మాకు చిన్నతనం నుంచి అబ్బిన అలవాటు.. | A Scene Depicting Japanese Cleanliness Written By M Maruti Sastry | Sakshi
Sakshi News home page

మాకు చిన్నతనం నుంచి అబ్బిన అలవాటు..

Jul 4 2026 7:47 AM | Updated on Jul 4 2026 7:47 AM

A Scene Depicting Japanese Cleanliness Written By M Maruti Sastry

హాలండ్‌ – జపాన్‌ మధ్య ‘ఫుట్‌బాల్‌ మ్యాచ్‌'

కొద్ది రోజుల క్రితం అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రంలో హాలండ్‌ – జపాన్‌ మధ్య ‘ఫుట్‌బాల్‌ మ్యాచ్‌’ జరిగింది. వందలాది జపానీయ అభిమానులు, జపాన్‌ నుంచి ప్రత్యేకంగా వెళ్ళి ఆ ఆటను చూచి, అనందించి, తిరిగి వెళ్ళారు. ఆట 2–2 స్కోరుతో ‘డ్రా’గా ముగిసింది. అసలు విశేషం ఆట ముగిసిన తరవాత జరిగింది.

జపాన్‌ నుంచి వచ్చిన అభిమానులందరూ కలిసి, స్టేడియంలో వాళ్ళు కూర్చొన్న భాగాన్ని ఊడ్చి, తుడిచి, అద్దంలా శుభ్రం చేసి, పోగయిన చెత్తను సంచీలలో తీసుకువెళ్ళి కుప్పతొట్లలో పోసి వెళ్ళారు. ‘ఎక్కడికయినా వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు, అక్కడ మా వల్ల పోగయిన చెత్తను మేమే శుభ్రం చేసివెళ్ళటం మాకు చిన్నతనం నుంచి అబ్బిన అలవాటు’ అన్నారట.

ఈ చర్యతో వాళ్ళు మనకు మన సనాతన సంప్రదాయం బోధించే రెండు ముఖ్య ధర్మాలను ఆచరించి చూపిన ట్టయింది. మొదటిది ‘ఆత్మవత్‌ సర్వభూతాని’ – అన్ని ప్రాణులూ మన లాంటివే అన్న ధర్మం. కనక, మన వలన ఇతరులకు కష్టం కలగకూడదు. రెండు, అశుభ్రమైన పరిసరాలలో ఏ పనీ సమర్థంగా, తృప్తికరంగా జరపలేం, కార్యసాధనకు ఏకాగ్రత అవసరం. ఏకాగ్రతకు శుచి శుభ్రతలు దోహదం చేస్తాయి. లౌకికమైన పనుల విషయంలోనూ, ఆధ్యాత్మిక సాధనల విషయాల్లోనూ అన్ని చోట్లా ఇది వర్తిస్తుంది.

యోగ శాస్త్రం చెప్పే యమ, నియమాలలో ప్రప్రథమ నియమం ‘శౌచం’. ‘శౌచం దైవీ గుణం, దాన్ని ఆచరించు; అశౌచం ఆసురీ గుణం, దాన్ని ఆచరించకు’ అని భగవద్గీత బోధిస్తుంది. ముఖ్యంగా పూజా, ధ్యానాది సాధనలలో పరిసరశుద్ధీ, ద్రవ్యశుద్ద్ధీ, శరీరశుద్ధీ మొదలైనవి చిత్తశుద్ధికీ, చిత్త ఏకాగ్రతకూ తోడ్పడతాయి అని పెద్దలు పదే పదే సూచిస్తూ ఉంటారు. జపాను అభిమానులు క్రీడాంగణ శుభ్రత పట్ల చూపిన నిబద్ధతను, ఆస్తిక గణాలు విద్యాలయాలూ, వీధులూ ఇత్యాది బహిరంగ ప్రదేశాలలోనూ, పుణ్యక్షేత్రాలూ, తీర్థాల లాంటి పవిత్ర ప్రదేశాలలోనూ చూపగలిగితే ఫలితాలు మహత్తరంగా ఉంటాయి. – ఎం. మారుతి శాస్త్రి

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement