గట్లు తెగకపోవడానికి ఆయనే కారణం

Vipparthi Venugopala Rao Write on Godavari Etigattu, Floods Control - Sakshi

గోదావరి నది చరిత్రలోనే మూడవ అతి పెద్ద వరదను చూశాం. సాధారణంగా ఆగస్టు నెలలో గోదావరికి పెద్ద వరదలు వస్తాయి. అటువంటిది చరిత్రలో మొదటిసారి జూలై నెలలో అతి పెద్ద వరదను చూడాల్సి వచ్చింది. అయినా వరదను ప్రభుత్వం విజయవంతంగా ఎదుర్కొంది. కొన్నిచోట్ల గట్లు దాటి ప్రవహించినా గండ్లు పడకపోవడానికి ఏకైక కారణం దివంగత మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర రెడ్డి ముందు చూపు... దార్శనికతలు మాత్రమే అంటే అతిశయోక్తి కాదు.

1847– 55 మధ్య ధవళేశ్వరం వద్ద గోదావరిపై సర్‌ ఆర్థర్‌ కాటన్‌ మహాశయుడు ఆనకట్ట నిర్మాణం చేశారు. 1851 నుంచి పి.గన్నవరం వద్ద అక్విడెక్టు నిర్మాణం కూడా చేపట్టారు. ఆ సమయంలో గోదావరి వరద నియంత్రణ పనులు కూడా ఆరంభించారు. దీనిలో భాగంగా బ్యారేజ్‌ ఎగువ అఖండ గోదావరి, దిగువన గోదావరి నదీ పాయల చుట్టూ ఏటిగట్ల నిర్మాణాలు ఆరంభించారు. నాటి నుంచి నేటి వరకు పలు సందర్భాలలో వరద ఉధృతిని బట్టి ఏటిగట్ల ఎత్తును పెంచుకుంటూ వస్తున్నాం.

గోదావరికి 2006లో రెండవ అతిపెద్ద వరద వచ్చింది. ఈ వరద వల్ల ఇప్పటి కోనసీమ జిల్లాలోని అయినవిల్లి మండలం శానపల్లి లంక, పి. గన్నవరం మండలం మొండెపు లంకల వద్ద ఏటిగట్లకు గండ్లు పడ్డాయి. పెద్దగా ప్రాణ నష్టం లేకున్నా అంతులేని ఆస్తి నష్టం సంభవించింది. నాడు వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్సార్‌ ఏటిగట్లను పటిష్ఠం చేసే పనులు చేపట్టమని ఆదేశించారు. 2008 నుంచి డెల్టాలో ఏటిగట్లను పటిష్ఠం చేసే పనులు ఆరంభమయ్యాయి.

గోదావరి ఏటిగట్ల విస్తీర్ణం సుమారు 530 కి.మీ.లు. పటిష్ఠం చేసే పనులకు వైఎస్సార్‌ రూ. 650 కోట్లు కేటాయించారు. 1986 వరదను ప్రామాణికంగా తీసుకున్నాం. నాడు వచ్చిన మాగ్జిమమ్‌ ఫ్లడ్‌ లెవెల్‌ (ఎంఎఫ్‌ఎల్‌)కు రెండు మీటర్లు (6.56 అడుగులు) ఎత్తు చేయడం, గట్టు ఎగువ భాగంలో (టాప్‌ విడ్త్‌) 6.5 మీటర్లు (21.32 అడుగులు) వెడల్పున పటిష్ఠం చేశాం. వైఎస్సార్‌ హయాంలోనే 80 శాతం పనులు పూర్తయ్యాయి. సాంకేతిక కారణాలు, ఇతర కారణాల వల్ల కొన్ని ప్రాంతాల్లో నిర్మాణాలు జరగకున్నా అటు గోదావరి, ఇటు గోదావరి పాయల చుట్టూ మహాకుడ్యం ఏర్పడింది. 

ప్రస్తుతం వచ్చిన వరద వల్ల బ్యారేజ్‌ నుంచి దిగువకు 25 లక్షల 63 వేల 833 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. అయినా గట్లకు నష్టం వాటిల్ల లేదు. నాడు ఏటిగట్లను పటిష్ఠం చేయకుంటే ఇప్పుడు కోనసీమ, కాకినాడ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు తీవ్ర విపత్తును చవిచూడాల్సి వచ్చేది. వైఎస్సార్‌ దార్శనికతే గోదావరి తీర ప్రాంత జనాన్ని కాపాడింది. ఈ మహాయజ్ఞంలో ఇరిగేషన్‌ అధికారిగా (హెడ్‌వర్క్స్‌ డీఈఈ, ఈఈ) నేనూ భాగస్వామిని కావడం గర్వంగా అనిపిస్తోంది. (క్లిక్: ‘బురద జల్లుదాం ఛలో ఛలో’)


- విప్పర్తి వేణుగోపాలరావు 
తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్‌ చైర్మన్‌; రిటైర్డ్‌ ఎస్‌ఈ, ధవళేశ్వరం ఇరిగేషన్‌ సర్కిల్‌

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top