వైద్యులే నిజమైన హీరోలు | - | Sakshi
Sakshi News home page

వైద్యులే నిజమైన హీరోలు

Mar 24 2025 2:34 AM | Updated on Mar 24 2025 2:33 AM

గుంటూరు మెడికల్‌: ఒక డాక్టర్‌ను తయారు చేసేందుకు ప్రభుత్వం ఏడాదికి రూ.1.72 కోట్లు ఖర్చు చేస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ చెప్పారు. ప్రజా సొమ్ముతో డాక్టర్లయిన వారు తమ సేవల ద్వారా సమాజానికి తిరిగి ఇవ్వాలని సూచించారు. గుంటూరు జీజీహెచ్‌లో 108 గుండె బైపాస్‌ సర్జరీలు విజయవంతంగా చేసిన ప్రముఖ గుండె, ఊపిరితిత్తుల మార్పిడి వైద్యులు, పద్మశ్రీ డాక్టర్‌ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలేను ఆదివారం గుంటూరు వైద్య కళాశాల జింకానా ఆడిటోరియంలో ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌(ఐఎంఏ) ఆధ్వర్యంలో సన్మానించారు. అలాగే కార్డియాలజీ వైద్య విభాగంలో 25,000 ప్రొసీజర్స్‌, 5,000 పీటీసీఏ ప్రొసీజర్స్‌ చేసిన వైద్యులను సన్మానించారు. ముఖ్య అతిధిగా హాజరైన మంత్రి సత్యకుమార్‌ మాట్లాడుతూ వైద్యులు నిజమైన హీరోలని, చరిత్రలో నిలిచిపోయేలా మంచి పనులు చేయాలని పేర్కొన్నారు. సేవాభావం కలిగి ఉండాలని చెప్పారు. రాష్ట్రంలో ఎన్‌సీడీ కార్యక్రమం ద్వారా స్క్రీనింగ్‌ పరీక్షలు చేయిస్తున్నామని, 1.8 కోట్ల మందికి స్క్రీనింగ్‌ పూర్తి చేసినట్లు తెలిపారు. వీరిలో కొత్తగా 10 లక్షల మంది అధిక రక్తపోటు, 10 లక్షల మంది షుగర్‌ బారిన పడ్డారని వివరించారు. క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ పరీక్షల్లో 60వేల మంది రోగులను గుర్తించినట్టు వెల్లడించారు. స్టెమి కార్యక్రమం ద్వారా గుండె పోటు వచ్చిన 2,224 మందికి ఇంజెక్షన్లు ఇచ్చి ప్రాణాలు కాపాడామన్నారు. డాక్టర్‌ గోఖలేను అభినందించారు.

జీజీహెచ్‌కు గొప్ప చరిత్ర

మాజీ మంత్రి, ఎమ్మెల్యే డాక్టర్‌ కామినేని శ్రీనివాస్‌ మాట్లాడుతూ తాను గుంటూరు జీజీహెచ్‌లో జాయింట్‌ రీప్లేస్‌మెంట్‌ సర్జరీ చేయించుకోవటానికి రెండు ఘటనలు కారణమని చెప్పారు. జీజీహెచ్‌లో ఎలుకల దాడిలో పసికందు మృతిచెందిందని, సెల్‌ఫోన్‌ వెలుతురులో ప్లాస్టిక్‌ సర్జరీ వైద్యులు ఆపరేషన్‌ చేశారని ‘సాక్షి’ మీడియాలో వార్తలు ప్రచురితం అయినట్లు చూసి జీజీహెచ్‌పై పేదలకు నమ్మకం కలిగించేందుకు ఆపరేషన్‌ చేయించుకున్నట్లు వెల్లడించారు. ఆపరేషన్‌ చేయించుకుని ఎనిమిదేళ్లయిందని, చాలా సంతృప్తిగా ఉందని పేర్కొన్నారు. గుంటూరు వైద్య కళాశాలకు ఎంతో గొప్ప చరిత్ర ఉందని, ఇక్కడ చదువుకున్న ఏడుగురు వైద్యులకు పద్మశ్రీలు రావటం చాలా గొప్ప విషయమని చెప్పారు.

లివర్‌ మార్పిడి ఆపరేషన్లకు ఏర్పాట్లు

గుంటూరు వైద్య కళాశాల పూర్వ విద్యార్థులు జింకానా పేరుతో మాతృసంస్థ అభివృద్ధికి చేస్తున్న సేవలు ఆదర్శనీయమని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు చెప్పారు. వంద ఆపరేషన్లు పూర్తిచేసిన గోఖలేను అభినందించారు. విశాఖలో ఇటీవల లివర్‌ మార్పిడి ఆపరేషన్‌ చేశారని, గుంటూరు జీజీహెచ్‌లో కూడా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

సేవా భావం కలిగి ఉండాలి

వైద్యఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌యాదవ్‌ వంద గుండె ఆపరేషన్లు చేసిన డాక్టర్‌ గోఖలేకు సన్మానం

త్వరలో గుండె మార్పిడి ఆపరేషన్లు

సన్మాన గ్రహీత డాక్టర్‌ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే మాట్లాడుతూ వైద్యులు ఆరోగ్యవంత సమాజానికి సాధ్యమైనంత కృషి చేయాలన్నారు. త్వరలో జీజీహెచ్‌లో గుండె మార్పిడి ఆపరేషన్లు చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ గార్లపాటి నందకిషోర్‌, నగర సెక్రటరీ డాక్టర్‌ బి.సాయికృష్ణ, జాయింట్‌ సెక్రటరీ డాక్టర్‌ చండ్ర రాధిక రాణి, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ నాగళ్ల కిషోర్‌, స్టేట్‌ జాయింట్‌ సెక్రటరీ డాక్టర్‌ తాతా సేవకుమార్‌, గుంటూరు మెడికల్‌ కాలేజ్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎన్‌.వి.సుందరాచారి, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎస్‌ఎస్‌వీ రమణ , సీటీఎస్‌ విభాగాధిపతి డాక్టర్‌ హరికృష్ణమూర్తి, కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్‌ నాతానీ శ్రీకాంత్‌, ఎనస్థీషియా వైద్య విభాగాధిపతి డాక్టర్‌ పోలయ్య పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement