పరిష్కరించాకే అర్జీలను క్లోజ్‌ చేయాలి | - | Sakshi
Sakshi News home page

పరిష్కరించాకే అర్జీలను క్లోజ్‌ చేయాలి

Sep 1 2026 1:37 AM | Updated on Sep 1 2026 1:37 AM

కుల వివక్షతో నిర్లక్ష్యం చేస్తున్నారు రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలి

జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ అశుతోష్‌ శ్రీ వాస్తవ

గుంటూరు వెస్ట్‌: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజలు అందిస్తున్న అర్జీలను పూర్తి స్థాయిలో పరిష్కరించిన తర్వాత ముగించాలని జాయింట్‌ కలెక్టర్‌ అశుతోష్‌ శ్రీ వాస్తవ అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని ఎస్‌ఆర్‌ శంకరన్‌ సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమంలో జేసీ మాట్లాడుతూ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారుల సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయాలన్నారు. అర్జీలను నిర్లక్ష్యం చేయకుండా పరిశీలించాలన్నారు. నిర్ణీత గడువులోగా పరిష్కరించడంతోపాటు, పరిష్కారం సాధ్యంకాని అంశాలపై స్పష్టమైన కారణాలను అర్జీదారులకు తెలియజేయాలని తెలిపారు. అనంతరం వచ్చిన 273 అర్జీలను జేసీతోపాటు డీఆర్వో షేక్‌ ఖాజావలి, డ్వామా పీడీ శంకర్‌, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి విజయలక్ష్మి, డీపీఓ సాయి కుమార్‌, జిల్లా వ్యవసాయ అధికారి పద్మావతి, జిల్లా అధికారులు పరిశీలించారు.

అస్తవ్యస్తంగా రోడ్డు నిర్మాణం

కృష్ణబాబు కాలనీ 2వ లైనులో సుమారు 30 అడుగుల రోడ్డు ఉంది. ఇటీవల సిమెంట్‌ రోడ్డు మంజూరు చేసి పనులు ప్రారంభించారు. అయితే రోడ్డును 14 అడుగులకే వేస్తున్నారు. సైడ్‌ డ్రైన్స్‌ కూడా నిర్మించడం లేదు. దీనివల్ల మురుగు అక్కడే నిలిచిపోతోంది. రోడ్డు కూడా వెడల్పు తగ్గడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీనిని పరిశీలించాలి. కాలనీలో పారిశుద్ధ్య సమస్య కూడా తీవ్రంగా ఉంది.

– ఈమని బుచ్చిబాబు, గుంటూరు

గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు గ్రామంలో దళితులు, బీసీలకు 42 గృహాలున్నాయి. కేవలం అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంతో వీరంతా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గ్రామంలో 241 సర్వే నెంబర్‌లో 25 ఎకరాలు భూమి కింద తీసేయగా.. మిగిలిన సుమారు 86 ఎకరాలు వాటర్‌ ట్యాంకుల కింద వదిలేశారు. ఇది మొత్తం అసైన్డ్‌లోనే చేరింది. ఇందులోనే 42 మందికి సంబంధించిన ఇళ్లు ఉండడంతో రిజిస్ట్రేషన్స్‌ కాకుండా అసైన్డ్‌లో చూపిస్తున్నారు. పీజీఆర్‌ఎస్‌ సహా స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళితే వాస్తవాలు గ్రహించి గృహాలు ఉన్న సుమారు 1.12 సెంట్లు అసైన్డ్‌ నుంచి తొలగించాలన్నారు. అర్జీ ఇచ్చినప్పుడు మాత్రం కంటి తుడుపు చర్యగా వస్తున్నారు. అధికారులు చేసిన తప్పులకు సామాన్యులు బలవుతున్నారు. దళితులు, బీసీలు అనే వివక్ష చూపుతున్నారు. అధికారులు స్పందించకపోతే న్యాయపోరాటానికి దిగుతాం.

– వట్టిచెరుకూరు వాసులు

నాదెండ్ల రామచంద్రయ్య తదితరులు,

రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని 1985లోనే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్‌ ఆమోదానికి పంపింది. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో టీడీపీ ఈ అంశం చేర్చింది. తర్వాత దీనిని విస్మరించింది. 2018లో కూడా అధ్యయన కమిటీ వేశారు. రజకులు ఇప్పటికీ అన్ని రంగాల్లో దారుణంగా వెనుకబడ్డారు. వారిని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మాకు న్యాయం చేయాలి.

– ఏపీ రజక ఎస్సీ సాధన కమిటీ నాయకులు, గుంటూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement