
చిగురించిన ఆకుపచ్చ ఆశ
ఇదో అద్భుతమైన ప్రకృతి దృశ్యం...పట్టణ బోసు రోడ్డులో టౌన్ చర్చికి ఎదురుగా గల రావిచెట్టు ఇది. మూడు దశాబ్దాలుగా నిలబడే ఉంది. దాని కింద నడిచిన కాలాలెన్నో! అక్కడి నీడలో విశ్రమించిన వారెందరో! అయితే, ఈ చెట్టుకు మాత్రం తన జీవన గమనం ఎప్పుడూ ఒకేలా ఉంటోంది. ఏటా వర్షం, ఎండ, గాలి, చలిలో ఒకే విధంగా ఉండే చక్రం. గత సంవత్సరం ఏప్రిల్ 14కు అకస్మాత్తుగా చెట్టు కొద్దికొద్దిగా ఆకులన్నీ కోల్పోయింది. అది చెట్టుకి సహజమైన విశ్రాంతి. ప్రకృతితో గల అవినాభావ సంబంధంలో అదో చిన్న విరామం మాత్రమే. నెల రోజుల్లో, ఎవ్వరూ ఊహించనంత త్వరగా పచ్చని కోటు వేసుకుంది. కొత్త ఆకులు, కొత్త ఆశలు, కొత్త జీవం. ఇప్పుడు మళ్లీ 2025లో అదే సన్నివేశం. గత ఏప్రిల్ 14వ తేదీకి ఆకులన్నీ రాలాయి. మే నెల 14వ తేదీ వచ్చేసరికి, అదే చెట్టు మళ్లీ తన సహజ రూపాన్ని చూపింది. ప్రతి కొమ్మలోనూ ఆకులోనూ పచ్చదనం పునరుజ్జీవించింది. అలా చెట్టు ఏటా తన జీవన శైలిని కళ్లకు కడుతోంది. అది ఒక్క చెట్టుకే కాదు...మనిషికీ ఇదే వర్తిస్తుంది. కోల్పోయిన దశ తర్వాత జీవితం తిరిగి వెలుగు చూస్తుంది. గతి తప్పని చీకటి ఉన్నా.. ప్రకృతి తన క్రమశిక్షణతో తిరిగి వెలుగు తెస్తుంది. మన జీవితం కూడా అలా సాగాలి...నమ్మకంతో, సహనంతో, మళ్లీ ముందుకు సాగాలనేది చెట్టు చెప్పే పాఠం. జీవితంలో ఎదురయ్యే కష్ట కాలాలకూ, నిరాశలకూ ఒక బలమైన ప్రతీక. తాత్కాలికంగా కోల్పోయిన వెలుగు, నిశ్చితంగా మళ్లీ వస్తుందన్న ఆశను అది సూచిస్తోంది. ఆకుపచ్చని ఆశ అది.
–తెనాలి

చిగురించిన ఆకుపచ్చ ఆశ