
బడేపురంలో యథేచ్ఛగా అక్రమ మైనింగ్
తాడికొండ: తాడికొండ మండలం బడేపురం గ్రామంలో కూటమి నేతల కనుసన్నల్లో అక్రమంగా మైనింగ్ యథేచ్ఛగా కొనసాగుతోంది. అర్ధర్రాతిళ్లు పొక్లెయిన్ల సాయంతో మట్టి తవ్వి ఇష్టానుసారంగా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రశ్నించిన వారిపై దాడులకు తెగబడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి అక్రమ మైనింగ్ జరుగుతుండగా గుర్తించిన మణికంఠ అనే యువకుడు ఇదేమని ప్రశ్నించాడు. దీంతో యువకుడిపై కూటమి నేతలు బెదిరింపుల పర్వానికి దిగారు. మాకు అడ్డువచ్చేంత మాత్రపు వాడివా, నీ అంతు చూస్తా.. పోలీసు స్టేషన్‌లో పెట్టి కొట్టిస్తా అంటూ బూతు పదజాలంలో బెదిరించారు. దీనిపై సదరు యువకుడు సోమవారం తాడికొండ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఆ యువకుడు మీడియాకు సైతం సమాచారం ఇచ్చి, సోమవారం అర్ధరాత్రి సమయంలో మైనింగ్ ప్రాంతానికి తీసుకెళ్లగా మీడియా ప్రతినిధులను చూసిన కూటమి నేతలు మైనింగ్ వాహనాలు తీసుకుని పరుగులు పెట్టారు. దీనిపై ఇప్పటికే పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు కాగా, విచారించి తగు చర్యలు తీసుకుంటామని సీఐ కె.వాసు తెలిపారు. గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న అక్రమ తవ్వకాలు నిలిపివేయాలని స్థానికులు కోరుతున్నారు.
ప్రశ్నించిన యువకుడికి బెదిరింపులు
తాడికొండ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు