రాయని డైరీ: జో బైడెన్‌ (అమెరికా అధ్యక్షుడు)

USA President Joe Biden Guest Column By Madhav Singaraju - Sakshi

అధ్యక్షుడిగా వైట్‌ హౌస్‌లోకి వచ్చాక ఇది నా ఫస్ట్‌ సోలో ప్రెస్‌ కాన్ఫరెన్స్‌.  ‘‘కమలా హ్యారిస్‌ ఎక్కడికి వెళ్లారు మిస్టర్‌ ప్రెసిడెంట్‌’’ అని తొలి ప్రశ్న! నిజానికైతే ఆ ప్రశ్నకు నేను అదిరిపడాలి. అదిరిపడేంత ఓపిక లేకపోయింది. ఒక మంచి ప్రశ్నతో నేను నా ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ని ప్రారంభించడానికి సహాయ పడేలా వాళ్ల దగ్గర అనేకమైన ప్రశ్నలు ఉండక పోవు. ‘వ్లాదిమిర్‌ పుతిన్‌ పళ్లు ఎలా రాలగొట్ట బోతున్నారు?’ అని అడగొచ్చు. ‘జిన్‌పింగ్‌ నిరంకుశత్వపు తోకను మొత్తంగా మొదలు దగ్గరే కత్తిరిస్తారా లేక తోక చివర కొద్దిగా కత్తిరించి యాంటీబయాటిక్కేమీ రాయకుండా అలా వదిలేస్తారా?’ అని అడిగి తెలుసు కోవచ్చు. ‘ఉత్తర కొరియాలో ఉండే కిమ్‌ బెటరా, కాంగ్రెస్‌లో మీ ఎదురు సీట్లలో కూర్చునే రిపబ్లికన్‌లు బెటరా?’ అని అర్థవంతమైన ప్రశ్నొకటి వేయవచ్చు. కనీసం ట్రంప్‌ని గుర్తు చేసి నన్ను చికాకు పరచవచ్చు. ఇవన్నీ వదిలేసి, ‘కమలా హ్యారిస్‌ ఎక్కడికి వెళ్లారు మిస్టర్‌ ప్రెసిడెంట్‌’’ అని అడుగుతున్నారు! వంశానికి ఒక్క ఆడపిల్ల అయినందువల్లనేనా?!
‘‘నేను తనని వేరే పనుల మీద పంపించాను’’ అని చెప్పాను. 
‘కమలకు అప్పుడే పనులు చెప్పడం మొదలుపెట్టేశారా’ అని అడిగేసింది ఒక అమ్మాయి!
‘‘ఏ చానల్‌ అమ్మా’’ అని అడిగాను.
‘‘సీఎన్‌ఎన్‌’’ అంది.
‘‘సీఎన్‌ఎన్‌లో ఎప్పుడు చేరావ్‌!’’ అన్నాను.
‘‘చేరలేదు. ట్రెయినీగా ఉన్నాను’’ అంది.
‘‘నువ్వింకా ట్రెయినీగా ఉన్నప్పుడే సీఎన్‌ఎన్‌ నిన్ను అమెరికన్‌ ప్రెసిడెంట్‌ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌కి పంపింది! మరి కమలను నేను ముఖ్యమైన పనుల మీద ఎందుకు పంపకూడదు?!’’ అన్నాను. 
‘‘ఏమిటా ముఖ్యమైన పనులు?’’అని మరొక కుర్ర జర్నలిస్టు గద్దించినట్లుగా అడిగాడు! వీళ్లంతా కమలాహ్యారిస్‌కు ఫ్యాన్స్‌లా అనిపిస్తున్నారు. వాళ్ల హెడ్‌లను అడిగి మరీ ఈ అసైన్‌మెంట్‌ వేయించుకుని వచ్చినట్లున్నారు. 
‘‘ఓకే ఓకే.. మనతో కమలా హ్యారిస్‌ లేకపోవడం నాకూ లోటుగానే ఉంది. కానీ ప్రెసిడెంట్‌ సోలో ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ అంటే ప్రెసిడెంట్‌ ఒక్కడే మాట్లాడతాడని ట్రెయినింగ్‌లో మీకు చెప్పలేదా?’’ అని నవ్వాను. 
‘‘ప్రెసిడెంట్‌ సోలో కాన్ఫరెన్స్‌లో మాట్లాడేది ప్రెసిడెంటే అయినా, ఆయన పక్కన వైస్‌ ప్రెసిడెంట్‌ కూర్చోకూడదనేమీ లేదుగా మిస్టర్‌ ప్రెసిడెంట్‌?’’ అంది సీఎన్‌ఎన్‌ అమ్మాయి. 
‘‘మంచి ఆలోచన’’ అన్నాను.  
‘‘వైస్‌ ప్రెసిడెంట్‌ కమలా హ్యారిస్‌ని ఏ ముఖ్యమైన పనుల మీద మీరు పంపారో మేము తెలుసుకోవచ్చా మిస్టర్‌ ప్రెసిడెంట్‌..’’ అని మళ్లీ ఆ కుర్ర జర్నలిస్టు అడిగాడు!
‘‘వెల్, హ్యారిస్‌పై మీ అభిమానం నన్ను కట్టిపడేస్తోంది. ఎంతగానంటే నేనూ ఒక జర్నలిస్టునై మీ మధ్యలో కూర్చొని.. ‘కమలను ఏం చేశావు మిస్టర్‌ ప్రెసిడెంట్‌’ అని అడగాలన్నంతగా. అన్నీ నేనే చేయాలను కోవడం ఆమెలోని తల్లి మనసును అవమానించినట్లు అవుతుంది. అందుకే మెక్సికో సరిహద్దు నుంచి అమెరికాలోకి వలస వచ్చే తల్లీబిడ్డలకు వేళకు ఆహారం అందించే ముఖ్యమైన పనిని హ్యారిస్‌కు అప్పగించాను..’’  అని చెప్పాను.
‘‘మిస్టర్‌ ప్రెసిడెంట్‌.. మీ ఫిట్‌నెస్‌ గురించి నాదొక ప్రశ్న’’.. మొదటి వరుసలోని వారెవరో చెయ్యెత్తారు.
‘‘నాకు తెలుసు. విమానం మెట్లెక్కుతూ మూడుసార్లు తూలిపడిన నేను రెండో టర్మ్‌లో కూడా ప్రెసిడెంట్‌గా నిలబడతానా అనే కదా మీ ప్రశ్న. తప్పకుండా నిలబడతాను’’ అన్నాను. 
సీఎన్‌ఎన్‌ అమ్మాయి సీరియస్‌గా నా వైపే చూస్తోంది!
‘అప్పుడు కూడా మీరే ప్రెసిడెంటా..’ అన్నట్లు చూడటం లేదు. ‘అప్పుడు కూడా సోలో ప్రెస్‌ కాన్ఫరెన్సేనా’ అన్నట్లు చూస్తోంది!

-మాధవ్‌ శింగరాజు 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top