ఉద్యాన, పట్టు పరిశ్రమలతో రైతులకు సుస్థిర ఆదాయం
●ఏపీ వ్యవసాయ కమిషనరేట్, ఉద్యాన, పట్టు పరిశ్రమ డైరెక్టర్
డాక్టర్ కె.శ్రీనివాసులు
●విజ్ఞాన్ లో ఘనంగా
సంక్రాంతి సంబరాలు
చేబ్రోలు: సంప్రదాయ పంటలతోపాటు ఉద్యాన పట్టు పరిశ్రమల సాగును చేపట్టడం ద్వారానే రైతులకు ఏడాది పొడవునా సుస్థిర ఆదాయం లభిస్తుందని ఏపీ వ్యవసాయ కమిషనరేట్, ఉద్యాన, పట్టు పరిశ్రమ డైరెక్టర్ డాక్టర్ కె.శ్రీనివాసులు (ఐఏఎస్) అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫుడ్ టెక్నాలజీ విభాగం, రైతు నేస్తం ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో రైతుశ్రేయస్సే కేంద్రంగా సంక్రాంతి సంబరాలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఏపీ వ్యవసాయ కమిషనరేట్, ఉద్యాన, పట్టు పరిశ్రమ డైరెక్టర్ డాక్టర్ కె.శ్రీనివాసులు మాట్లాడుతూ మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు తక్కువ నీటితో ఎక్కువ ఆదాయాన్ని ఇచ్చే మామిడి, జామ, అరటి వంటి పండ్ల తోటల సాగుపై దృష్టి సారించాలని కోరారు. రైతు ఆదాయం రెండింతలు చేయడం లక్ష్యంగా స్కిల్ డెవలప్‌మెంట్, రైతు క్లబ్బులు, రైతు సమాఖ్యల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిరంతరంగా నిర్వహిస్తున్నామన్నారు. ఏపీ అటవీ శాఖ ప్రభుత్వ సలహాదారు ఎం.మల్లికార్జునరావు మాట్లాడుతూ సామాజిక అడవుల పెంపకంతో రైతులకు అదనపు ఆదాయం చేకూరుతుందన్నారు. విజ్ఞాన్ యూనివర్సిటీ వైస్ చైర్మన్ లావు శ్రీకష్ణదేవరాయలు మాట్లాడుతూ విద్యార్థులే ఈ దేశ భవిష్యత్ ఆస్తి, జ్ఞానం, నైపుణ్యం, నైతిక విలువలతో ముందుకు వచ్చిన యువత భారత్‌ను మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దగలరని ఆశాభావం వ్యక్తం చేశారు. విజ్ఞాన్ యూనివర్సిటీ చాన్స్‌లర్ డాక్టర్ పావులూరి సుబ్బారావు మాట్లాడుతూ భారతీయ ఆర్థిక వ్యవస్థకు మూలాధారమైన వ్యవసాయ రంగం, ఆధునిక సాంకేతికతతో జోడించబడినప్పుడే రైతు ఇంట నిజమైన సంక్రాంతి వస్తుందని చెప్పారు. కార్యక్రమంలో సంప్రదాయ హరిదాసు, కొలాటాలు, గంగిరెద్దుల ఆటలు, సాంస్కతిక నత్యాలతో సంక్రాంతి పండుగ సందడిని విద్యార్థులు, పాల్గొన్న అతిథులు ఆనందంగా ఆస్వాదించారు. రైతులకు ప్రత్యేక సన్మానాలు నిర్వహించి, పంటల ప్రదర్శనలు, వరి, సిరిధాన్యాలు, అపరాలు, నూనెగింజలు, పత్తి, వాణిజ్య పంటలు, మిరప, ఆయిల్ ఫామ్, కూరగాయలు, పండ్లు, అగ్రో ఫారెస్ట్రీ, పశుపోషణ కోళ్ల పెంపకం, మత్య్సోత్పత్తి వంటి 12 పంటలపైన వ్యవసాయ సాంకేతిక అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించారు. సుమారు 250 మంది రైతులు పాల్గొన్నారు. కార్యక్రమంలో డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ చానన్స్‌లర్ డాక్టర్ కె.ధనుంజయరావు, ఐసీఏఆర్ డైరెక్టర్, ఉపకులపతి డాక్టర్ సీహెచ్ శ్రీనివాసరావు, వైస్ చాన్స్‌లర్ పి. నాగభూషణ్, వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ పీఎంవీ రావు, రైతు నేస్తం ఫౌండేషన్ చైర్మన్ యడ్లపల్లి వెంకటేశ్వర రావు, ఐసీఏఆర్–ఐఐఎమ్‌ఆర్ డైరెక్టర్ డా.తార సత్యవతి, ఐసీఏఆర్–ఎన్‌ఐఆర్‌సీఏ(రాజమండ్రి) డైరెక్టర్ డాక్టర్ ఎం. శేషు మాధవ్ ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, రైతులు, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.


