లంకలో ఆకలి కేకలు!

Sri Lanka Economic Crisis Guest Column By Jajula Dinesh - Sakshi

సందర్భం

కోవిడ్‌ మహమ్మారి వల్ల 2020 మార్చిలో విధించిన లాక్‌డౌన్‌ శ్రీలంకలోని ప్రధాన రంగాలైన తేయాకు, వస్త్ర, పర్యాటకాల మీద తీవ్ర ప్రభావం చూపింది. దీంతో స్థిరమైన ఆదాయ వనరులు లేని శ్రీలంక ఆర్థిక పరిస్థితి క్రమంగా దిగజారింది. ఆ దేశపు విదేశీ మారకద్రవ్యం కూడా తరిగిపోయి నిత్యావసరాలను దిగుమతి చేసుకునే వెసులుబాటూ లేకుండా పోయింది. దీంతో శ్రీలంక తన చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొం టోంది. లంక ప్రధాన ఆదాయ వనరైన టూరిజం... కోవిడ్‌ సంక్షోభం కారణంగా తీవ్రంగా దెబ్బతింది. 2019లో జరిగిన వరుస బాంబు పేలుళ్లు కూడా శ్రీలంక టూరిజంపై ప్రభావం చూపాయి. కరోనా సంక్షోభం సమయంలో చైనా నుంచి ఎడాపెడా అప్పులు చేయడం కూడా శ్రీలంక కొంప మునగ డానికి ఒక కారణం. నిత్యావసరాల విషయంలో ఎక్కువగా దిగుమతులపైనే ఆధారపడడం సంక్షోభా నికి మరో కారణమైంది.

శ్రీలంకలో విదేశీ కరెన్సీ నిల్వలు తగ్గిపోవడంతో ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. పెట్రోల్‌ రేట్లు అమాంతం పెరిగిపోయాయి. ఇంధన కొరత కార ణంగా దేశవ్యాప్తంగా ప్రజలు నిరసనలకు, ఆందోళన లకు దిగుతున్నారు. పెట్రోల్‌ బంక్‌ల దగ్గర భారీ క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. పలు చోట్ల పెట్రోల్, డీజిల్‌ కోసం క్యూలో నిలబడి వయస్సు పైబడిన వారు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలున్నాయి. పేపర్ల కొరత కారణంగా విద్యార్థుల అన్ని రకాల పరీక్షలను ఇప్పటికే నిలిపివేసింది శ్రీలంక సర్కార్‌. శ్రీలంక ఆర్థిక మంత్రి బసిల్‌ రాజపక్స ఇటీవల రెండు రోజుల పర్య టన కోసం భారత్‌ వచ్చి... అత్యవసరమైన ఆహారం, మందుల సేకరణ కోసం సహాయం అర్థించారు. మనకు శ్రీలంకకు  మధ్య సంబంధాలు ఒకప్పటిలా లేనప్పటికీ... 1 బిలియన్‌ యూఎస్‌ డాలర్ల ఆర్థిక సాయం ప్రకటించింది భారత్‌. పెట్రోలియం ఉత్ప త్తులు కొనుగోలు చేసేందుకు మరో 500 మిలియన్‌ డాలర్ల రుణ సాయం ప్రకటించింది.

2019 ఎన్నికల్లో గోటబయ రాజపక్స ఘన విజయం సాధించారు. అప్పటి నుంచి ఆయన కుటుంబ పాలన కొనసాగుతోంది. ప్రధానిగా అన్న మహీంద రాజపక్స, తమ్ముడు గోటబయ రాజపక్స అధ్యక్షుడిగా, మరో తమ్ముడు బసిల్‌ రాజపక్స ఆర్థిక మంత్రిగా కొనసాగుతున్నారు. వీరు అనుసరిస్తున్న విధానాలు శ్రీలంకకు ఉరితాళ్లుగా మారాయి. రాజ పక్స కుటుంబం తలపెట్టిన ఆర్థిక, వ్యవసాయ విధా నాలు పూర్తిగా విఫలమయ్యాయి. పన్నులను బాగా తగ్గించడంతో రెవెన్యూ లోటు 2022 నాటికి 15 శాతా నికి చేరుకుంది. ద్రవ్యోల్బణం 17.5 శాతానికి పెరి గింది. నిరసనలు నిత్యకృత్యమయ్యాయి. 2010 నుంచే విదేశీ అప్పులు అపరిమితంగా పెరిగి పోయాయి. విదేశీ అప్పులు 700 కోట్ల డాలర్ల వరకు చెల్లించాల్సి ఉండగా ప్రస్తుతం ఆ దేశం వద్ద 230 కోట్ల డాలర్ల విదేశీ మారక ద్రవ్యం మాత్రమే ఉంది. ఎన్నికల ప్రయోజనాల కోసం స్వల్పకాలిక, స్వార్థ పూరిత తప్పుడు ఆర్థిక విధానాలు అమలు చేయడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది.

ప్రస్తుతం శ్రీలంకలో ధరలు ఆకాశాన్ని అంటు తున్నాయి. కిలో చికెన్‌ రూ. 800, కోడి గుడ్డు ఒక్కోటి రూ. 35, కిలో ఉల్లిపాయలు రూ. 200 – రూ. 250, కేజీ పాల పొడి రూ. 1,945, కేజీ గోధుమ పిండి రూ. 170–220... ఇవీ అక్కడి నిత్యాసరాల ధరలు!

శ్రీలంక  కొన్నేళ్ల క్రితం హంబటోటాలో చైనా పెట్టుబడితో ఒక భారీ పోర్టు ప్రాజెక్టును ప్రారంభిం చింది, కానీ వంద కోట్ల డాలర్ల ఆ ప్రాజెక్టు అప్పులు, చైనా కాంట్రాక్టర్ల కారణంగా వివాదంలో కూరుకు పోయింది. ఆ తర్వాత, అది ఏ మాత్రం లాభ దాయకం కాదని తేలడంతో పాటు రుణభారంతో కుంగిపోయింది. చాలా సందర్భాల్లో చైనా దగ్గర తీసు కున్న అప్పుల్ని తీర్చడానికి పేద దేశాలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. శ్రీలంక దుస్థితికి చైనాకు చెల్లించా ల్సిన అప్పులూ ఒక కారణమే అనేది మరువరాదు.

జాజుల దినేష్‌
వ్యాసకర్త పొలిటికల్‌ సైన్స్‌ లెక్చరర్‌
మొబైల్‌: 96662 38266

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top