కృష్ణలంక స్టేషన్‌లో సీసీ ఫుటేజీ మాయం | - | Sakshi
Sakshi News home page

కృష్ణలంక స్టేషన్‌లో సీసీ ఫుటేజీ మాయం

Jun 24 2026 1:35 AM | Updated on Jun 24 2026 1:35 AM

పవన్‌కళ్యాణ్‌ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం

దీని వెనుక పెద్దల హస్తం.. అందుకే అంతా గోప్యం సాయికృష్ణ కేసు సీబీఐకి అప్పగించాల్సిందే వైఎస్సార్‌ సీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర

సాక్షి, అమరావతి: గాదె సాయికృష్ణ కేసులో చంద్రబాబు ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం అనుసరిస్తున్న వైఖరి అత్యంత దారుణంగా ఉందని వైఎస్సార్‌ సీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర ఆక్షేపించారు. మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ కేసులో తొలి నుంచీ సాక్ష్యాధారాలను పక్కా ప్రణాళికతో మాయం చేస్తున్నారన్నారు. తాజాగా కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌లో సీసీ ఫుటేజీ మాయం కావడం దీనికి నిదర్శనమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్‌ వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు. బాధితులకు న్యాయం జరగాలంటే కేసును సీబీఐకి అప్పగించాల్సిందేనన్నారు. సాయికృష్ణ కేసు వెలుగులోకి వచ్చాక పోలీసు అధికారులు ఓ కానిస్టేబుల్‌ను భయపెట్టి కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజీని తొలగింపజేశారన్నారు. కృష్ణలంక పీఎస్‌ నుంచి స్వర్ణపురి వరకు దాదాపు 30కి పైగా హైరిజల్యూషన్‌ సీసీ కెమెరాలు ఉన్నాయని, వాటిలో ఎక్కడా ఫుటేజీ లభ్యం కాకపోవడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని చెప్పారు. సాయికృష్ణ కేసులో చట్టపరమైన కనీస నిబంధనల్ని కూడా పాటించలేదన్నారు. నిందితుడిని అరెస్ట్‌ చేసినప్పుడు ఉండాల్సిన అరెస్ట్‌ మెమో, అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లినప్పుడు చేయించిన మెడికల్‌ చెకప్‌ రిపోర్టులు గానీ, సీసీటీవీ ఫుటేజీల బ్యాకప్‌ ఏవీ లేకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు. ఒక వ్యక్తిని చంపేసి, కాల్చి బూడిద చేసిన తర్వాత సాక్ష్యాధారాలు లేకుండా కేసును క్లోజ్‌ చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ‘విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ ప్రమేయం లేకుండా, ఆయనకు సమాచారం తెలియకుండానే టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు మార్కాపురం వెళ్లి ఒక వ్యక్తిని అరెస్ట్‌ చేస్తారా? కేవలం సీఐ నాగరాజును మాత్రమే అరెస్ట్‌ చేసి చేతులు దులుపుకుంటే సరిపోదు. ఆ రోజు కృష్ణలంక స్టేషన్‌లో ఉన్న మొత్తం సిబ్బందిని నిందితులుగా చేర్చాలి. విజయవాడ సీపీ, రాష్ట్ర డీజీపీని కూడా ఈ కేసులో బాధ్యులను చేయాలి. వారందర్నీ దర్యాప్తు పరిధిలోకి తీసుకురావాలి’ అని డిమాండ్‌ చేశారు.

‘ఇంతటి దారుణమైన ఘటన జరిగినా సీఎం చంద్రబాబు, హోం మంత్రి అనిత, డీజీపీ ఎందుకు ప్రెస్‌మీట్‌ కూడా పెట్టలేదు. డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ ఓ సమావేశంలో మాట్లాడుతూ ఒక రౌడీషీటర్‌ విషయంలో స్పందించాలా అనడం ఆయన బాధ్యతా రాహిత్యానికి నిదర్శనం. చిత్తూరులో రాము అనే బీసీ వ్యక్తిపై దాడి జరిగినా, విజయనగరంలో కళావతి, కర్నూలు జిల్లాలో గంగమ్మ, శ్రీకాకుళంలో తిరుపతమ్మపై దాడి జరిగినా పవన్‌ ఇప్పటివరకు నోరు మెదపలేదు. ఎన్నికల ముందు సుగాలీ ప్రీతి కేసులో న్యాయం చేస్తానని హామీ ఇచ్చి గెలిచిన తర్వాత అది తన శాఖ పరిధిలో లేదని చెప్పడం అనైతికం. ఆ కేసులో గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో సాక్ష్యాధారాలన్నీ తారుమారు చేశారని చెప్పడం అత్యంత హేయం. అంతకంటే పచ్చి అబద్ధం, దిగజారుడుతనం మరొకటి ఉండదు. సుగాలి ప్రీతి ఘటన జరిగింది టీడీపీ ప్రభుత్వ హయాంలోనే. ఆ కేసులో సాక్ష్యాధారాలన్నీ మార్చేసింది కూడా ఆ ప్రభుత్వ హయాంలోనే. అప్పుడు చంద్రబాబు ప్రభుత్వానికి పవన్‌కళ్యాణ్‌ మద్దతు ఇచ్చారు. కళ్లెదుట ఇన్ని వాస్తవాలు ఉన్నా పవన్‌కళ్యాణ్‌ సీఎం చంద్రబాబు మాదిరిగానే నిస్సిగ్గుగా, నిర్లజ్జగా పచ్చి అబద్ధాలు చెబుతున్నారు’ అని నరేంద్ర మండిపడ్డారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement