సమాధానాలతో సరిపెడితే ఎలా? | - | Sakshi
Sakshi News home page

సమాధానాలతో సరిపెడితే ఎలా?

Jan 23 2024 1:14 AM | Updated on Jan 23 2024 10:05 AM

దరఖాస్తులు స్వీకరిస్తున్న అధికారులు  - Sakshi

దరఖాస్తులు స్వీకరిస్తున్న అధికారులు

వరంగల్‌ అర్బన్‌: ‘ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు.. పరిష్కరిస్తామని సమాధానం చెబుతున్నారు.. అయితే క్షేత్ర స్థాయిలో పనులు, సమస్యలను పట్టించుకోకుండా సమాధానాలతో సరిపెడితే ఎలా?’ అంటూ పలు కాలనీల ప్రజలు అధికారులను నిలదీశారు. బల్దియా కౌన్సిల్‌ హాల్‌లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌లో అధికారులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 57 వినతులు వచ్చా యి. అందులో ఇంజనీరింగ్‌ సెక్షన్‌ 10, హెల్త్‌– శానిటేషన్‌ 7, ప్రాపర్టీ టాక్స్‌(రెవెన్యూ)8, టౌన్‌ ప్లానింగ్‌ 31, ఉద్యాన వన విభాగం 1 ఉన్నాయి. అత్యధికంగా అక్రమ నిర్మాణాలు, అనుమతి లేని భవనాలపై వచ్చాయి. కార్యక్రమంలో అడిషనల్‌ కమిషనర్లు అనిసుర్‌ రషీద్‌, రవీందర్‌యాదవ్‌, ఎస్‌ఈలు కృష్ణారావు, ప్రవీణ్‌చంద్ర, సిటీ ప్లానర్‌ వెంకన్న, బయాలజిస్ట్‌ మాధవరెడ్డి, డీఎఫ్‌ఓ శంకర్‌లింగం, హెచ్‌ఓ రమేష్‌, డిప్యూటీ కమిషనర్‌ రవీందర్‌, టీపీఆర్‌ఓ రాజేష్‌ కుమార్‌గౌడ్‌ పాల్గొన్నారు.

ఫిర్యాదుల్లో కొన్ని..
► 55వ డివిజన్‌ భీమారం శ్యామల చెరువు(సర్వే నంబర్‌ 642)కు సంబంధించి 67.22 ఎకరాలు ఉండగా 30ఎకరాల భూమి ఆక్రమణకు గురైంది. అందులో నిర్మాణాలు చేపడుతున్నారని ఎన్ని మార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని సిటీ ప్లానర్‌ను కాలనీవాసులు నిలదీశారు.

► 17వ డివిజన్‌ స్తంభంపల్లి ఆదర్శనగర్‌లో 66–3–102, 66–3–130 నంబరు కలిగిన ఇళ్లకు ఏడాది కాలంగా నల్లా నీరు రావడం లేదు. ఏఈకి వంద సార్లు ఫోన్‌ చేసినా పట్టించుకోవడం లేదని సురేందర్‌, మరో వ్యక్తి వేర్వేరుగా ఫిర్యాదు చేశారు.

► రంగంపేటలోని తమ ఇంటి నల్లా బైఫరికేషన్‌లో మార్చారని, తమకు న్యాయం చేయాలని రాధిక ఫిర్యాదు చేశారు.

► వరంగల్‌లోని మక్కా మసీదు వద్ద డ్రెయినేజీ సరిగ్గా లేక అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని మసీదు కమిటీ ప్రతినిధులు వినతి పత్రం ఇచ్చారు.

► నగరంలోని దర్గాలు, గ్రేవి యార్డుల్లో చెట్ల కట్టింగ్‌, పారిశుద్ధ్య పనులు చేపట్టి లైటింగ్‌ ఏర్పాటు చేయాలని ఈద్గా ఫోర్ట్‌ ప్రతినిధులు వినతి పత్రాన్ని అందజేశారు.

► 1వ డివిజన్‌ భీమారం ఎర్రగట్టుగుట్ట శ్రీనివాసకాలనీలో 2 కల్వర్టులు నిర్మించాలని పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదని అభివృద్ధి కమిటీ ప్రతినిధులు దరఖాస్తు ఇచ్చారు.

► హనుమకొండ రెవెన్యూ కాలనీలో మిగిలి ఉన్న 1.5 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు సాయిలు, దేవేందర్‌రావు వినతిపత్రం ఇచ్చారు.

► భీమారం విద్యారణ్యపురి 2–12–14/1 ఇంటి నంబర్‌కు నల్లా లేకున్నా మూడేళ్ల నుంచి బిల్లు వస్తుందని, మినహాయించాలని శివనాగయ్య దరఖాస్తు పెట్టుకున్నారు.

► నగరంలో కుక్కలు, కోతుల బెడద విపరీతంగా ఉంది. బయటకు రావాలంటే ప్రజలు హడలిపోతున్నారు. వారిని రక్షించాలని డి.తిరుపతి వినతి పత్రం సమర్పించారు.

► 64వ డివిజన్‌ హిల్స్‌కాలనీ టీఎన్‌జీవోస్‌ కాలనీ చుట్టూ డ్రెయినేజీ లేక మురుగునీరు రోడ్డుపై పారుతోందని, కాల్వ నిర్మించాలని కాలనీ వాసులు వినతిపత్రం ఇచ్చారు.

► 4వ డివిజన్‌ యాదవనగర్‌ పెట్రోల్‌ పంపు వెనుక డ్రెయినేజీ లేక ఖాళీ స్థలాలు, ఇళ్ల మధ్యలోకి మురుగునీరు వస్తున్నదని, సీసీ రోడ్లు, డ్రెయినేజీలు నిర్మించాలని కాలనీల వాసులు దరఖాస్తు ఇచ్చారు.

► గొర్రెకుంట 45–3–90 నంబర్‌ కలిగిన చిన్న రేకుల ఇంటికి సంబంధించి పన్ను ప్రతీ ఏడాది చెల్లిస్తున్నా ఇంకా రూ.4,791 బకాయితోపాటు వడ్డీ రూ.19,086 చెల్లించాలంటున్నారు.. వాస్తవాలను గుర్తించాలని బి.రమేష్‌ వినతి పత్రాన్ని అందచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement