కై ్లమాక్స్‌కు భూభారతి కుంభకోణం
నేడోరేపో వెల్లడి..
జనగామ: భూభారతి పోర్టల్ స్లాట్ బుకింగ్ వ్యవహారం ప్రస్తుతం కై ్లమాక్స్ దశకు చేరింది. జనగామ జిల్లా పోలీసులు దర్యాప్తులో వేగంలో పెంచి, గ్రామస్థాయికి వెళ్లి కీలక ఆధారాలు సేకరిస్తున్నారు. ఇంటర్నెట్ సెంటర్లు, మీ సేవ కేంద్రాల సంబంధిత నిర్వాహకులను విచారణకు పిలిపించి, స్లాట్ బుకింగ్ ప్రక్రియలో ఎవరెవరి పాత్ర ఉందనే అంశపై కూపీ లాగుతున్నారు. జనగామ జిల్లాలో చిల్పూరు, స్టేషన్‌న్‌ఘన్‌పూర్, కొడకండ్ల, జనగామ తదితర మండలాల్లో పెద్ద ఎత్తున స్లాట్ బుకింగ్ జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే పూర్తిస్థాయి స్పష్టత కోసం దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. స్లాట్ బుకింగ్ వ్యవహారం అక్రమాలు ఒకదాని తర్వాత ఒకటి వెలుగులోకి వస్తున్నాయి. దీనిలో ప్రముఖులు కూడా భాగస్వాములై ఉండవచ్చన్న అనుమానాలు పెరుగుతున్నాయి.
‘లైవ్’ చేసినట్టేనా ?
సాధారణంగా ప్రభుత్వం ఏదైనా పోర్టల్‌ను అమల్లోకి తీసుకొచ్చినప్పుడు కనీసం రెండు నుంచి మూడు నెలలపాటు ట్రయల్ రన్ నిర్వహిస్తుందని మేధావులు అంటున్నారు. అయితే భూభారతి పోర్టల్ విషయంలో అలాంటి టెస్టింగ్ నిజంగా జరిగిందా, లేకుంటే టెస్టింగ్‌ను పక్కనపెట్టి కోడ్‌ను నేరుగా ‘లైవ్’ చేసినట్టేనా అన్న సందేహాలు సైతం వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వంలో పనిచేసే అనుభవజ్ఞులైన అధికారులకు కూడా ఇలాంటి లోపాలు తెలియకపోవడం ఆశ్చర్యకరమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. స్లాట్ బుకింగ్ ద్వారా న్యాయబద్ధంగా రిజిస్ట్రేషన్లు చేసుకున్న రైతులకు అధికారులు నోటీసులు జారీ చేయడం మరింత సంచలనం రేపింది. సదరు రైతులు రిజిస్ట్రేషనన్‌కు చెల్లించిన డబ్బులు మళ్లీ ఎలా రీఫండ్ అవుతాయి, ఎవరిని సంప్రదించాలంటూ అధికారుల వద్దకు వెళ్లినట్లు స మాచారం. ఇప్పటి వరకు జిల్లాలో 10 మంది రైతులకు నోటీసులు అందాయి. ఇక జిల్లా కేంద్రంలో మ రో 20 నుంచి 30 మంది, మొత్తం సుమారు 35 మంది వరకు ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నా రు. అయితే దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
పోర్టల్‌ను మానిటరింగ్ చేశారా?
రాష్ట్ర వ్యాప్తంగా రోజూ ఎన్ని రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి, ఎంత మొత్తంలో ప్రభుత్వానికి వెళ్తుందన్న వివరాలు స్పష్టంగా తెలియకుండానే వ్యవస్థ నడుస్తుండడంపై ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒక ప్రభుత్వ వెబ్‌సైట్‌లోకి వచ్చిన తర్వాత కొంతకాలం మానిటరింగ్ చేస్తారు. భూభారతి విషయంలో అలాంటి పర్యవేక్షణ నిజంగా జరిగిందా లేదా అన్న ప్రశ్నలు సోషల్ మీడియా, ప్రజల్లోనూ తీవ్రంగా చర్చకు దారి తీస్తున్నాయి. భూభారతి స్లాట్ బుకింగ్ కుంభకోణం వెలుగులోకి రావడం, దానికి సంబంధించిన దర్యాప్తు వేగంగా ముందుకు సాగడం, రీఫండ్ పెండింగ్ దరఖాస్తులు భారీ సంఖ్యలో ఉండటంతో భూ రిజిస్ట్రేషన్ వ్యవస్థపై మరింత అనుమానాలను రేకెత్తిస్తున్నాయి.
మీసేవ, ఇంటర్నెట్ సెంటర్లపై నిఘా
దర్యాప్తులో వేగం పెంచిన జనగామ పోలీసులు
రోజువారీ రిజిస్ట్రేషన్ల డాటా
లేకపోవడంపై అనుమానాలు
భూభారతి స్లాట్ బుకింగ్ కుంభకోణంపై జరుగుతున్న దర్యాప్తు వేగంగా ముందుకు సాగుతోంది. నేడో రేపో పూర్తి వివరాలను పోలీసు ఉన్నతాధికారులు మీడియా ముందు ఉంచే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం జనగామ, కొడకండ్లకు చెందిన మీసేవ, ఇంటర్నెట్‌కు చెందిన నలుగురు నిర్వాహకులను పోలీసులు పిలిపించి ఎవరెవరు అప్రోచ్ అయ్యారని సమాచారం సేకరిస్తున్నారు. ఇదిలా ఉండగా గత బీఆర్‌ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాల్లో ధరణి, భూభారతి స్లాట్ క్యాన్సలేషన్‌కు సంబంధించిన పెండింగ్ రీఫండ్ దరఖాస్తులు సుమారు 31,314 ఉండడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.కాగా, భూభారతి స్లాట్ బుకింగ్ కేసులో జనగామ జిల్లా పాలకుర్తి మండలం వావిలాలకు చెందిన ఓ ఇంటర్నెట్ నిర్వాహకుడిని సైతం పోలీసులు తీసుకువెళ్లి విచారిస్తున్నారు. దీంతో ఈ సంఖ్య ఐదుగురికి చేరింది. ఇదిలా ఉండగా జనగామ జిల్లాలో అక్రమంగా చేసిన భూభారతి చలాన్లు 100 వరకు పెరిగినట్లు సమాచారం. 2022 నుంచే చలాన్ల వ్యవహారం కొనసాగుతున్నట్లు పోలీసుల విచారణలో ప్రాథమికంగా తేలినట్లు తెలుస్తుండగా, దీనిపై పూర్తి స్పష్టత రావాల్సి ఉంది.


