డబ్బుల కోసం బాలుడి ఒత్తిడి
విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
తెనాలి రూరల్: కొత్త సంవత్సరం వేడుకలకు డబ్బులివ్వాలని బాలికపై బాలుడు ఒత్తిడి తీసుకురావడంతో ఎలుకల మందు తిని ఆమె ఆత్మహత్యాయత్నం చేసింది. పోలీసుల కథనం మేరకు... గుంటూరు జిల్లా తెనాలి పట్టణానికి చెందిన బాలిక తొమ్మిదో తరగతి చదువుతోంది. అదే పాఠశాలలో పదో తరగతి చదువుతున్న బాలుడితో ఇన్‌స్ట్రాగామ్‌లో పరిచయమైంది. బాలుడి ఖర్చులకు అప్పుడప్పుడు విద్యార్థిని డబ్బులు ఇస్తుండేది. ఈ క్రమంలో గత నెల 31వ తేదీన తనకు రూ. రెండున్నర వేలు కావాలంటూ బాలుడు ఒత్తిడి తీసుకువచ్చాడు. తన వద్ద లేవని, రూ. వెయ్యి ఇవ్వగలనని బాలిక చెప్పింది. తాను చదువు మానేస్తానని, టీసీ తీసుకుని వెళ్లిపోతానంటూ బాలుడు ఒత్తిడి చేశాడు. దీంతో బాలిక ఎలుకల మందు తిని ఈ విషయాన్ని ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేసింది. గమనించిన కుటుంబసభ్యులు వైద్యశాలకు తరలించారు. వైద్యశాల నుంచి వచ్చిన సమాచారం మేరకు త్రీ టౌన్ పోలీసులు శనివారం పోక్సో కేసు నమోదు చేశారు.
చిలకలూరిపేటటౌన్: భార్యపై అనుమానంతో రోకలి బండతో దాడి చేసి, ఆమె మరణానికి కారణమైన నిందితుడిని చిలకలూరిపేట రూరల్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఈమేరకు చిలకలూరిపేట రూరల్ సీఐ కార్యాలయంలో మీడియా ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రూరల్ సీఐ బి.సుబ్బానాయుడు వివరాలు వెల్లడించారు.. వేలూరు గ్రామానికి చెందిన అల్లడి సల్మాన్‌రాజు తన భార్య పుష్పపై అనుమానం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో గత నెల 29వ తేదీ అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న ఆమె తలపై రోకలి బండతో దాడి చేశాడు. తీవ్ర రక్తగాయాలతో ఆస్పత్రి పాలైన పుష్ప చికిత్స పొందుతూ డిసెంబర్ 30వ తేదీన మృతి చెందింది. మృతురాలి తల్లి మంచాల సారమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు శనివారం అరెస్టు చేసి కోర్టు హాజరుపరచగా రిమాండ్ విధించారు. ప్రెస్‌మీట్‌లో రూరల్ ఎస్‌ఐ జి.అనిల్‌కుమార్, లేఖా ప్రియాంక సిబ్బంది పాల్గొన్నారు.


