గుంటూరు చేరుకున్న ‘జన చైతన్య యాత్ర ’
కొరిటెపాడు(గుంటూరు): ఏపీ – తెలంగాణ బ్యాంక్ ఉద్యోగుల సమాఖ్య (ఏపీఅండ్‌టీబీఈఎఫ్) ఆధ్వర్యంలో ప్రజా రంగ బ్యాంకుల పరిరక్షణ, సామాన్య ప్రజల ప్రయోజనాల పరిరక్షణ లక్ష్యంగా చేపట్టిన ‘జన చైతన్య యాత్ర – సైకిల్ రైడ్’ విజయవంతంగా కొనసాగుతోంది. విశాఖపట్నం నుంచి తిరుపతి వరకు సుమారు 850 కిలోమీటర్లు, జిల్లా నుంచి జిల్లా, ప్రజల మధ్యకు వెళ్లేలా రామరాజు నిర్వహిస్తున్న సైకిల్ రైడ్ యాత్ర గుంటూరు చేరుకుంది. మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటలకు గుంటూరు ఏటుకూరు రోడ్డు వద్ద ఆంజనేయస్వామి విగ్రహం వద్దకు యాత్ర చేరుకుంది. అక్కడ నుంచి గుంటూరులో అన్ని బ్యాంకుల ఉద్యోగులు ప్రధానవీధుల గుండా ర్యాలీ నిర్వహించి జీటీ రోడ్‌లోని యూనియన్ బ్యాంకు రీజినల్ ఆఫీసు వద్ద సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా బ్యాంక్ ఎంప్లాయీస్ కో–ఆర్డినేషన్ కమిటీ నాయకులు రామకృష్ణ, వేణుబాబు, రవిచంద్రారెడ్డి, పృథ్వీ, మురళీ షరీఫ్, పావని క్రాంతి, అఖిల, పి.కిషోర్ కుమార్ తదితర నాయకులు మాట్లాడుతూ ప్రజారంగ బ్యాంకులను బలహీనపరచే విధానాలకు వ్యతిరేకంగా, బ్యాంకింగ్ సేవలు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలా ఈ ఉద్యమం కొనసాగుతుందని తెలిపారు. ఈ యాత్రకు ప్రజలు, ఉద్యోగుల నుంచి లభిస్తున్న విశేష స్పందన ఉద్యమానికి మరింత బలం చేకూరుస్తోందని పేర్కొన్నారు. బ్యాంకులు ప్రభుత్వ రంగంలోనే ఉండాలని, ప్రజలను చైతన్యపరుస్తూ బ్యాంకులను కాపాడు కోవాలని తెలిపారు. ఈ సైకిల్ యాత్రను కొనసాగిస్తూ రామరాజు చిలకలూరిపేట మీదుగా ఒంగోలు వెళ్లారు.
సచివాలయాల్లో ఈ–గవర్నెన్స్ అమలు
జడ్పీ చైర్‌పర్సన్ హెనీక్రిస్టినా
నగరంపాలెం (గుంటూరు వెస్ట్): గ్రామీణ ప్రాంతాల్లోని సచివాలయాలు, గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ఈ – గవర్నెన్స్ అప్లికేషన్స్ అమలు చేయాలని గుంటూరు జడ్పీ చైర్‌పర్సన్ హెనీక్రిస్టినా అన్నారు. జిల్లాపరిషత్ (జడ్పీ) ఆవరణలోని హాల్‌లో మంగళవారం పంచాయతీరాజ్ డిప్యూటీ ఎంపీడీఓలు, పరిపాలనాధి కారులు (ఏఓ), సీనియర్/ జూనియర్ సహాయకులు (ఎస్‌ఏ/జేఏ), పంచాయతీ అభివృద్ధి అధికారుల (పీడీఓ)కు ఈ–గవర్నెన్స్‌పై ఒక్కరోజు శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతిఒక్కరూ ఈ–ఆఫీస్, పీఆర్–ఒన్, ఈ–క్రాప్, వాట్సాప్ యాప్ గవర్నర్స్ తదితర అంశాలపై పూర్తిస్థాయిలో శిక్షణ పొందాలని అన్నారు. గ్రామీణ ప్రాంతం నుంచి జిల్లా స్థాయిలోని ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఈనెల ఒకట్నుంచి ఈ–ఆఫీస్ ద్వారా ఫైల్స్‌ను నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ క్రమంలో దీనిపై తర్ఫీదు పొందేందుకు శిక్షణ నిర్వహించినట్లు తెలిపారు. డీపీఆర్‌సీ ఏఓ ప్రతాప్‌కుమార్, జడ్పీపీ ఏఓ శామ్యూల్, డీటీఎం కె.నాగేశ్వరరావు, రిసోర్స్ పర్సన్స్ కె.శ్రీనివాసరావు, కె.అనురాధ, డి.రవీంద్రబాబు పాల్గొన్నారు.
శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంచుకోవాలి
తాడేపల్లి రూరల్: క్రీడల ద్వారా యువత శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని ఐఎఫ్‌ఎస్ అధికారిణి భరణి వ్యాఖ్యానించారు. మంగళవారం తాడేపల్లి రూరల్, వడ్డేశ్వరంలో మూడు రోజులుగా జరుగుతున్న సౌత్‌జోన్ ఇంటర్ యూని వర్శిటీ టోర్నమెంట్–2026 ముగింపు వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా భరణి ప్రసంగిస్తూ క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో కూడా సత్తా చాటాలని కోరారు. రానున్న కాలంలో కేఎల్‌యూ వేదికగా జాతీయ అంతర్జాతీయ క్రీడలు జరుగుతాయని తెలిపారు. కేఎల్‌యూ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ జి.పార్ధసారధి వర్మ మాట్లాడుతూ కర్నాటకకు చెందిన జైన్ యూనివర్శిటీ ప్రథమ స్థానంలో, కేఎల్‌యూ ద్వితీయ స్థానం, చైన్నె ఎస్‌ఆర్‌ఎం యూనివర్శిటీ జట్టు తృతీయ, కేరళ కాలికట్ యూనివర్శిటీ నాల్గవ స్థానంలో నిలిచాయని పేర్కొన్నారు. అనంతరం పరిశ్రమల అథారిటీ మేనేజింగ్ డైరెక్టర్ శివజ్యోతి, ఐఎఫ్‌ఎస్ అధికారిణి భరణి విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ఆలిండియా యూనివర్సిటీల పరిశీలకులు మనోజ్‌కుమార్, వర్శిటీ ప్రో వీసీలు డాక్టర్ ఏవీఎస్ ప్రసాద్, డాక్టర్ ఎన్.వెంకట్‌రామ్, డాక్టర్ కె.రాజశేఖరరావు, రిజిస్ట్రార్ డాక్టర్ కె.సుబ్బారావు, క్రీడల డైరెక్టర్ డాక్టర్ కె.హరికిషోర్, విద్యార్థి సంక్షేమ విభాగం ఇన్‌చార్జి డీన్ డాక్టర్ కేఆర్‌ఎస్ ప్రసాద్, సలహాదారు డాక్టర్ హబీబుల్లా ఖాన్, వ్యాయామ అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.


