వచ్చే నెల 26 వరకు ఉద్యమ కార్యాచరణ
గుంటూరు వెస్ట్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ వ్యతిరేక విధానాలపై ఉద్యోగ సంఘాలు ధ్వజమెత్తాయి. ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు సోమవారం గుంటూరు కలెక్టరేట్‌లోని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఏపీ జేఏసీ అమరావతి గుంటూరు జిల్లా చైర్మన్ కిరణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి రజనీకాంత్‌ల ఆధ్వర్యంలో ఉద్యోగులు, ప్రజలతో కలిసి జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవకు అర్జీ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా నిలిచే ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం మనసుతో ఆలకించాలంటూ వేడుకున్నారు. ప్రభుత్వం ఎలాంటి లక్ష్యాలను విధించినా భుజానికెత్తుకునే ఉద్యోగులను పట్టించుకోకపోతే ఉద్యమ జెండా ఎత్తుకుంటామంటూ హెచ్చరించారు. తమకు రావాల్సిన బకాయిలు తమకు ఇప్పించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని అధికారులను కోరారు. ఉద్యోగుల హక్కుల సాధన కోసం ఉద్యమ కార్యాచరణ ప్రకటించామని, ప్రభుత్వం స్పందించకపోతే ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. మొదటి దశ నేటి నుంచి ప్రారంభమై సెప్టెంబర్ 11 వరకు కొనసాగుతుందన్నారు. సెప్టెంబర్ 1న ‘‘సీఎం సార్.. మా డబ్బులు మాకివ్వండి’’ నినాదంతో సెల్‌ఫోన్ డీపీల ద్వారా నిరసన తెలుపుతామని చెప్పారు. 2 నుంచి 5వ తేదీ వరకు ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరై, హ్యాండ్ టు హ్యాండ్ కార్యక్రమం ద్వారా కార్యాలయాలను సందర్శించి ఉద్యోగులను ఉద్యమంలో భాగస్వామ్యం చేస్తామన్నారు. లంచ్ అవర్‌లో నిరసన చేపడతామని చెప్పారు. సెప్టెంబర్ 11 నుంచి అన్ని జిల్లా కేంద్రాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు, కార్మిక, ఉద్యోగ సంఘాల నాయకులతో తదుపరి ఉద్యమ కార్యాచరణపై చర్చలు నిర్వహిస్తామని వెల్లడించారు. సెప్టెంబర్ 15 నుంచి 26 వరకు రెండో దశ ఉద్యమం ఉంటుందని చెప్పారు. అందులో భాగంగా వర్క్ టూ రూల్ ఉద్యమం, సోషల్ మీడియాలో ప్రచారం, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు, నల్ల కండువాలతో నిరసన చేపడతామన్నారు. మానవహారం చేపడతామని తెలిపారు. 23న కలెక్టరేట్, ఆర్డీఓ కార్యాలయాల వద్ద ధర్నాలు, 26న ఉద్యోగుల కుటుంబ సభ్యులతో కలిసి కార్యక్రమాలు చేస్తామని వెల్లడించారు.
మా కష్టాలు పట్టవా సారూ..
ఏపీ ఆర్‌ఎస్‌ఏ మహిళా విభాగం జిల్లా చైర్‌పర్సన్ భువనేశ్వరి మాట్లాడుతూ ఉద్యోగులు ఎన్నో అవస్థలు పడుతున్నా పట్టించుకోరా అంటూ నిట్టూర్చారు. కుటుంబంలో నిత్యావసర సరుకులకు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. ఉద్యోగులకు అప్పులు చేయనిదే కుటుంబాలు గడవని పరిస్థితి నెలకొందని, ప్రభుత్వం దీనిపై వెంటనే స్పందించాలని కోరారు. కార్యక్రమంలో ఏపీ ఆర్‌ఎస్‌ఏ గౌరవ అధ్యక్షుడు కేవీ గోపాలకృష్ణ, కొల్లిపర తహసీల్దార్ సిద్ధార్థ, ఉద్యోగ సంఘ నాయకులు పాల్గొన్నారు.


