ప్రతి దస్త్రం ఈ–ఆఫీస్ ద్వారానే జరగాలి
విద్యతో పేదరికాన్ని జయించవచ్చు
గుంటూరు వెస్ట్: ప్రతి దస్త్రం ఈ–ఆఫీస్ ద్వారానే నడవాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లోని వీడియో సమావేశమందిరంలో రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ శాఖపై ప్రజల సానుకూల దృక్పథం పెరగాలన్నారు. పీజీఆర్‌ఎస్‌ను పక్కాగా అమలు చేయాలని వెల్లడించారు. తప్పుడు ఎండార్స్‌మెంట్‌లు ఇవ్వకూడదన్నారు. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి నివేదికలు సమర్పించాలన్నారు. ఒకే అంశం పట్ల పలుమార్లు దస్త్రాలు తిప్పరాదని చెప్పారు. ప్రభుత్వం కొన్ని అధికారాలను తహసీల్దార్లకు బదలాయించిందని, వాటిని వినియోగించడంలో ప్రజలకు మేలు కలిగే విధంగా ఉండాలన్నారు. గృహ నిర్మాణాల వారీగా లే అవుట్ వివరాలు, ప్రస్తుతం ఉన్న లబ్ధిదారుల వివరాలపై నివేదిక సమర్పించాలని ఆదేశించారు. కారుణ్య నియామకాలు, పింఛన్ల పరిష్కారంలో ఎటువంటి జాప్యం లేకుండా చూడాలన్నారు. రెవెన్యూ అంశాలను పూర్తి నిర్ధారణతో పరిశీలించి పనిచేయాలని సూచించారు. ఓటరు జాబితా పునశ్చరణపై దృష్టి సారించాలన్నారు. ఆదివారం నాటికి పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రెవెన్యూ క్లినిక్‌ల ద్వారా రెవెన్యూ భూ సమస్యల పరిష్కారంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రెవెన్యూ రికార్డులు డిజిటలైజేషన్ కావాలన్నారు. ముందుగా రికార్డుల జాబితా తయారు చేయాలని పేర్కొన్నారు. పత్రాన్ని పక్కాగా స్కాన్ చేయడంతోపాటు పేజీల సంఖ్య తప్పిపోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ వివరించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, డీఆర్వో షేఖ్ ఖాజావలి, ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, జెడ్పీ సీఈఓ వి.జ్యోతిబసు, డెప్యూటీ కలెక్టర్లు లక్ష్మీకుమారి, శ్రీనివాస్, పార్థసారథి పాల్గొన్నారు.
కోడి పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు
కోడి పందేలు చట్ట రీత్యా నేరమని, వాటిలో పాల్గొంటే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా హెచ్చరించారు. జిల్లా సమన్వయ కమిటీ సమావేశం కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ కోడి పందేలు, ఎడ్ల పందేలు నిర్వహించే వారిపై జంతు హింస నిరోధక చట్టం ప్రకారం కఠిన చర్యలు తప్పవని అన్నారు. శనివారం అన్ని గ్రామాల్లో దండోరా వేయించాలని పేర్కొన్నారు. అన్ని గ్రామాల్లో పోస్టర్లు ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలని చెప్పారు. పందేలు నిర్వహించే వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలన్నారు. జంతు సంక్షేమ సంఘాల సలహాలు సూచనలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ఈనెల 14 నుంచి 31వ తేదీ వరకు జంతు సంక్షేమ పక్షోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పక్షోత్సవాల పోస్టర్‌ను కలెక్టర్ విడుదల చేశారు.
విద్యతో పేదరికాన్ని సులభంగా జయించవచ్చని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా విద్యార్థులకు తెలిపారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ వసతి గృహాల నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రేరణ కల్పించే ‘విజయం మనదే‘ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ విద్యార్థులతో ముచ్చటించారు. ప్రతి ఒక్కరూ స్టేట్ టాపర్ కావాలన్నారు. విజయం మనదే స్టడీ మెటీరియల్‌ను, విద్యా జ్యోతి గైడ్‌ను విద్యార్థులకు జిల్లా కలెక్టర్ పంపిణీ చేశారు.


