పాత్రికేయులపై దాడులు సిగ్గుచేటు
పట్నంబజారు: పాత్రికేయులపై కూటమి నేతలు దాడులు చేయటం సిగ్గుచేటని ఎమ్మెల్సీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ధ్వజమెత్తారు. పల్నాడు జిల్లా కారంపూడిలో కూటమినేతల చేతిలో దాడికి గురైన సాక్షి ఎలక్ట్రానిక్ మీడియా బ్యూరో ఇన్‌చార్జ్ అశోక్ వర్ధన్‌ను మంగళవారం ఏటీ అగ్రహారంలోని ఆయన నివాసంలో పరామర్శించారు. దాడి జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అప్పిరెడ్డి మాట్లాడుతూ నిజాలను నిర్భయంగా తెలియజేసే పత్రికలు, పాత్రికేయులపై ఇటువంటి దాడులు హేయమైన చర్య అని అన్నారు. కేవలం ఉద్దేశపూర్వకంగా ‘సాక్షి’పై కావాలనే కూటమి నేతలు దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతను ప్రజలకు చాటి చెబుతుందన్న అక్కస్సుతోనే పాత్రికేయులపై దాడి చేశారని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి దాడులు సరికాదన్న విషయాన్ని గుర్తించాలన్నారు. అశోక్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, తక్షణమే నిందితులపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆయనవెంట కార్పొరేటర్లు షేక్ రోషన్, అచ్చాల వెంకటరెడ్డి, నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పరిశపోగు శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.
సాక్షి టీవీ ప్రతినిధిపై దాడి గర్హనీయం
సాక్షి, అమరావతి: పల్నాడు జిల్లాలో బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన సాక్షి టీవీ ప్రతినిధి అశోక్ వర్ధన్‌పై సర్పంచి వంటి రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వారే దాడులకు పాల్పడడం గర్హనీయమని అఖిల భారత బ్రాహ్మణ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు ద్రోణంరాజు రవికుమార్ పేర్కొన్నారు. మంగళవారం అశోక్‌ను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఫోర్త్ ఎస్టేట్‌గా పిలవబడే పత్రికలు, పత్రికా విలేకరులు, మీడియా ప్రతినిధులపై దాడులు సహేతకం కాదని పేర్కొన్నారు. ఇలాంటి దాడులను అన్ని వర్గాల వారు ఖండించాలని.. బాధ్యులపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


