ధికి నోచుకోవడం లేదు. హైదరాబాద్ వైపు వెళ్లే రోడ్డు విస్తరణ న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉంది. ఇక హనుమకొండ వైపు రహదారిలో రైల్వే స్టేడియం వైపు విస్తరించాల్సి ఉంది. భారతదేశ దక్షిణ, ఉత్తర ప్రాంతాలను కాజీపేట రైల్వే స్టేషన్ అనుసంధానం చేస్తుంది. కీలకమైన ప్రాంతంలోని కాజీపేట కూడలి విస్తరణ, అభివృద్ధికి నోచుకోకపోవడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
గవిచర్ల జంక్షన్‌లో లేని ట్రాఫిక్ సిగ్నల్స్..
మామునూరు ఎయిర్‌పోర్టుకు దశాబ్దల తర్వాత మహర్దశ లభించనుంది. మరికొద్ది నెలల్లో విమానాలు ఎగరనున్నాయి. ప్రాముఖ్యం కలిగిన ఖమ్మం రోడ్డులోని రంగశాయిపేట–గవిచర్ల క్రాస్‌రోడ్డు నిత్యం ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. రహదారి విస్తరణ, అభివృద్ధి పనుల్లేవు. కనీసం ట్రాఫిక్ సిగ్నల్స్ లేవు. దీంతో రద్దీగా ఉండే ఈ జంక్షన్‌లో ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. అటు ప్రజాప్రతినిధులు, ఇటు అధికార యంత్రాంగం చూసీచూడనట్లుగా వ్యవహరిస్తోందనే విమర్శలు ఉన్నాయి.
వరంగల్‌లో ట్రాఫిక్ అస్తవ్యస్తం..
వరంగల్ తూర్పు నియోజకవర్గం వ్యాపార, వాణిజ్య కేంద్రాలకు నిలయం. ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా అతిపెద్ద హోల్‌సేల్, రిటైల్ మార్కెట్. బంగారం, వెండి, దుస్తులు, కిరాణం, స్టీల్, ఐరన్, రెడీమేడ్ తదితర వ్యాపారాలకు కేంద్ర బిందువు. వరంగల్ చౌరస్తాలో ట్రాఫిక్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. వేల సంఖ్యలో వాహనాల రాకపోకలు. కానరాని ట్రాఫిక్ సిగ్నల్స్, మొక్కుబడిగా కనిపించే ట్రాఫిక్ పోలీసులు, అడ్డదిడ్డంగా వెళ్లే వాహనదారులు, వాటిని తప్పించుకొని బిక్కుబిక్కుమంటూ ప్రయాణికులు వెళ్లాల్సిన దయనీయ పరిస్థితి నెలకొంది. ట్రాఫిక్ సిగ్నల్స్, జీబ్రా రాతలు లేవు. కనీసం వాహనాల రాకపోకలకు కంట్రోల్ లేదు. అదే పరిస్థితి హెడ్‌పోస్టాఫీస్ జంక్షన్‌ది. ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేసినా విస్తరణ, అభివృద్ధి పనులకు మోక్షం లభించడం లేదు. వరంగల్‌లో హెడ్‌పోస్టాఫీస్, వరంగల్ చౌరస్తా జంక్షన్ల విస్తరణ, అభివృద్ధిపై ప్రభుత్వ శాఖలు సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. విస్తరణ, అభివృద్ధి పనులు చేసేందుకు అవకాశాలున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇష్టారాజ్యంగా వాహనాల రాకపోకలతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.
నగరంలో అభివృద్ధికి నోచుకోని ప్రధాన కూడళ్లు
వాహనదారులు, పాదచారుల ఇబ్బందులు
చోద్యం చూస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులు
మహా నగర నడిబొడ్డున ఉన్న హనుమకొండ చౌరస్తా నిత్యం రద్దీగా ఉంటుంది. నిత్యం ఇక్కడి నుంచి మంత్రులు, వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు, గ్రేటర్ వరంగల్ కమిషనర్ రాకపోలకు సాగిస్తుంటారు. 20 ఏళ్లనాటి జంక్షన్ ప్రతిపాదనలు మూలనపడ్డాయి. పదేళ్ల క్రితం అప్పటి పాలకవర్గం పెద్దలు హనుమకొండ చౌరస్తాను అద్భుతంగా తీర్చిదిద్దుతామని బ్లూ ప్రింట్ చూపించి తర్వాత పట్టించుకోలేదు. 1954లో హనుమకొండ సగర వీధికి చెందిన తైలం యాదగిరి చౌరస్తాలో సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి, పార్కు నిర్మించారు. పాలకులు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ ఖ్యాతి మసకబారిపోయింది. ప్రస్తుతం హనుమకొండ చౌరస్తా అభివృద్ధికి నోచుకోక వాహనదారుల సమస్యలకు కేంద్ర బిందువుగా మారింది.
విస్తరణ.. విస్మరణ


