తెనాలి రూరల్: సబ్ డివిజన్‌లో పంచాయతీ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ బి.జనార్దనరావు తెలిపారు. 1,600 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశామని చెప్పారు. తెనాలి జేఎంజే కళాశాలలో శనివారం అధికారులతో పాటు పోలీసు సిబ్బందికి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రైనీ ఐపీఎస్ లక్ష్మీ అన్నపూర్ణ ప్రత్యూష, ట్రైనీ డీఎస్పీ కోడతి సూర్యతేజతో కలిసి తెనాలి డీఎస్పీ మాట్లాడారు. ఎన్నికల బందోబస్తు, నిబంధనలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు, సిబ్బందికి కీలక సూచనలు చేశారు. నాలుగు మండలాల్లో ఒక్కో దానికి 400 మంది చొప్పున పోలీసు సిబ్బందిని కేటాయించామని వివరించారు. ఎన్నికల నిర్వహణను పర్యవేక్షించేందుకు ప్రొబేషనరీ ఐపీఎస్, డీఎస్పీ అధికారులు కూడా ప్రత్యేకంగా విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. సంబంధిత పంచాయతీల్లో ఓటు హక్కు లేని బయటి వ్యక్తులు గ్రామాల్లోకి రావద్దని సూచించారు. రౌడీషీటర్లు, ట్రబుల్ మాంగర్లను ఇప్పటికే బైండోవర్ చేసి కౌన్సెలింగ్ ఇచ్చామని చెప్పారు. విజయోత్సవాలు, ర్యాలీలు, ఊరేగింపులు పోలీసుల, రిటర్నింగ్ అధికారి అనుమతితోనే విజయోత్సవాలు నిర్వహించుకోవాలని సూచించారు. గొడవలు, అల్లర్లకు పాల్పడినా, ఓటర్లకు ఆటంకం కలిగించినా కేసులు నమోదు చేస్తామన్నారు.


