108లో.. సమ్మె సైరన్..
సమ్మెబాటలో 108 ఉద్యోగులు ఇప్పటికే సంబంధిత అధికారులు, కాంట్రాక్ట్ కంపెనీకి సమ్మె నోటీసులు డిమాండ్లను పరిష్కరించకుంటే 12 అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి జిల్లా వ్యాప్తంగా ఆందోళనకు సిద్ధమైన ఉద్యోగులు
జీతం పెంచామంటూ జీవో.. కానీ సగం కోత..
ఈ నెల 12 వరకు ప్రభుత్వానికి డెడ్ లైన్
ప్రత్తిపాడు:ప్రభుత్వం మారడం..కాంట్రాక్టు సంస్థను మార్చడం.. రూ.4 వేలు జీతం పెంచామంటూ జీవో.. అందులో రూ. 2 వేలు కోత విధించడం.. అపాయింట్‌మెంట్ లెటర్‌లు ఇవ్వకపోవడం, ఉద్యోగులను ఉన్నపళంగా తొలగించడం ఇలా.. చెప్పుకుంటూ పోతే సమస్యల చిట్టా చాంతాడంత. సమస్యలు సానుకూలంగా పరిష్కరించాల్సిన చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోకపోవడం, కాంట్రాక్టు సంస్థ ఉద్యోగుల విషయంలో నిర్దయగా వ్యవహరిస్తుండటంతో గత్యంతరం లేక 108 ఉద్యోగులు డిమాండ్ల సాధనకు ఆందోళనబాట పట్టారు.
108 సిబ్బంది సమ్మె సైరన్ మోగించారు. తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకుంటే సమ్మెబాట పడతామని స్పష్టం చేశారు. ఈ నెల 12 వరకు ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించారు. అప్పటికి కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించకుంటే జిల్లా వ్యాప్తంగా అత్యవసర సేవలు నిలిపివేసి సమ్మె లోకి వెళ్లనున్నామని 108 ఉద్యోగులు అల్టిమేటం జారీచేశారు. ఈ మేరకు ఇప్పటికే సంబంధిత శాఖల జిల్లా ఉన్నతాధికారులతో పాటు కాంట్రాక్టు సంస్థకు కూడా సమ్మె నోటీసులను పలు దఫాలుగా అందజేశారు.
చంద్రబాబు ప్రభుత్వం గద్దెనెక్కిన నాటి నుంచి 108 ఉద్యోగులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. సంస్థను మార్చడం మొదలు పెంచామన్న జీతం జీవోకే పరిమితమవ్వడం, వైట్ యాప్రాన్ బదులు డ్రెస్ కోడ్ మార్చడం, ఆరునెలలుగా సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నా పట్టించుకోకపోవడంతో వారికి సమ్మె అనివార్యంగా మారింది. ఇటీవల ఒకసారి చర్చలు జరిగినప్పటికీ, అందులో ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో పరిష్కరించకుండా కాలయాపన చేస్తుండటంతో వారు మరోసారి సమ్మె బాట పట్టాలని నిర్ణయించారు.
108 వాహనాలు 22
పైలెట్లు 45
108 సిబ్బందికి రూ. 4 వేలు పెంచుతూ చంద్రబాబు ప్రభుత్వం జీవో 49ను పునరుద్ధరించింది. అయితే కాంట్రాక్టు సంస్థ ఉద్యోగులకు నాలుగు వేలు చెల్లించకుండా సగం కోత విధిస్తుంది. ఉద్యోగులకు రూ. 2 వేలు మాత్రమే చెల్లిస్తూ మిగిలిన రెండు వేలు సీటీసీ కింద మినహాయిస్తుందని ఉద్యోగులు వాపోతున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే వేటు వేస్తామని నిర్వహణ సంస్థ హెచ్చరిస్తుండటంతో సిబ్బందికి ఆందోళనే మార్గమైంది.
108లో.. సమ్మె సైరన్..
108లో.. సమ్మె సైరన్..


