నేటి నుంచి మంగళగిరిలో ఏపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌లు | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి మంగళగిరిలో ఏపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌లు

Jun 24 2026 1:35 AM | Updated on Jun 24 2026 1:35 AM

నేటి నుంచి మంగళగిరిలో ఏపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌లు అమరావతిలో కేంద్ర సహాయ మంత్రి టోఖన్‌ సాహు పర్యటన ఉండవల్లిలో గ్యాస్‌ సిలిండర్‌ లీక్‌

మంగళగిరి రూరల్‌: మంగళగిరి క్రికెట్‌ స్టేడియంలో బుధవారం నుంచి ఆంధ్ర ప్రీమియర్‌ లీగ్‌ క్రికెట్‌ టోర్నమెంట్స్‌ ప్రారంభం కానున్నాయి. స్టేడియంలో ఏర్పాట్లను జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ మంగళవారం పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. ఎస్పీ మాట్లాడుతూ పోటీల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. తొలి రోజు మ్యాచ్‌ తిలకించేందుకు ప్రముఖ సినీ నటుడు రామ్‌చరణ్‌, మంత్రి నారా లోకేష్‌, తదితరులు రానున్న నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా స్టేడియం కెపాసిటీ 26 వేలు ఉన్నప్పటికీ 10 వేల నుంచి 15 వేల మంది ప్రేక్షకులకు మాత్రమే అనుమతిస్తున్నట్లు తెలిపారు. క్యాపిటల్‌ అమరావతి, కాకినాడ కింగ్స్‌, విజయవాడ సన్‌ షైనర్స్‌, సింహాద్రి వైజాగ్‌ లయన్స్‌, భీమవరం, రాయలసీమ జట్లు పోటీలలో తలపడనున్నాయని ఆయన తెలిపారు.

తాడికొండ: రాజధాని అమరావతిలో కొనసాగుతున్న మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి టోఖన్‌ సాహు మంగళవారం పరిశీలించారు. అమరావతి పర్యటన సందర్భంగా రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ, ఏపీసీఆర్‌డీఏ అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా అమరావతి–రాయపూడిలోని ఏపీసీఆర్‌డీఏ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. సమావేశంలో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్‌ చైర్మన్‌ కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌.సురేష్‌ కుమార్‌ ఐఏఎస్‌, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కమిషనర్‌ – డైరెక్టర్‌ డాక్టర్‌ పి.సంపత్‌ కుమార్‌, ఏపీసీఆర్‌డీఏ కమిషనర్‌ వి.విజయరామరాజు, అదనపు కమిషనర్లు ఎ.భార్గవతేజ, అభిషేక్‌ కుమార్‌, ఏపీ టిడ్కో మేనేజింగ్‌ డైరెక్టర్‌ బి.సునీల్‌కుమార్‌రెడ్డి, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్‌ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ బి.అనిల్‌కుమార్‌రెడ్డితోపాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అమలవుతున్న స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం గురించి కేంద్ర మంత్రికి వివరించారు. కేంద్ర సహాయ మంత్రి టోఖన్‌ సాహు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని, గృహనిర్మాణం, పట్టణాభివృద్ధి, రాజధాని నిర్మాణ రంగాల్లో చేపడుతున్న కార్యక్రమాలు రాష్ట్ర అభివృద్ధికి మరింత ఊతమిస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఇంట్లో సామగ్రి, నగదు దగ్ధం

తాడేపల్లి రూరల్‌: ఓ అపార్ట్‌మెంట్‌లో గ్యాస్‌ సిలిండర్‌ లీక్‌ అయ్యి మంటలు వ్యాపించడంతో ఇంట్లో నగదు, సామగ్రి దగ్ధమైన ఘటన సోమవారం రాత్రి తాడేపల్లిలో చోటుచేసుకుంది. సేకరించిన వివరాలు.. తాడేపల్లి ఉండవల్లి సెంటర్‌ సమీపంలోని జామాయిల్‌తోటలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో గ్రౌండ్‌ ఫ్లోర్‌లో వాచ్‌మెన్‌ కుటుంబంతో ఉంటున్నాడు. సోమవారం రాత్రి అకస్మాత్తుగా గ్యాస్‌ సిలిండర్‌లో నుంచి మంటలు వ్యాపించాయి. వస్తున్న మంటలను అదుపుచేయలేక మంగళగిరి అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకునే సరికే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కొంతమేర వ్యాపిస్తున్న మంటలను అదుపుచేశారు. అగ్నిమాపక సిబ్బందికి బాధితులు ఇచ్చిన సమాచారం మేరకు ఇంట్లో సుమారు లక్షల రూపాయల నగదు, 8 గ్రాముల బంగారం ఉందని, వీటితో పాటు పిల్లలు చదువుకున్న సర్టిఫికేట్లు, ఆధార్‌ సంబంధిత కార్డులు అగ్నికి ఆహుతి అయ్యాయని తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement