
● వజ్రోత్సవ జూబిలీ ముగింపు వేడుకల్లో విశ్రాంత బిషప్ గ
క్రీస్తు చూపిన మార్గంలో నడుద్దాం
అచ్చంపేట: ప్రతి ఒక్కరూ ఏసుక్రీస్తు చూపిన మార్గంలో నడిచి గౌరవ ప్రదమైన జీవితాన్ని పొందాలని, ఏసు క్రీస్తుపై నమ్మకం ఉంచాలని గుంటూరు, వైఎస్సార్ జిల్లాల విశ్రాంత బిషప్ గాలిబాలి అన్నారు. మండలంలోని తాళ్లచెరువులో బాలఏసు దేవాలయం నిర్మాణం జరిగి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా గత మూడు రోజులుగా జరుగుతున్న జూబిలి వేడుకలు సోమవారం రాత్రితో ముగిశాయి. ముగింపు కార్యక్రమంలో 8 జిల్లాల నుంచి వచ్చిన మేత్రాసన పీఠాధిపతులు, 100 మంది కన్యాసీ్త్రలు, 50 మంది విచారణ గురువులు పాల్గొని తమ సందేశాన్ని ఇచ్చారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న గుంటూరు, వైఎస్సార్ జిల్లాల విశ్రాంత పీఠాధిపతి గాలిబాలి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు పరస్పర ప్రేమాభిమానాలు కలిగి ఉండాలన్నారు.
వైభవంగా తేరు ప్రదక్షిణ
విశాఖపట్నం అగ్రిపీఠాధిపతులు ఉడముల బాల, నల్గొండ జిల్లా విశ్రాంత పీఠాధిపతి గోవిందుజోజి, ఏలురు పీఠాధిపతి పొలిమేర జయరావు, శ్రీకాకుళం పీఠాధిపతులు రాయరాల విజయకుమార్, నెల్లూరు మేత్రాసన కోఆజ్యుటర్ పీఠాధిపతులు పిల్లి అంథోనిదాస్, వరంగల్ మేత్రాసన పరిపాలాధికారి విజయపాలేరెడ్డిలతో పాటు అనేమంది విచారణ గురువులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. స్థానిక విచారణ గురువులు పుట్టి అంతోనిరాజు, సహాయ విచారణ గురువులు శ్యామ్‌కుమార్ ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా బాలికలు ప్రదర్శించిన నృత్యరీతులు ఆహుతులను ఆకట్టుకున్నాయి. పలు ప్రాంతాలనుంచి క్రైస్తవులు తండోప తండాలుగా తరలి వచ్చారు. రాత్రి 10 గంటలకు నిర్వహించిన తేరు ఊరేగింపు ఎంతో ఆకట్టుకుంది. రంగురంగుల కాంతులతో బాణసంచా కాలుస్తూ గ్రామ వీధులలో తేరు (రథం)పై బాలఏసును అలంకరించి గ్రామోత్సవం నిర్వహించారు. వివిధ ప్రాంతాలనుంచి, గ్రామాలనుంచి తరలి వచ్చిన భక్తుల కోసం ప్రత్యేక కౌంటర్స్ ద్వారా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.