KCR National Party: ‘పార్టీ’టైమ్‌... కాసింత కామెడీగా!

Social Media Funny Reaction, Trolls on KCR National Party - Sakshi

సారాంశం: సరికొండ చలపతి

‘జనం  కమెడియన్లను సీరియస్‌గా, పొలిటీషియన్లను కామెడీగా తీసుకుంటున్నారని’... ఓ అమెరికా పెద్దమనిషి చెప్పి దాదాపు వందేళ్ల య్యింది. ఇంకా అదే ట్రెండ్‌ కొసాగుతున్న ట్టుంది.. ఇది చూడండి..

ముందస్తు అరెస్ట్‌లు, హైటెక్‌ సిటీ చుట్టుపక్కల ప్రాంతాల్లో బందోబస్తు.. 100 మంది అదుపులోకి.. 3 గంటలపాటు ఉద్రిక్తత.. 1,500 మంది పోలీసుల మోహరింపు.. బారికేడ్లు, బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాలు... కామెడీ షో ప్రశాంతంగా పూర్తయింది..
– ఇదీ ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన మునావర్‌ స్టాండప్‌ కామెడీ షో తీరు.

5వ తారీఖున కేసీఆర్‌ జాతీయ పార్టీ ప్రకటన గురించి ఐక్యరాజ్య సమితి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది.. ట్రంప్, పుతిన్, కిమ్‌లాంటి వాళ్లు కేసీఆర్‌ బ్యాచ్‌తో టచ్‌లో ఉన్నారు.
రాబోయే రోజుల్లో కేసీఆర్‌ ‘ప్రపంచ రాష్ట్ర సమితి’ (పీఆర్‌ఎస్‌) పార్టీ పెడితే మన పరిస్థితి ఏమిటీ 
అని పలువురు దేశాధినేతలు తర్జన భర్జన 
పడుతున్నారు.. పీఆర్‌ఎస్‌లో ఉండడమా, స్వతంత్రంగా ఉండడమా అనేదానిపై చర్చలు జరుగుతున్నాయి.
– ఇదీ  కేసీఆర్‌ జాతీయ పార్టీ బీఆర్‌ఎస్‌ ప్రకటన తర్వాత సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న మెసేజ్‌.

ఇట్లా.. కామెడీ సీరియస్‌గా.. పాలిటిక్స్‌  కామెడీగా!
‘మన వాళ్లు వట్టి  వెధవాయిలు..’
ఇందిరమ్మ సృష్టించిన ఎమర్జెన్సీ చీకట్లలో  ఉదయించిన ‘జనతా’లాగా.. 
పంచమ స్వరాన్ని దళిత శంఖారావంలా దేశ వ్యాప్తం చేయ ప్రయత్నించిన కాన్షీరాం బీఎస్పీ లాగా...
చాలా కాలం తర్వాత అలా దేశవ్యాప్త సంచలనం..

మోదీ సామ్రాజ్యాన్ని కూలదోయడానికి విజయ దశమి నాడు గాండీవం ఎత్తిన కేసీఆర్‌ జాతీయ పార్టీ ప్రకటన..
మన తెలుగు  ఎన్టీయార్‌ కల ‘భారతదేశం’ పార్టీ భావనను ఆయన వీరాభిమాని కేసీఆర్‌ దేశవ్యాప్తం చేసే అద్భుత సన్నివేశం..
దీన్ని కొంతమంది.. అదీ తెలుగు వాళ్లు.. మరీ తెలంగాణ తల్లి బిడ్దలు.. ఇలా ట్రోల్‌ చేయడం ఆశ్చర్యమే మరి!
జాతీయ పార్టీలు చిన్న మునుగోడు పైనే పడుతుంటే.. జాతీయవాదాన్ని ఎత్తుకున్న తెలు గోడిని మరో తెలుగోడు ప్రశంసించడం మాని.. పరిహసించడమా!
‘ముందుకు పోతానంటే 
ఎందుకు నీ విరగబాటు ఇటనే 
నిలుచో  మందురు..’ అని శ్రీశ్రీ..
‘మన వాళ్లు వట్టి వెధవాయిలోయ్‌..’.. 
అని గురజాడ గిరీశం ఊరికే అన్నారా

పునర్భూదోషం...
జ్యోతిష్యులు కూడా దీన్ని వదలక పోవడం మరింత చిత్రం.. తెలుగు నేలపై ఆధ్యాత్మిక వైభవానికి  కేసీఆర్‌ ఎంత చేస్తున్నారో మనకు తెలుసుగా.. శుభం పలకవచ్చుగా! 
ధనుర్లగ్నంలోనే పార్టీ ప్రకటన జరిగిందట... ఇది అచ్చంగా  రాజులు మరో సామ్రాజ్యంపై దాడిచేసేటప్పుడు పెట్టే ముహూర్తం... యుద్ధానికి ప్రతీక, విజయానికి సూచిక.. తిరుగులేదు అంటూనే..  కాస్త లో–వాయిస్‌లో  కొర్రీలు చూపుతున్నారు. 

దుర్ముహూర్త స్పర్శా దోషం ఉంది., పునర్భూదోషం ఉంది. పలుమార్లు శ్రమించాల్సిందే, నల్లేరుపై నడక కాదు కష్టపడాల్సిందే.. అంటున్నారు. 
ఠాఠ్‌.. అదేమీ లేదు వ్యక్తిగత జాతకం అద్భుతం అని కాస్త హై–వాయిస్‌లో దబాయిస్తున్న  ప్రో– జ్యోస్యులూ ఉన్నారనుకోండి!

ఇదో ‘స్టార్టప్‌’ తరహా...
ఇక సామాజిక మాధ్యమాల్లో తిష్ఠవేసిన విశ్లేషకుల ముచ్చట్లు రకరకాలు..మచ్చుకు ఒకటి..
–  మన దగ్గర ఒక్క పార్లమెంట్‌ ఎన్నికకయ్యే ఖర్చులో బయటి రాష్ట్రాల్లో  నాలుగైదు పార్లమెంట్‌ నియోజక వర్గాలు లాగించవచ్చు. బాగా వనరు లున్న పార్టీ కనుక చిన్నా చితకా పార్టీలను ఆకర్షించవచ్చు. వారికి ఆర్థిక సాయం చేయవచ్చు. ఇదో స్టార్టప్‌ తరహా వ్యవహారం.. ఇది స్టార్టప్‌ల కాలంకదా.. చూద్దాం ఇది సక్సెస్‌ అవుతుందో లేదో.. అని విశ్లేషణ
బాల ‘పిట్టకథ’
ఇంకాస్త కరడు గట్టిన తెలంగాణ వాదులు 
ఓ పిట్టకథ చెబుతున్నారు. 

ఓ పిల్లాడిని తల్లి పిలిచి సీసా మూత తియ్యరా అంది పలుమార్లు ప్రయత్నించాడు. అక్కడే ఉన్న అన్న దాన్ని తీసుకుని ఓ రెండు మార్లు ప్రయత్నించి మూత తీసి హీరోలా తమ్ముడి వైపు చూసి వెళ్లాడు. తమ్ముడు తల్లిని అడిగాడు అన్న ఎలా తీయగలిగాడు అని.. నువ్వు చాలా చాలా సార్లు ప్రయత్నించినప్పుడే అది లూజయింది. మరోమారు నువ్వు ప్రయత్నించినా వచ్చేది అని నవ్విందట! 

కేసీఆర్‌దీ ఇదే తంతు. ఎన్నో దశాబ్దాల  తరబడి జరిగిన  తెలంగాణ ఉద్యమం కీలక దశలో  
జొరబడి  పేరు కొట్టేశాడు అంటూ వెటకారం చేస్తూ... ప్రతిసారీ అన్ని సీసాల మూత తియ్యడం సాధ్యం కాదు... అని నర్మగర్భంగా, కాస్త వ్యంగ్యంగా.. పక్కోడి ప్రయత్నాలు, ఉద్యమాలు,  ఆత్మబలిదానాలు లేకుండా అస్సలు సాధ్యంకాదని సీరియస్‌గా వ్యాఖ్యలు చేస్తున్నారు..

నామ్‌కే వాస్తే..
ఈ సీసాల గొడవ ఇలా ఉండగా..
టీఆర్‌ఎస్‌ నుంచి బీఆర్‌ఎస్‌కు  పేరు మార్పుపై.
‘..సీసా లేబుల్‌ మార్చేస్తే 
 సారా బ్రాందీ అగునే సిరి సిరి మువ్వా..’ 
శ్రీశ్రీ పాటేసుకుంటున్నారు..

గొర్రెలెలా?
కొందరు ఇంకాస్త ముందుకెళ్లి ఇలా డౌటేస్తున్నారు...
ఫర్‌ సపోజ్‌...మన బీఆర్‌ఎస్‌  ఢిల్లీ పీఠం  ఎక్కిందనుకుందాం...
రైతులందరికీ ఉచిత విద్యుత్‌ ఇచ్చుకుంటాం.
కమీషన్లకు కక్కుర్తి పడకుండా కార్పొరేట్లకు రుణ మాఫీ రద్దు చేసి..దానికి బదులు దేశమంతటా దళిత బంధు, రైతు బంధు ఇచ్చుకుందాం.
రాష్ట్రానికో కాళేశ్వరం కట్టుకుందాం.. ఊర్లన్నీ పచ్చగ చేసుకుందాం..
..కానీ, మన గొర్రెల పథకం ఉందిగా.. దేశమంతా గొర్రెలెలా పంచడం? ఇక్కడ మనకు సరిపోకే పక్క రాష్ట్రాలనుంచి తెస్తున్నామాయే! 

(క్లిక్ చేయండి: రేషన్‌ షాపుల్లో కాదు.. గుండెల్లో పెట్టుకుంటాం!)

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top