ఐదుగురికి జైలు శిక్ష
గుంటూరు లీగల్: నగరంలో గత ఏడాది డిసెంబరు 31న ఈస్ట్, వెస్ట్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. డ్రైవ్‌లో 15 మంది మద్యం తాగినట్లు నిర్ధారించారు. వీరిలో పదిమందికి జరిమానా విధించి, మిగిలిన ఐదుగురికి జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. వీరిలో కారు డ్రైవర్లు నలుగురు, బైక్ నడుపుతున్న ఒకరు ఉన్నారు. వీరు అధికంగా మద్యం తాగినట్లు ఉండటంతో కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు. ఆరో అదనవు జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి మహమ్మద్ గౌస్ విచారణ తర్వాత ఐదుగురికి వారం రోజులు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు.
విద్యుత్ విజిలెన్స్ ఎస్‌ఈ మూర్తి
కొరిటెపడు(గుంటూరు): సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (సీపీడీసీఎల్) పరిధిలో విద్యుత్ చౌర్యం అరికట్టేందుకు ప్రజలను చైతన్య పరిచాలని విద్యుత్ విజిలెన్స్ పర్యవేక్షక ఇంజినీర్ కేవీఎల్‌ఎన్ మూర్తి సూచించారు. స్థానిక సంగడిగుంట విద్యుత్ భవన్‌లో విజిలెన్స్ ఇంజినీరింగ్ అధికారులతో శనివారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మూర్తి మాట్లాడుతూ విద్యుత్ చౌర్యం చట్టరీత్యా నేరమన్నారు. గత ఏడాది 9,064 కేసులు నమోదు చేసి రూ.21.45 కోట్లు అపరాధ రుసుము విధించామని చెప్పారు. విద్యుత్ చౌర్యం అరికట్టడానికి గుంటూరు జిల్లా ఈఈ కరీమ్–94408 12263, పల్నాడు జిల్లా ఈఈ సుందరబాబు – 94910 66757, బాపట్ల జిల్లా ఈఈ భాస్కరరావు – 77804 56319లను సంప్రదించాలని సూచించారు. సమాచారం ఇచ్చిన వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచుతామని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదాయానికి చౌర్యం వల్ల గండిపడకుండా చూడాలని కోరారు.


