అవుట్ సోర్సింగ్ నియామకాల్లో ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం
నెహ్రూనగర్: రాయలసీమ థర్మల్ ప్లాంట్‌లో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు సంబంధించిన సమస్యలను పరిష్కారించాలని మాలమాహానాడు జాతీయ అధ్యక్షుడు గోళ్ల అరుణ్‌కుమార్ కోరారు. ఈ మేరకు గురువారం సచివాలయంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ థర్మల్ ప్లాంట్‌లో ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన అవుట్ సోర్సింగ్ నియామకాల్లో అన్యాయం జరగుతుందని వివరించారు. థర్మల్ ప్లాంట్‌లో పనిచేసే ఓ ముఖ్య అధికారి బీసీ వ్యక్తులను ఎస్సీ, ఎస్టీలుగా చిత్రీకరించి వారి పేర్లు జాబితాలో చేర్చారన్నారు. దీనిపై స్పందించి ఆ అధికారి పెట్టిన ఫైల్‌ను రిజెక్ట్ చేసి నిజమైన ఎస్సీ, ఎస్టీలకు న్యాయం చేయాలని కోరారు.
తాడికొండ: తుళ్లూరు మండలం పెదపరిమి గ్రామంలో కోడిపందేల స్థావారాలపై టాస్క్‌ఫోర్స్ బృందం మెరుపు దాడులు నిర్వహించింది. మధ్యాహ్నం సుమారు 2.30 గంటల సమయంలో పెదపరిమి శివారులోని పత్తి పొలాల్లో ఆర్గనైజింగ్ కోడిపందేలు జరుగుతున్నాయని టాస్క్‌ఫోర్స్ సిబ్బందికి వచ్చిన సమాచారం మేరకు ఎస్‌బీ సీఐ –1కు ఆదేశాల మేరకు తుళ్లూరు పోలీసుస్టేషన్ ఎస్సై కలగయ్య, సిబ్బందితో కలిసి టాస్క్‌ఫోర్స్ పోలీసులు కోడిపందేల స్థావారాలపై దాడులు నిర్వహించారు. ఏడుగురు పందెం రాయుళ్లను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి ఒక కోడి, రూ.1,22,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. తొమ్మిది సెల్‌ఫోన్లు, ఆరు ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు.
తాడికొండ: రాజధాని అమరావతిలో సీడ్ యాక్సిస్ రహదారి నిర్మాణానికిగాను 12.5758 ఎకరాల భూమి సేకరించేందుకు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా గురువారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఉండవల్లిలో 10.5018 ఎకరాలు, పెనుమాకలో 0.6500 ఎకరాలు, మందడం–1లో 0.7000 ఎకరాలు, రాయపూడి–1లో 0.4710 ఎకరాలు, రాయపూడి–2 – 0.2530 ఎకరాల సేకరించనున్నారు. సంబంధిత రైతులు, భూ యజమానులు అమరావతి సీడ్ యాక్సిస్ రహదారి నిర్మాణం నిమిత్తం ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చేందుకు సిద్ధమైతే తమ గ్రామంలోని కాంపిటెంట్ అథారిటీ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.


