కౌండిన్య ఎడ్యుకేషన్ సేవలు ప్రశంసనీయం
కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ రెండు తెలుగు రాష్ట్రాల్లో 459 మంది పేద విద్యార్థులకు రూ. 19 లక్షలు ఉపకార వేతన ప్రదానం ఘనంగా 20వ ఉపకార వేతన ప్రదానోత్సవం
పెదకాకాని: ప్రతిభ కలిగిన విద్యార్థులను ప్రోత్సహించడంతోపాటు పోటీ పరీక్షలకు తీర్చిదిద్దుతున్న కౌండిన్య అకాడమీ సేవలు ప్రశంసనీయమని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్‌శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. పెదకాకాని మండలం వెనిగండ్ల కౌండిన్యపురంలో ఆదివారం రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యనభ్యసిస్తున్న 459 మంది విద్యార్థులకు 20వ ఉపకార వేతన(ఉత్తమ పురస్కారాలు) ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు. కౌండిన్య ఎడ్యుకేషనల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఎడ్యుకేషనల్ ట్రస్టు ఫౌండర్, గౌడ జన సేవా సమితి చైర్మన్ డాక్టర్ ఈవీ నారాయణ అధ్యక్షత వహించారు. పెమ్మసాని మాట్లాడుతూ సమాజంలో ఆర్థిక అసమానతలు రూపుమాపడం విద్య ద్వారానే సాధ్యమని భావించి సేవా దృక్పథంతో పనిచేస్తున్న ట్రస్టు నిర్వాహకులను కొనియాడారు. మతాలకు, కులాలకు, ప్రాంతాలకతీతంగా పనిచేస్తున్న ట్రస్టుకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. రాజ్యసభ సభ్యుడు పాకా వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ కార్పొరేట్ స్కూల్‌లో చదివిన విద్యార్థితో ప్రభుత్వ పాఠశాల విద్యార్థి పోటీ పడలేకపోతున్నాడన్నారు. చదువులో ప్రతిభ కనపరుస్తున్న పేద విద్యార్థులను ఎంపిక చేసి ఉపకార వేతనాలు ఇవ్వడం, అలానే నిరుద్యోగులను పోటీ పరీక్షలకు తీర్చిదిద్దుతున్న కౌండిన్య అకాడమీ సేవలను కొనియాడారు. ఎడ్యుకేషనల్ ట్రస్టు ఫౌండర్, గౌడ జన సేవా సమితి చైర్మన్ డాక్టర్ ఈవి నారాయణ ట్రస్టు స్థాపన, ఉపకార వేతనాల పంపిణీ, నిరుద్యోగులను పోటీ పరీక్షలకు తీర్చిదిద్దుతున్న తీరును వివరించారు. ఎమ్మెల్యేలు కన్నా లక్ష్మీనారాయణ, ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌లు ట్రస్టు సేవలను కొనియాడారు. ఉత్తరాఖండ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ సెక్రటరీ అద్దంకి శ్రీధర్‌బాబు, సిక్కిం విశ్రాంత డీజీపీ అత్తిలి సుధాకర్‌లు హాజరు కాగా ప్రత్యేక అతిథిగా కళారత్న అవార్డు గ్రహీత బొర్రా గోవర్ధన్‌లు హాజరయ్యారు. అనంతరం అతిథుల చేతుల మీదుగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 459 మంది విద్యార్థులకు రూ.19 లక్షలు ఉపకార వేతనాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పామర్తి సాంబశివరావు, వాకా రాంగోపాల్‌గౌడ్, బొబ్బిళ్ల వెంకటేశ్వరరావు, కారంకి లక్ష్మీనారాయణ, బెల్లంకొండ సదాశివరావు, డాక్టర్ సేవాకుమార్, జల్లెడ శ్రీనివాసరావు, వీరంకి రంగారావు, వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, పీఠా సుబ్బరామయ్య, డాక్టర్ కృష్ణ, పలువురు విరాళ దాతలు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.


