నేటి నుంచి 134వ ఉరుసు మహోత్సవం
నగరంపాలెం: నగరంపాలెంలో శ్రీహాజరత్ కాలే మస్తాన్ షా ఆవులియా 134వ ఉరుసు మహోత్సవాన్ని మంగళవారం నుంచి నిర్వహిస్తున్నట్లు ధర్మకర్త రావి రామ్మోహరావు తెలిపారు. సోమవారం సాయంత్రం నగరంపాలెంలో 134వ ఉరుసు మహోత్సవ బ్రోచర్‌ను ఆయన విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ ఆరో తేది నుంచి పదో తేదీ వరకు ఈ మహోత్సవాలు కొనసాగుతాయని చెప్పారు. మంగళవారం తెల్లవారుజామున బాబా సమాధిపై చాందిని అలంకరణ, గంధ మహోత్సవం, రాత్రి సందల్ (గంధం) ఊరేగింపు ఉంటుందని అన్నారు. ఏడో తేదీ సాయంత్రం గంధం పంపిణీ, దీపారాధన, ఎనిమిదో తేదీన పురాణ పఠనం, తొమ్మిదిన బాబా వస్త్రాలను పంచడం, బాబా కుర్చీ యథాస్థానంలో ఉంచడమని పేర్కొన్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి ఈ మహోత్సవానికి వచ్చే బాబా భక్తులకు ఎటువంటి ఇబ్బందుల్లేకుండా కనీస మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు. ప్రతిరోజు భక్తులకు అన్న సంతర్పణ ఉంటుందని చెప్పారు. బాబా గంధం, ఊరేగింపుల కార్యక్రమాల్లో భక్తులు పాల్గొనాలని అన్నారు.


