తుళ్లూరులో టవర్ ఎక్కి యువకుడు హల్‌చల్
బెట్టింగ్ యాప్‌ల వల్ల అప్పుల పాలయ్యానని.. ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరింపులు కిందకి దింపిన పోలీసులు.. నెల్లూరు జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తింపు
తాడికొండ: గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మల్కాపురం జంక్షన్‌లో సోమవారం రాంబాబు అనే యువకుడు ఓ విద్యుత్ టవర్‌పైకి ఎక్కి హల్‌చల్ చేశాడు. స్థానికులు అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతని వివరాలు ఆరా తీశారు.. తాను బెట్టింగ్ యాప్‌ల వలన అప్పుల పాలయ్యానంటూ వాపోయాడు. ఆత్మహత్య చేసుకునేందుకే టవర్ ఎక్కానని చెప్పగా.. పోలీసులు అతనితో సానుకూలంగా మాట్లాడి టవర్ నుంచి కిందకు దింపారు. పోలీసు విచారణలో యువకుడిది నెల్లూరు జిల్లాగా గుర్తించారు. బెట్టింగ్ యాప్‌లో ఆట ఆడటం వలన రూ.80 లక్షలు నష్టపోయానని, ఇంకా రూ.60 లక్షలు అప్పు ఉందని యువకుడు పోలీసులకు తెలిపాడు. సినీహీరోలు బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేయడం వలననే తాను బెట్టింగ్‌లో డబ్బులు పెట్టానన్నారు. అప్పులు తీర్చడం కోసం తాను కిడ్నీ అమ్ముకోవడానికి హైదరాబాద్ వెళ్లానని, రూ.4 లక్షలు మాత్రమే ఇస్తానన్నారని, సంక్రాంతి పండుగ వస్తుందని, అప్పుల వాళ్లు తనను ఇబ్బంది పెడుతున్నారని, తనకు రూ.10 లక్షలు కావాలన్నాడు. కిడ్నీ అమ్ముకునేందుకు అనుమతి కోసం 5 రోజుల నుంచి హైకోర్టు చుట్టూ తిరుగుతుంటే తనను లోపలికి వెళ్లనివ్వలేదని, లాయర్లు ఐపీ పెట్టమని సలహా ఇస్తే తాను అలా చేయలేనన్నారు. రాంబాబును పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
మంగళగిరి టౌన్ : అమెరికాలో ఎంసీఏఏ ఆధ్వర్యాన జాతీయ స్థాయిలో జరిగే ఆ దేశ వాలీబాల్ పోటీల్లో పాల్గొనే టీమ్‌కు మంగళగిరి క్రీడాకారుడు ఎంపికయ్యాడు. స్ధానిక వివిధ పార్టీల నాయకులు క్రీడాకారుడు ఈశ్వర్‌ను సోమవారం శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా పలువురుమాట్లాడుతూ జనవరి నుంచి మే వరకు అమెరికాలో జరిగే ఆ దేశ వాలీబాల్ పోటీల్లో మంగళగిరి మండలం పెదవడ్లపూడికి చెందిన పొండుగల ఈశ్వర్ ఎంపిక కావడం హర్షించదగ్గ విషయమన్నారు. ఈశ్వర్ అమెరికాలో పుట్టి పెరిగి అక్కడే విద్యను అభ్యసిస్తూ, ఆ దేశంలో జరిగే వాలీబాల్ పోటీలకు పెప్పర్ డైన్ విశ్వవిద్యాలయం నుంచి ఎంపికయ్యాడని తెలిపారు. ఫిబ్రవరి 12న జరిగే పోటీలలో ఈశ్వర్ టీమ్ తలపడనుందని, గ్రామానికే కాక రాష్ట్రానికి దేశానికి గర్వకారణమని అన్నారు. భవిష్యత్తులో ఈశ్వర్ క్రీడల్లో మరింతగా రాణించాలని ఆకాంక్షించారు. అభినందించిన వారిలో స్థానికులు వెంకటేశ్వరరావు, శివరామయ్య, నంద కిషోర్, బ్రహ్మం, అన్నె చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు.
తుళ్లూరులో టవర్ ఎక్కి యువకుడు హల్‌చల్


