‘నన్ను మన్నించండి.. మీకు గౌరవప్రదమైన వీడ్కోలు ఇవ్వలేకపో
‘చివరి మజిలీకి కేరాఫ్ నేను. అలసి జీవిడిసిన దేహాలకు సాంత్వన నేను. శాశ్వత నిద్రకు ఉపక్రమించిన వారికి మట్టి పొరల్లోని పాన్పును నేను. కాలం కాదన్న ఎందరినో అక్కున చేర్చుకున్న నాకు.. నాపైనే విరక్తి పుడుతోంది. కన్నీళ్లను నింపుకుని వచ్చే వారికి కనీస వసతులు కూడా ఇవ్వలేకపోతున్నాను’ అని కాజీపేట దర్గా గ్రామ శివారున, బంధం చెరువు కట్టను ఆనుకుని ఉన్న హిందూ శ్మశాన వాటిక తన గోడును వెల్లబోసుకుంది.
బంధం చెరువు పక్కనే ఉన్నందున నీటి సౌకర్యం బాగుంటుందని ఒకప్పుడు నన్ను(శ్మశానం) ఇక్కడ ఎంచుకున్నారు. గడిచిన 20 ఏళ్లుగా నేను అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాను. చుట్టూ రక్షణ గోడ లేదు. దాంతో కుక్కలు, పందులు నా ఆవాసంలో స్వైరవిహారం చేస్తున్నాయి. ఇక్కడ అంతిమ సంస్కారం జరుగుతుంటే పక్కనే జంతువులు తిరుగుతుండడం, కాకులకోసం ముద్ద పెడితే వాటిని కుక్కలు, పందులు దొర్లించడం కలచివేస్తోంది. పుట్టెడు దుఖఃంలో ఉన్న వారు మరోమారు బావురుమంటుంటే బాధేస్తోంది.
మీ బాధ.. నా అశక్తత
ఆత్మీయులకు వీడ్కోలు పలకడానికి వచ్చిన వారికి కనీసం కూర్చోవడానికి నీడ కూడా లేదు, తలదాచుకోవడానికి గదీ లేదు. అంతిమ సంస్కారం ముగించుకున్నాక స్నానం చేద్దామంటే నీటి సౌకర్యం లేదు. అస్థికలను, బట్టలను భద్రపర్చుకునే వీలే లేదు. పాత ఘోరీలతో నిండిపోయింది నా ఆవరణంతా. బర్నింగ్ ఘాట్లు, ఆధునిక వసతులు ఉంటే ఇబ్బందులు తప్పుతాయని తెలుసు. కానీ, నా మొర ఎవరికీ వినబడట్లేదు.
రాజకీయ చదరంగంలో నా ఉనికి..
నాది 49వ డివిజన్ పరిధి. కానీ, నన్ను వాడుకునే వారు 90 శాతం మంది 48వ డివిజన్ వారే. ఇదే నా పాలిట శాపమైంది. ఒకరు అభివృద్ధి చేద్దామని ముందుకు వస్తే, మరొకరు వెనక్కి లాగుతున్నారు. అధికారుల చిత్తశుద్ధి కేవలం కాగితాలకే పరిమితమైంది. ఏడుసార్లు టెండర్లు పిలిచారట.. కానీ, ఒక్క కాంట్రాక్టర్ కూడా నన్ను బాగు చేయడానికి ముందుకు రాలేదు. స్వయానా, ఎమ్మెల్యే, కలెక్టర్, నగర పాలక కమిషనర్ వచ్చి చూసి వెళ్లినా, నా రాత ఏ మాత్రం మారలేదు.
వైరుధ్యాల వేదికను
చూడండి.. నా పక్కనే బతుకమ్మ ఉత్సవాలు జరుగుతాయి, వినాయక నిమజ్జనాలు జరుగుతాయి. ఒకవైపు సంబరాలు.. మరోవైపు నేను నిశ్శబ్దంగా రోదిస్తున్నా. గత ప్రభుత్వం ‘అంతిమ యాత్ర–గౌరవప్రదంగా‘ సాగాలని వైకుంఠ ధామాల పేరుతో మాతోటి వారిని అభివృద్ధి చేశారు. కానీ, నా దౌర్భాగ్యం ఏంటో ఎవరూ పట్టించుకోవట్లేదు. కోట్ల నిధులు నా వరకు వచ్చేసరికి ఏమయ్యాయో.. ఏ మాయావి మింగేశాడో తెలియదు.
మీకో విన్నపం..
జీవితమంతా కష్టపడి, కడసారి నా దగ్గరకు వచ్చే జీవికి ఆత్మతృప్తితో కూడిన గౌరవ ప్రదమైన అంతిమ వీడ్కోలు లభించాలని నేను కోరుకుంటున్నా. ఓ ప్రజాప్రతినిధులారా! ఓ నాయకులారా! అధికారులారా.. ఇప్పటికై నా నా గోడు వినండి. రాజకీయ విభేదాలు పక్కన పెట్టి నాకు కనీస వసతులు కల్పించండి. నేను అడుగుతున్నది నా కోసం కాదు, రేపు నా ఒడికి చేరే మీ ఆత్మీయుల కోసం.
– హన్మకొండ అర్బన్


