అమరావతిని ప్రజల రాజధాని అంటే బాగుండేది
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చింతా మోహన్
లక్ష్మీపురం: చంద్రబాబు తెలుగు మహాసభల్లో అమరావతి దేవతల రాజధాని అని అనడం విడ్డూరంగా ఉందని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌పార్టీ సీనియర్ నాయకుడు చింతా మోహన్ అన్నారు. గుంటూరులో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా పర్యటిస్తున్న నాకు మనుషులు, వాళ్ల కష్టాలు కనబడుతున్నాయే తప్ప, ఎక్కడ దేవతలు కనబడడం లేదన్నారు. ఎక్కడైనా రాజధాని నిర్మాణానికి వెయ్యి ఎకరాలు చాలని, అమరావతి రాజధాని నిర్మాణానికి లక్ష ఎకరాలు అవసరం లేదన్నారు. రాష్ట్రంలో 80 శాతం మంది ప్రజలు అమరావతి రాజధానిని కోరుకోవడం లేదన్నారు. రాజధాని ప్రాంతంలో రైతులు సంతోషంగా లేరన్నారు. మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం పేరు మార్చడం దుర్మార్గమని విమర్శించారు. దివంగత సీపీఎం నేత హరికిషన్ సింగ్ సూర్జిత్ హృదయంలో నుంచి ఉపాధి హామీ చట్టం పుట్టిందని, దేశ స్వాతంత్య్రం కోసం, అంటరానితనానికి వ్యతిరేకంగా మహాత్మాగాంధీ ఎన్నో పోరాటాలు చేశారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. దేశంలో జ్యుడీషియల్ వ్యవస్థ బలహీన పడుతోందని చెప్పారు. కోర్టులలో ఆర్థికపరమైన అంశాలు, టెండర్లు, కాంట్రాక్టులు వంటి తగాదాలపై మాత్రమే కేసులు జరుగుతున్నాయని తెలిపారు. సామాజిక న్యాయంపై ఏమాత్రం విచారణ జరగడం లేదని చెప్పారు. సమావేశంలో దళిత నాయకుడు అన్నవరపు కిషోర్ పాల్గొన్నారు.
గుంటూరు మెడికల్: జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జటోతు హుస్సేన్ నాయక్ గురువారం గుంటూరు మెడికల్ కళాశాలను సందర్శించారు. మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.వి.సుందరాచారి జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యునికి పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. కళాశాల సిబ్బందిని పరిచయం చేశారు. గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణతో మాట్లాడి ఆసుపత్రిలో ఏఏ సౌకర్యాలు వున్నాయి, ఇంకా ఏమైనా సౌకర్యాలు అవసరం అని అడిగి తెలుసుకున్నారు. జీజీహెచ్‌లో ట్రాన్స్‌ప్లాంట్ థియేటర్, స్టాఫ్‌ని నియమించాలని సూపరింటెండెంట్ కమిషన్ సభ్యుని దృష్టికి తీసుకువచ్చారు. మెడికల్ కాలేజీ, పీహెచ్‌సీలు, స్కూళ్లు, హాస్టల్ సందర్శించి అవసరమైన సౌకర్యాలను తెలుసుకుని ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుందని కమిషన్ సభ్యులు తెలిపారు. అనంతరం మెడికల్ కళాశాల విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడారు. ఎస్టీ కమిషన్ – సమస్యలు, రోస్టర్ పాయింట్ సమస్యలు, స్కూల్స్, కాలేజీలలో ఏమైనా సమస్యలు వుంటే ఎస్టీ కమిషన్‌కు తెలియజేయాలన్నారు. షెడ్యుల్ జాతులకు న్యాయం జరుగకపోతే ఇరు పార్టీలను పిలిచి సమస్యను పరిష్కరిస్తామన్నారు. కోర్టులలో సత్వర న్యాయం జరగడం లేదని, కమిషన్‌ను ఆశ్రయిస్తున్నారన్నారు. సమాజం కోసం కమిషన్ పని చేస్తుందని, ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలన్నారు. అనంతరం విద్యార్థులు, ఎస్టీ సంఘ నాయకుల నుంచి వినతులను స్వీకరించారు. కార్యక్రమంలో మెడికల్ కళాశాల వైస్ ప్రిన్సిపాళ్లు డాక్టర్ మాధవి, డాక్టర్ శ్రీధర్, కళాశాల ఉద్యోగులు, విద్యార్థులు, ఎస్టీ సంఘ నాయకులు పాల్గొన్నారు.


