హత్య కేసులో 11 మంది నిందితులు అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

హత్య కేసులో 11 మంది నిందితులు అరెస్ట్‌

Sep 1 2026 1:37 AM | Updated on Sep 1 2026 1:37 AM

లక్ష్మీపురం: హత్య కేసులో 11 మంది నిందితులను పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేశారు. నగరంపాలెం పోలీస్‌ స్టేషన్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈస్ట్‌ డీఎస్పీ సీతారాం, నగరంపాలెం సీఐ రాజేష్‌ వివరాలు వెల్లడించారు. వివాహేతర సంబంధం నేపథ్యంలో 2006లో బుల్లయ్య అలియాస్‌ బుల్లిని పెండ్రాల వెంకన్న అలియాస్‌ చిన్నా హత్య చేశాడు. ఆ కేసులో చిన్నాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. జైలు శిక్ష అనుభవించాక చిన్నా రెండో వివాహం చేసుకుని తెలంగాణలోని సూర్యాపేటలో నివాసం ఉంటున్నాడు. చిన్నా(47)ను హతమార్చాలని బుల్లయ్య కుమారుడు పెండ్రాల ఇమ్మానియల్‌ రాజు, ఇతర కుటుంబ సభ్యులు పగతో రగిలి పోతున్నారు. ఈ నేపథ్యంలో బాబాయ్‌ ముత్తయ్య మృతి చెందాడని తెలిసి చిన్నా శనివారం గుంటూరులోని కె.వి.పి.కాలనీలో గాజుల వారి వీధి 1/12వ లైన్‌కు వచ్చాడు. చిన్నా వెంట అతని భార్య, కుమారుడు ఉన్నారు. విషయం తెలుసుకున్న పెండ్రాల ఇమ్మానియల్‌ రాజు, అతడి సోదరులు అమూల్యరాజు, దేవరాజు, గురవయ్య, శ్యామ్‌, బాబుజ్జి, జమాలమ్మ, రాజ్‌ కుమార్‌ అలియాస్‌ రాజు, బత్తుల మోషేరాజు అలియాస్‌ మోషే, దేవరకొండ షాలేమ్‌రాజు అలియాస్‌ సలీమ్‌, ఇరుగుబాబు, మరో ముగ్గురు కలిపి మొత్తం 14 మంది హత్యకు పథకం వేశారు. ఆదివారం ఉదయం 10.30 గంటల సమయంలో కె.వి.పి. కాలనీ 1/7వ లైన్‌లో భార్య, కుమారుడితో వెళుతుండగా ఒక్కసారిగా వారందరూ కూడా వేట కత్తులు, కర్రలతో దాడి చేశారు. చిన్నాను దారుణంగా హతమార్చి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ సమాచారం తెలుసుకున్న నగరంపాలెం పోలీసులు, సీఐ రాజేష్‌ ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. 14 మందిలో 11 మంది నగరంపాలెం పోలీస్‌ స్టేషన్‌లో ఆదివారం రాత్రి లొంగిపోయారు. హత్యకు వినియోగించిన రెండు ద్విచక్ర వాహనాలను, కత్తిని పోలీసులు స్వాఽధీనం చేసుకున్నారు. మిగిలిన ముగ్గురు నిందితులలో బాలుడు కూడా ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. 11 మందిని నగరంపాలెం పోలీసులు అరెస్ట్‌ చేసిన అనంతరం కోర్టులో హజరు పరిచారు. వారిని రిమాండ్‌ విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement