Adrushta Deepak: అక్షర యోధుడు అదృష్టదీపుడు

Telugu Lyricist, Singer, Actor Adrushta Deepak Death Anniversary - Sakshi

అతను ‘ఎర్రజెండా నా ఎజెండా’ అని నినదించిన నిబద్ధత గల అభ్యుదయ కవి. సినిమా పాటకు కొత్త బాట వేసిన గేయకవి. నటుడు, గాయకుడు, ఉత్తమ ఉపన్యాసకుడు. చాలామందికి తెలియని అతని పూర్తి పేరు – సత్తి అదృష్ట దీప రామకృష్ణారెడ్డి. విద్యార్థి దశలోనే శ్రీశ్రీని అభిమానించిన దీపక్‌ శ్రీశ్రీ గేయాలను సభల్లోనూ, సమావేశాల్లోనూ వీరావేశంతో ఆలపించేవాడు. ‘అరసం’, ప్రజా నాట్యమండలి వంటి సంస్థలలో క్రియాశీల పాత్ర పోషించాడు.

‘కోకిలమ్మ పదాలు’తో కలంపట్టిన దీపక్‌... ‘అగ్ని’, ‘ప్రాణం’, ‘అడవి’ కవితా సంపుటాలనూ, ‘దీపక రాగం’ సాహిత్య వ్యాస సంపుటినీ వెలువరించాడు. అతని కుటుంబ సభ్యులు ప్రచురించిన ‘దీపం’ వ్యాస సంకలనం, అభిమానులు ప్రచురించిన ‘తెరచిన పుస్తకం’ జీవిత చరమాంకంలో వెలుగుచూసిన కానుకలు! ‘సాక్షి’ ఫన్‌డేలో ‘పదశోధన’ పేరుతో 640 వారాలుగా నిర్వహించిన పదబంధ ప్రహేళిక శీర్షిక తెలుగు భాష మీద దీపక్‌కు ఉన్న పట్టుకు నిదర్శనం.

ప్రముఖ నటుడు, నిర్మాత మాదాల రంగారావు ‘ప్రాణం’ చదివి ముగ్ధుడై ‘యువతరం కదిలింది’ (1980)లో పాటలు రాయమని పిలవడంతో అయాచితంగా అదృష్ట దీపక్‌ సినీ రంగంలో అడుగుపెట్టాడు. ఆ చిత్రంలో ‘ఆశయాల పందిరిలో’ అంటూ దీపక్‌ రాసిన పాట రెండు దశాబ్దాల పాటు నలభై సినిమా పాటల వరకు రాయడానికి దారి దీపమైంది. (చదవండి: శతతంత్రుల మాంత్రికుడు)

‘నేటి భారతం’ చిత్రం కోసం రాసిన ‘మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం...’ బహుళ ప్రాచుర్యాన్ని పొందింది. ‘ఎర్రమల్లెలు’ చిత్రం కోసం రాసిన ‘మేడే’ గీతం నేటికీ ఆ రోజున మారుమోగుతూనే ఉంది. తను నమ్మిన సిద్ధాంతాలకు విరుద్ధంగా చవకబారు పాటల్ని రాయడానికి ఇష్టపడక పోవడంవల్ల ‘నేను సైతం’ (2004) చిత్రం తర్వాత అతను చిత్ర పరిశ్రమకు దూరమయ్యాడు. ‘అక్షరాలే వేళ అగ్ని విరజిమ్మాలి’ అంటూ యువతరాన్ని ఉత్తేజపరిచిన అదృష్ట దీపక్‌ చిరస్మరణీయుడు. (చదవండి: కైఫియత్తులే ఇంటిపేరుగా...)

– డాక్టర్‌ పైడిపాల, సినీ పరిశోధకుడు
(మే 16న అదృష్ట దీపక్‌ ప్రథమ వర్ధంతి)

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top