
మద్యం మత్తులో వివాదం.. యువకుడికి కత్తిపోట్లు
లక్ష్మీపురం: మద్యం మత్తులో స్నేహితుల మధ్య వాగ్వివాదం కత్తిపోట్లకు దారితీసిన ఘటన మంగళవారం అరండల్‌పేట 8వ లైన్‌లో చోటు చేసుకుంది. అరండల్‌పేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కోబాల్డ్‌పేట 4వ లైన్ ప్రాంతానికి చెందిన షేక్ అబ్దుల్ రహ్మన్ అలియాస్ అబ్బులు అనే యువకుడు స్థానికంగా చికెన్ షాపులో పని చేస్తుంటాడు. మంగళవారం అబ్బులు తన స్నేహితుడైన కృష్ణతో కలిసి అరండల్‌పేట 8వలైన్‌లోని మయూరి బార్ అండ్ రెస్టారెంట్‌లో మద్యం తాగేందుకు వెళ్లారు. ఈక్రమంలో శ్రీనగర్‌కు చెందిన మాలిక్ అనే వ్యక్తికి అబ్బులు ఫోన్ చేయగా, ఫోన్‌లో ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. దీంతో కొద్ది సేపటికి మాలిక్ తనతో పాటు కోబాల్డ్‌పేటకు చెందిన నన్నె, రఫీలను వెంటబెట్టుకుని మయూరి బార్ అండ్ రెస్టారెంట్‌కు వచ్చి అబ్బులుతో ఘర్షణ పడ్డాడు. మాలిక్ జేబులో ఉన్న చిన్నపాటి కత్తితో అబ్బులు వీపుపై విచక్షణారహితంగా దాడి చేశాడు దీన్ని గమనించిన ఇరువురి స్నేహితులు ఇద్దరిని వేరు చేసి బయటకు తీసుకు వచ్చారు. మాలిక్ బయటకు వెళుతుండగా అబ్బులు అతనిపై దాడికి పాల్పడ్డాడు. సమాచారం తెలుసుకున్న అరండల్‌పేట సీఐ ఆరోగ్యరాజు సిబ్బందితో ఘటనా స్థలంకు చేరుకుని కత్తిపోట్లకు గురైన అబ్బులును జీజీహెచ్‌కు తరలించి మాలిక్, నన్నెలను అదుపులో తీసుకుని స్టేషన్‌కు తరలించారు.